Panagal Udaya Samudram: నల్లగొండ జిల్లాలో ఎన్నో చారిత్రక కట్టడాలు, ఆలయాలు, ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అలాంటి ప్రత్యేక ప్రాంతాల్లో పానగల్ సమీపంలోని ఉదయ సముద్రం ఒకటి. ఒకప్పుడు రాజుల కాలంలో నిర్మించిన ఈ చారిత్రక జలాశయం.. నేడు సాగునీరు, తాగునీటి అవసరాలు తీర్చడమే కాకుండా ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే ప్రాంతంగా గుర్తింపు పొందుతోంది. చుట్టూ విస్తరించిన నీటి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రశాంతమైన పరిసరాలతో ఫొటో షూట్స్ కు కేరాఫ్ గా మారింది.
ఉదయ సముద్రానికి దాదాపు 900 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. క్రీ.శ. 12వ శతాబ్దంలో పానగల్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన కుందూరు చోళుల కాలంలో ఈ జలాశయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ముఖ్యంగా క్రీ.శ. 1124 ప్రాంతంలో ఉదయరాజు అనే పాలకుడు పట్టణానికి ఈశాన్య దిశలో ఈ భారీ చెరువును నిర్మించినట్లు తెలుస్తోంది. పానగల్‌లోని ఛాయా సోమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్న శాసనాల్లో ఈ జలాశయాన్ని ‘ఉదయాదిత్య సముద్రం’గా పేర్కొన్నారు. కాకతీయుల కాలంలోనూ ఈ ప్రాంతానికి ప్రాధాన్యం ఉన్నట్లు శాసన ఆధారాలు తెలియజేస్తున్నాయి. రాజుల కాలం నుంచి నేటి వరకు ఈ జలాశయం తన ప్రత్యేకతను నిలుపుకుంటోంది.
కాలక్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు అనుసంధానంతో ఉదయ సముద్రం పానగల్ రిజర్వాయర్‌గా రూపాంతరం చెందింది. దీంతో ఈ ప్రాంతంలో వ్యవసాయానికి, ప్రజల తాగునీటి అవసరాలకు ఇది కీలకంగా మారింది. ముఖ్యంగా ఉదయ సముద్రం-బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకం ద్వారా నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని లక్ష ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాలకు తాగునీరు అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ ప్రాజెక్టు రైతులకు ఎంతో ఉపయోగపడుతోంది.
ఉదయ సముద్రం సందర్శనకు వెళ్లేవారు సమీపంలోని పానగల్ చారిత్రక కట్టడాలను కూడా చూడవచ్చు. ముఖ్యంగా ఛాయా సోమేశ్వర ఆలయం, పచ్చల సోమేశ్వర ఆలయాలు శిల్పకళా వైభవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. వీటితో పాటు పానగల్ పురావస్తు మ్యూజియం కూడా చరిత్రపై ఆసక్తి ఉన్నవారికి మంచి సందర్శనీయ స్థలంగా చెప్పుకోవచ్చు.
ఉదయ సముద్రం జలకళ, ప్రకృతి అందాలు, ఉదయం, సాయంత్రం వేళల్లో కనిపించే ఆహ్లాదకరమైన వాతావరణం ఫొటోగ్రఫీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఫ్యామిలీ ఫొటో షూట్స్, నేచురల్ ఫొటోగ్రఫీకి ఈ ప్రాంతం అద్భుతంగా నిలుస్తోంది.
చరిత్ర, ప్రకృతి, ఆధ్యాత్మికత కలగలిసిన ఉదయ సముద్రాన్ని సరైన రీతిలో అభివృద్ధి చేస్తే నల్లగొండ జిల్లాకు మరో మంచి పర్యాటక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. చారిత్రక ఆలయాలను, జలాశయాన్ని అనుసంధానిస్తూ టూరిజం సర్క్యూట్‌గా తీర్చిదిద్దితే స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.
Read Also: స్వామివారి శ్వాసకు దీపం కదలికే సంకేతమా? వాడపల్లి ఆలయంలో అంతుచిక్కని రహస్యం!