Cyclone Akwa Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాను ప్రభావం రైల్వే ప్రయాణాలపై కూడా పడుతోంది. తుఫాను కారణంగా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టిన దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) రెండు కీలక రైళ్ల టైమింగ్స్ మార్చింది. చర్లపల్లి నుంచి షాలిమార్ వెళ్లే ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు, సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ కూడా ఆలస్యంగా బయల్దేరనున్నట్లు ప్రకటించింది. ఈ మార్పులు నవంబర్ 19, 2026న ప్రయాణించే వారికి మాత్రమే వర్తిస్తాయి.
అక్వాన్ తుఫాను తూర్పు తీర ప్రాంతాలకు సమీపిస్తుండటంతో తూర్పు తీర రైల్వే (East Coast Railway) సూచన మేరకు దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం నుంచి అధికారిక బులెటిన్ విడుదలైంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా, రైళ్ల రాకపోకలను పరిస్థితులకు అనుగుణంగా నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
నవంబర్ 19న ప్రయాణించే రెండు రైళ్లకు సంబంధించి కొత్త సమయాలను రైల్వే శాఖ ప్రకటించింది. చర్లపల్లి-షాలిమార్ ఎక్స్ ప్రెస్(18046), ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్(12704) టైమింగ్స్ ను మార్చింది.
⦿ చర్లపల్లి-షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్: ఈ రైలు మొదట నిర్ణయించిన ప్రకారం ఉదయం 8:40 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే, తాజా మార్పుల ప్రకారం మధ్యాహ్నం 3:40 గంటలకు బయలుదేరుతుంది. అంటే ఏకంగా 7 గంటలు ఆలస్యంగా ప్రయాణం ప్రారంభించనుంది.
⦿ సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్ ప్రెస్: ఈ రైలు మధ్యాహ్నం 3:55 గంటలకు బదులుగా సాయంత్రం 5:55 గంటలకు బయలుదేరుతుంది. దీంతో ప్రయాణం రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కానుంది.
రైళ్ల సమయాల్లో మార్పుల గురించి ప్రయాణికులకు సమాచారం అందించేందుకు రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్టేషన్లలోని నోటీసు బోర్డులు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, మీడియా, బల్క్ ఎస్ఎంఎస్‌ల ద్వారా వివరాలను తెలియజేయనున్నారు. నవంబర్ 19న ఈ రెండు రైళ్లలో ప్రయాణించేవారు పాత సమయాలను చూసుకుని స్టేషన్‌కు వెళ్లకూడదు. కొత్త సమయాలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి. చివరి నిమిషంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ముందుగానే రైలు స్టేటస్ ను చెక్ చేసుకోవడం మంచిది.
Read Also: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. రైళ్లు రద్దు, విమాన సర్వీసులకు బ్రేక్!