Cyclone Akwan Impact: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాను తూర్పు తీర ప్రాంతాలను వణికిస్తోంది. తుఫాను ప్రభావంతో ఇప్పటికే రైళ్లు, విమాన సర్వీసులపై అంతరాయం మొదలైంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేయగా, చెన్నై నుంచి యాంగోన్ కు వెళ్లే వీక్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసును క్యాన్సిల్ చేశారు. నవంబర్ 20న తుఫాను తీరం దాటే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
నవంబర్ 20 శుక్రవారం మధ్యాహ్నం నర్సాపూర్, పూరీ మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలను అక్వాన్ తుఫాను దాటనుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గాలుల వేగం గంటకు 110 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తుఫాను ప్రభావం రైల్వే రవాణాపై కూడా పడింది. విశాఖపట్నం-కిరండూల్ మార్గంలో నడిచే రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది.
18515: విశాఖపట్నం-కిరండూల్ ఎక్స్ ప్రెస్.
18516: కిరండూల్-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్.
ఈ రెండు రైళ్లు నవంబర్ 19, 20 తేదీల్లో అందుబాటులో ఉండవు. తుఫాను పరిస్థితులను బట్టి మరిన్ని రైళ్ల విషయంలో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది. ప్రయాణికులు స్టేషన్‌కు వెళ్లే ముందు తమ రైలు నడుస్తుందో? లేదో? తెలుసుకోవాలి.
అక్వాన్ తుఫాను కారణంగా విమాన ప్రయాణాలపైనా ప్రభావం పడింది. చెన్నై నుంచి మయన్మార్‌లోని యాంగోన్‌కు నడిచే వారపు విమాన సర్వీసును రెండు వైపులా రద్దు చేశారు. ఈ నిర్ణయంతో విమానం ఎక్కేందుకు చెన్నై చేరుకున్న రామనాథపురం, తిరునెల్వేలి ప్రాంతాలకు చెందిన 144 మందికి పైగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నెక్ట్స్ ఫ్లైట్ వచ్చే వారం ఉండటంతో వారు తిరిగి తమ ఇళ్లకు వెళ్లాల్సి వచ్చింది. ఇతర విమాన సర్వీసుల క్యాన్సిలేషన్ కు సంబంధించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, విశాఖపట్నం, భువనేశ్వర్ విమానాశ్రయాల ద్వారా ప్రయాణించేవారు ముందుగానే తమ ప్లైట్స్ స్టేటస్ చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
తుఫాను నేపథ్యంలో ఒడిశాలోని గంజాం, గజపతి, కంధమాల్, పూరీ, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపారా జిల్లాలకు నవంబర్ 19న రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముందుజాగ్రత్తగా ఈ జిల్లాల్లో నవంబర్ 19 నుంచి 21 వరకు పాఠశాలలను మూసివేశారు. మరోవైపు తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాలకు నవంబర్ 18, 19 తేదీల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
Read Also: ఆకాశంలో ఇక విమానాల సందడే.. మరో 1,000 విమానాలు వచ్చేస్తున్నాయ్!