Vande Bharat Express Travel: రైలు ప్రయాణం అంటే ఒకప్పుడు గమ్యస్థానానికి చేరుకోవడమే. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ముఖ్యంగా వందే భారత్ లాంటి ఆధునిక రైళ్లలో ప్రయాణించడం చాలామందికి ప్రత్యేక అనుభూతిగా మారింది. కొత్త రైలు.. అందమైన ఇంటీరియర్.. వేగవంతమైన ప్రయాణం.. అత్యాధునిక సౌకర్యాలు.. ఇవన్నీ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. అందుకే, వందే భారత్‌లో తొలిసారి ప్రయాణించేవారు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఇలా ఎందుకు చేస్తారు? సైకాలజీ ఏం చెప్తుందంటే?
సాధారణ రైలు ప్రయాణంతో పోలిస్తే వందే భారత్‌లో ప్రయాణించడం చాలామందికి కొత్త ఎక్స్ పీరియెన్స్ ను ఇస్తుంది. ముఖ్యంగా మొదటిసారి ప్రయాణించేవారు రైలులోని సీట్లు, ఇంటీరియర్, ఆధునిక సౌకర్యాలు, వేగం వంటి ప్రతి విషయాన్ని ఆసక్తిగా గమనిస్తారు. ఆ అనుభూతిని ఇతరులతో పంచుకోవాలనే ఉత్సాహంతో ఫొటోలు, వీడియోలు తీస్తుంటారు. కేరళలో తొలి వందే భారత్ రైలు ప్రారంభమైనప్పుడు ప్రజలు ఇళ్ల బాల్కనీలు, పైకప్పులపైకి వచ్చి రైలును చూశారు. యువత రైలుతో సెల్ఫీలు దిగుతూ వీడియోలు తీశారు. అలాగే ఢిల్లీ నుంచి జైపూర్ వరకు వందే భారత్‌లో ప్రయాణించిన ఓ బ్రిటిష్ ఫ్యామిలీ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 50 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
మనుషులు ఆశ్చర్యం, ఆనందం, ఉత్సాహం కలిగించే విషయాలను ఇతరులతో పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారని పరిశోధనలు చెబుతున్నాయి. ఆశ్చర్యం, కోపం, ఆందోళన వంటి బలమైన భావోద్వేగాలను కలిగించే కంటెంట్ ఎక్కువగా షేర్ అవుతుందని వెల్లడించాయి. కొత్త వందే భారత్ ప్రయాణం కూడా ఇలాంటి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అందుకే ప్రయాణికులు తమ అనుభవాలను వెంటనే సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
ప్రయాణ ఫొటోలు కేవలం జ్ఞాపకాల కోసం మాత్రమే కాదు.. మన అభిరుచులు, ఆసక్తులను ఇతరులకు తెలియజేసే మార్గం కూడా. 2022లో ఫ్రాంటియర్స్ ఇన్ సైకాలజీలో ప్రచురితమైన పరిశోధన ప్రకారం, యువత ఫొటోలను స్నేహితులతో పంచుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తాము ఎలాంటి ఎక్స్ పీరియెన్స్ పొందుతున్నామో సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలియజేస్తారు. వందే భారత్‌లో తొలి ప్రయాణం కూడా ఇలాంటి ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది.
ఫొటోలు తీయడం వల్ల కొన్ని సందర్భాల్లో మనుషులు ఆ అనుభవంలో మరింతగా లీనమవుతారు. పలు పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. అందుకే, వందే భారత్ ప్రయాణం కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడమే కాదు. కొత్త అనుభూతి, ఆనందం కలగలిసిన ఓ ప్రత్యేక జ్ఞాపకంగా మారుతోంది. అందుకే ప్రయాణికులు ఆ క్షణాలను కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అయితే, ఫొటోలు తీయడంలో మునిగిపోకుండా, కాసేపు ఫోన్ పక్కన పెట్టి ప్రయాణాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించడం కూడా మర్చిపోవద్దు.
Read Also: మెట్రోకు పోటీగా PRTS.. హైదరాబాద్‌లో మరో కొత్త ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్!