Blind Everest climber| కళ్లు కనిపించకపోతే మనం సాధారణంగా చేసే పనులు కూడా కొన్నిసార్లు కష్టంగా మారతాయి. అలాంటిది మంచుతో కప్పుకున్న ఎత్తైన పర్వతాలు ఎక్కడం అంటే ఎంతటి సవాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సౌదీ అరేబియాకు చెందిన రషాద్ నఖీబ్ అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చూపులేకపోయినా తన ఆత్మవిశ్వాసం, పట్టుదలతో నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్నాడు. తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ సాహసయాత్రలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు.అసలు అతను ఈ సాహసయాత్రను ఎలా పూర్తి చేశాడు? అతనికి ఎవరు సహాయం చేశారు? తెలుసుకుందాం.
సౌదీ అరేబియాకు చెందిన రషాద్ నఖీబ్ అరుదైన ఘనత సాధించాడు. నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్న తొలి అంధ సౌదీ వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఈ బేస్ క్యాంప్ ఉంటుంది. అక్కడికి చేరుకోవడానికి అతను 9 రోజుల పాటు కఠినమైన ప్రయాణం చేశాడు. మార్గమధ్యంలో పర్వత గ్రామాలు, రాతి దారులు, మంచుతో నిండిన మార్గాలను దాటాడు. గడ్డకట్టే చలిని కూడా ఎదుర్కొన్నాడు.
ఈ సాహసయాత్రలో రషాద్ తన ఇతర ఇంద్రియాలపై ఆధారపడ్డాడు. ముఖ్యంగా ట్రెక్కింగ్ కర్రల సహాయంతో నేల స్వభావాన్ని గుర్తించాడు. స్పర్శ ద్వారా మార్గంలోని అడ్డంకులను అర్థం చేసుకున్నాడు. అలాగే ముందున్న మార్గం గురించి గైడ్లు ఇచ్చే సూచనలను జాగ్రత్తగా విన్నాడు. ఎక్కడ మెట్లు ఉంటాయి, ఎక్కడ దారి మారుతుంది అనే విషయాలను వారి మాటల ద్వారా తెలుసుకున్నాడు. ఇలా ప్రతి అడుగును జాగ్రత్తగా వేస్తూ తన లక్ష్యాన్ని చేరుకున్నాడు.
సౌదీ అన్వేషకుడు డాక్టర్ బదర్ అల్ షైబానీ ఈ యాత్రకు నాయకత్వం వహించారు. ఆయన గతంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఈసారి రషాద్‌కు ప్రొఫెషనల్ గైడ్లతో కలిసి సహాయం అందించారు.
ఈ ప్రయాణానికి సంబంధించిన వివరాలను అల్ షైబానీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మార్గంలో మార్పులు వచ్చినప్పుడు, ఎత్తైన మెట్లు ఎదురైనప్పుడు రషాద్‌కు ముందుగానే చెప్పేవారని వివరించారు. రషాద్ తన మాటలను, రాళ్లపై వినిపించే బూట్ల శబ్దాలను శ్రద్ధగా వింటూ ముందుకు సాగేవాడని తెలిపారు. తన ట్రెక్కింగ్ కర్రలు, పాదాల ద్వారా నేలను గుర్తించేవాడని వెల్లడించారు.
గతంలో తాను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినప్పటికీ, రషాద్‌తో చేసిన ఈ ప్రయాణం ప్రత్యేకమైన అనుభూతినిచ్చిందని అల్ షైబానీ చెప్పారు.
Also Read: మొదటి రైలు ఆలస్యమై కనెక్టింగ్ ట్రైన్ మిస్ అయ్యిందా? మీ టికెట్ రిఫండ్ ఇలా పొందండి
ఈ సాహసయాత్ర తనకు మరచిపోలేని అనుభవమని రషాద్ తెలిపాడు. గైడ్లపై ఉన్న నమ్మకం తనకు ప్రతి అడుగు వేయడానికి ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పాడు. తన విజయంతో వైకల్యాలు ఉన్నవారు కూడా పెద్ద లక్ష్యాలను సాధించగలరనే సందేశాన్ని అందించాలనుకుంటున్నాడు. ముఖ్యంగా యువత తమ కలలను నిజం చేసుకోవడానికి ప్రయత్నించాలని ప్రోత్సహిస్తున్నాడు.
Also Read: రైల్లో మీ వస్తువులు లేదా లగేజీ మర్చిపోతే ఏం చేయాలి? తిరిగి పొందడానికి వెంటనే ఇలా చేయండి
రషాద్ సాహసయాత్రను ఆధారంగా చేసుకుని ఒక డాక్యుమెంటరీ రూపొందుతోంది. ఇందులో ప్రయాణంలోని సవాళ్లు, మానవీయ అనుభవాలు, అన్వేషణకు సంబంధించిన అంశాలను చూపించనున్నారు. ఈ డాక్యుమెంటరీ 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది. రషాద్ సాధించిన విజయం పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే కఠినమైన లక్ష్యాలను కూడా చేరుకోవచ్చని ప్రపంచానికి చాటిచెప్పింది.