Secunderabad–Warangal Cancellation: సికింద్రాబాద్ నుంచి వరంగల్ వైపు రైలు ప్రయాణం చేసే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈ మార్గంలో నడిచే నాలుగు రైళ్లను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఆదివారం ప్రయాణం చేయాలనుకునే వారు ముందుగానే తమ రైలు స్టేటస్ తెలుసుకోవడం మంచిదని సూచించింది.
రైల్వే మార్గాల్లో ఎప్పటికప్పుడు ట్రాక్, సిగ్నలింగ్, ఇతర మౌలిక వసతుల నిర్వహణ పనులు చేపడుతుంటారు. ఈ పనులను సజావుగా నిర్వహించేందుకు కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడం, మరికొన్ని సర్వీసుల్లో మార్పులు చేయడం కామన్ గా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఆదివారం సికింద్రాబాద్–వరంగల్ మార్గంలో నాలుగు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నిర్ణయం వల్ల ఈ మార్గంలో రోజువారీ ప్రయాణం చేసే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.
ఎస్‌సీఆర్ సీపీఆర్‌ఓ శ్రీధర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రద్దు చేసిన సర్వీసుల్లో సికింద్రాబాద్–వరంగల్ మధ్య నడిచే ఎంఈఎంయూ రైళ్లు ఉన్నాయి. వీటి రైలు నంబర్లు 67761, 67762. అలాగే సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే 12757, 12758 సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు కూడా ఆదివారం రద్దు కానున్నాయి. ఈ నాలుగు సర్వీసులపై ఆధారపడే ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను చూసుకోవాల్సి ఉంటుంది.
రైలు రద్దు సమాచారం తెలియక స్టేషన్‌కు చేరుకుంటే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా వరంగల్, కాజీపేట, జనగామ, సికింద్రాబాద్ వైపు రైళ్లపై ఆధారపడే వారు బయలుదేరే ముందు తమ సర్వీసు నడుస్తుందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకోవడం మంచిదని అధికారులు వెల్లడించారు. ఆదివారం ప్రయాణం చేయాల్సిన వారు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ప్రత్యామ్నాయ రైళ్లు, ఇతర రవాణా ఏర్పాట్లను ముందుగానే చేసుకోవడం మంచిదన్నారు. ముఖ్యంగా కుటుంబాలతో, అత్యవసర పనుల కోసం ప్రయాణించే వారు ఇతర మార్గాలను చూసుకోవాలన్నారు. రైల్వే నిర్వహణ పనులు పూర్తయిన తర్వాత సాధారణ సర్వీసులు యథావిధిగా కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే, ప్రయాణికులు తమ ప్రయాణానికి సంబంధించిన తాజా రైలు సమాచారాన్ని ఒకసారి పరిశీలించుకోవడం మంచిది.
Read Also: రైలు 9 గంటలు లేట్.. ప్రయాణికుడికి రూ.35 వేల పరిహారం.. అసలు ఏం జరిగిందంటే?