Train Delay Compensation: రైలు ప్రయాణంలో గంటల తరబడి ఆలస్యం అయితే, ప్రయాణికులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రయాణం మొత్తం తారుమారవుతుంది. ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్న సందర్భంలో జార్ఖండ్ కు చెందిన ఓ ప్రయాణికుడికి వినియోగదారుల కమిషన్ అండగా నిలిచింది. దాదాపు తొమ్మిది గంటలు ఆలస్యంగా నడిచిన రైలుకు సంబంధించి రైల్వే రూ.35,000 పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.
ఫిర్యాదుదారుడు 2024 సెప్టెంబర్‌లో టాటానగర్ నుంచి సంబల్పూర్ వెళ్లేందుకు ఇస్పాత్ ఎక్స్ ప్రెస్ లో రెండు స్లీపర్ క్లాస్ టికెట్లు బుక్ చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం రైలు ఉదయం 10.18 గంటలకు టాటానగర్ నుంచి బయలుదేరి, మధ్యాహ్నం 3.50 గంటలకు సంబల్పూర్ చేరుకోవాలి. అయితే, రైలు అనుకున్న సమయానికి కాకుండా ఆలస్యంగా బయలుదేరింది. చివరకు 8 గంటల 48 నిమిషాల ఆలస్యంతో సంబల్పూర్ చేరుకుంది. దీంతో ప్రయాణికుడికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో రైల్వేపై ఆయన ఫిర్యాదు చేశారు.
రైలు ఆలస్యం కారణంగా శారీరక, మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొంటూ ప్రయాణికుడు ముందుగా రైల్వే అధికారులకు లీగల్ నోటీసు పంపించారు. అనంతరం సెరైకెల్లా జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. తనకు జరిగిన ఇబ్బందులకు పరిహారంగా రూ.4.50 లక్షలు చెల్లించాలని కోరారు. అయితే, రైల్వే అధికారులు ఈ ఫిర్యాదును తిరస్కరించారు. రైలు ఆలస్యం వల్ల తనకు చాలా నష్టం జరిగినట్లు ప్రయాణికుడు ఆధారాలు చూపలేదని వాదించారు.
ఈ కేసు వినియోగదారుల కమిషన్ పరిధిలోకి రాదని, రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ చట్టం కింద పరిష్కరించాల్సి ఉంటుందని రైల్వే వాదించింది. అయితే ఈ వాదనను కమిషన్ అంగీకరించలేదు. ఈ తరహా కేసులను విచారించే అధికారం వినియోగదారుల కమిషన్‌కు ఉందని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కమిషన్ ప్రస్తావించింది. ప్రయాణికుడు తన ఫిర్యాదును స్పష్టమైన ఆధారాలతో నిరూపించుకున్నాడని కమిషన్ పేర్కొంది. రైల్వే వేధింపులకు పరిహారంగా రూ.30,000, కేసు ఖర్చుల కింద మరో రూ.5,000 చెల్లించాలని సౌత్ ఈస్టర్న్ రైల్వేను ఆదేశించింది. మొత్తం రూ.35,000ను ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి 45 రోజుల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది. గడువులోపు చెల్లించకపోతే, సంవత్సరానికి 12 శాతం వడ్డీ వర్తిస్తుందని వెల్లడించింది.
రైలు ఆలస్యం వల్ల ప్రయాణికులకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడినప్పుడు, తగిన ఆధారాలతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించే అవకాశం ఉందనే విషయాన్ని ఈ కేసు మరోసారి వెల్లడించింది. అయితే, ప్రతి రైలు ఆలస్యానికి ఆటోమేటిక్‌గా పరిహారం లభిస్తుందని చెప్పలేం. కేసు పరిస్థితులు, ఆధారాలు, ఆలస్యానికి కారణాలు సహా పలు అంశాలను పరిశీలించి నిర్ణయం వెలువడే అవకాశం ఉంటుంది.
Read Also: 20 గంటల ప్రయాణం ఇక 7 గంటలే.. మరో బుల్లెట్ రైలు కారిడార్ కు గ్రీన్ సిగ్నల్!