Maharashtra–Telangana Rail Connectivity: మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల్లో రైల్వే కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది. రైళ్ల రాకపోకలను పెంచడంతో పాటు ప్రయాణికులు, పరిశ్రమలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేలా భారతీయ రైల్వే కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ముకుత్‌బన్–గడ్చందూర్ మధ్య కొత్త రైలు మార్గం నిర్మించనుండగా.. సెంట్రల్ రైల్వేలో చౌక్–కర్జత్ సెక్షన్ లో డబ్లింగ్ చేయనున్నారు.
యవత్మల్ జిల్లాలోని ముకుత్‌బన్, చంద్రాపూర్ జిల్లాలోని గడ్చందూర్ మధ్య 38.21 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి రూ.493 కోట్లతో రైల్వే ఆమోదం తెలిపింది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు మరింత వెసులుబాటు కలుగుతుంది. ముకుత్‌బన్, గడ్చందూర్ ప్రాంతాలు పరిశ్రమలు, మైనింగ్ కార్యకలాపాలకు కీలక కేంద్రాలు. ఇక్కడ సిమెంట్ పరిశ్రమలు, బొగ్గు గనులు, సున్నపురాయి గనులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దీంతో కొత్త రైలు మార్గం పరిశ్రమలకు కూడా ఉపయోగకరంగా మారనుంది.
ప్రస్తుతం ఉన్న మార్గాలతో పోలిస్తే కొత్త లైన్ తక్కువ దూరంతో రవాణాకు అవకాశం కల్పించనుంది. దీంతో ప్రయాణ సమయం, రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం వార్ధా–మాణిక్ గఢ్ మార్గంపై ఉన్న రద్దీని కొంతవరకు తగ్గించేందుకు ఈ లైన్ ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా బొగ్గు, సిమెంట్, కోక్, స్పాంజ్ ఐరన్, స్టీల్, ఎరువులు, ఆహార ధాన్యాలు తదితర సరుకులను వేగంగా తరలించేందుకు వీలు కానుంది.
కొత్త లైన్ పూర్తయిన తర్వాత ప్రతి దిశలో రోజుకు రెండు MEMU రైళ్లు నడిపే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఏడాదికి సుమారు 6.08 మిలియన్ టన్నుల సరుకు రవాణా నిర్వహించేందుకు ఈ మార్గం ఉపయోగపడనుంది. మజ్రీ–నాందేడ్ మార్గానికి ఈ కొత్త లైన్ ప్రత్యక్ష అనుసంధానాన్ని అందించనుంది. దీని వల్ల జల్నా, పర్భణి, ఛత్రపతి సంభాజీనగర్ తో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలోని ఇతర ప్రాంతాలకు సరుకులను తక్కువ దూరంలో తరలించేందుకు అవకాశం ఉంటుంది.
ఇక సెంట్రల్ రైల్వే పరిధిలోని చౌక్–కర్జత్ 10.86 కిలోమీటర్ల సెక్షన్‌ను రూ.497 కోట్లతో డబ్లింగ్ చేయనున్నారు. పన్వెల్–చౌక్–కర్జత్ మార్గంలో ఈ సెక్షన్ ప్రయాణికులు, సరుకు రవాణా రెండింటికీ కీలకమైనది. డబ్లింగ్ పూర్తయితే ప్రతి దిశలో రోజుకు అదనంగా ఐదు ప్యాసింజర్ రైళ్లు నడిపే అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఏడాదికి సుమారు 18.35 మిలియన్ టన్నుల అదనపు సరుకు రవాణా సామర్థ్యం పెరగనుంది. ముఖ్యంగా గూడ్స్ రైళ్ల ఆలస్యాన్ని తగ్గించడంలో ఈ మార్గం సాయపడనుంది.
డబ్లింగ్‌తో పాటు ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్, ఫ్లైఓవర్లు, బైపాస్‌ల లాంటి పనుల ద్వారా రైల్వే నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచే చర్యలు కొనసాగుతున్నాయి. కొత్త లైన్లు, అదనపు ట్రాక్‌లు అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల రైళ్లకు ఎక్కువ అవకాశాలు లభించడంతో పాటు పరిశ్రమలకు అవసరమైన సరుకు రవాణా కూడా మరింత సులభం కానుంది. ముకుత్‌బన్–గడ్చందూర్ కొత్త రైల్వే లైన్‌తో మహారాష్ట్ర–తెలంగాణ ప్రాంతాల్లో కనెక్టివిటీ మెరుగుపడటమే కాకుండా పారిశ్రామిక, వాణిజ్య రవాణాకు కూడా కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది.
Read Also: దీపావళికి ముందే రెండో వందే భారత్ స్లీపర్ ఎంట్రీ.. ఏ రూట్ లో పరుగులు తీస్తుందంటే?