Ivolga FG High-Speed Train for India: భారత రైల్వే రంగంలో హైస్పీడ్ ప్రయాణాల కోసం మరో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. భారత్ కోసం గంటకు 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఇవోల్గా ఎఫ్‌జీ హైస్పీడ్ రైలును తయారు చేయాలని నిర్ణయించింది. ఇండియాలోనే తయారు చేసి భారతీయ రైల్వేకు అందించబోతోంది. తాజాగా న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఈ ప్రతిపాదనను రష్యాకు చెందిన ట్రాన్స్ మాష్ హోల్డింగ్ (TMH) సంస్థ ముందుకు తీసుకొచ్చింది.
ఇవోల్గా ఎఫ్‌జీని కేవలం రష్యా నుంచి దిగుమతి చేయడం కాకుండా, భారత సంస్థలతో కలిసి అభివృద్ధి చేసి ఇక్కడే తయారు చేయాలన్నది TMH ఆలోచన. రష్యా ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని, భారత్ తయారీ సామర్థ్యాలను కలిపి హైస్పీడ్ రైలు సాంకేతికతపై సంయుక్తంగా పనిచేయాలని సంస్థ ప్రతిపాదించింది. ఇది అమల్లోకి వస్తే భారత పరిశ్రమకు కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందడంతో పాటు, భవిష్యత్‌లో హైస్పీడ్ రైళ్ల తయారీలో దేశీయ సామర్థ్యం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
రష్యా సంస్థకు భారత రైల్వే రంగంతో సంబంధాలు కొత్తవి కావు. TMH, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) కలిసి కైనెట్ రైల్వే సొల్యూషన్స్ అనే జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ భాగస్వామ్యం ద్వారా భారతీయ రైల్వేల కోసం 120 వందే భారత్ స్లీపర్ ట్రైన్‌సెట్ల తయారీ, నిర్వహణ పనులు జరుగుతున్నాయి. ఒక్కో రైలులో 16 కోచ్‌లు ఉండగా, వీటి తయారీ మహారాష్ట్రలోని లాతూర్‌లో ఉన్న మరాఠ్వాడ రైల్ కోచ్ ఫ్యాక్టరీలో జరుగుతోంది. అందువల్ల ఇవోల్గా ఎఫ్‌జీ ప్రతిపాదన పూర్తిగా కొత్తగా ఏర్పడే సంబంధం కంటే, ఇప్పటికే కొనసాగుతున్న భారత్-రష్యా రైల్వే సహకారాన్ని మరింత విస్తరించే ప్రయత్నంగా చెప్పుకోవచ్చు.
ఇవోల్గా పేరు రష్యాలో ఇప్పటికే ప్రసిద్ధి చెందిన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ రైళ్లతో సంబంధం కలిగి ఉంది. ఇవి ప్రధానంగా మాస్కోలో శివారు ప్రాంతాల ప్రయాణికుల కోసం ఉపయోగిస్తున్నారు. అయితే, ప్రస్తుతం నడుస్తున్న ఇవోల్గా రైళ్ల వేగం గంటకు సుమారు 120 నుంచి 160 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. భారత్ కోసం ప్రతిపాదించిన ఇవోల్గా ఎఫ్‌జీ మాత్రం గంటకు 360 కిలోమీటర్ల వేగాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. సో, ఇది సాధారణ కమ్యూటర్ రైలు కంటే పూర్తిగా భిన్నమైన హైస్పీడ్ కాన్సెప్ట్ కానుంది.
ఇక ఈ కొత్త ప్రతిపాదనలో రైలు వేగం పెంచడం మాత్రమే సరిపోదు. గంటకు 360 కిలోమీటర్ల వేగంతో రైలు నడపాలంటే ప్రత్యేకంగా రూపొందించిన ట్రాక్‌లు, అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ, విద్యుత్ సరఫరా, భద్రతా సాంకేతికత, నిర్వహణ కేంద్రాలు అవసరం. అందుకే ఇవోల్గా ఎఫ్‌జీని వెంటనే భారత రైల్వేలో ప్రవేశపెట్టే రైలుగా కాకుండా, భవిష్యత్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టులకు ఒక అవకాశంగా చూడాల్సి ఉంటుంది.
ఈ ప్రతిపాదన ముందుకు వెళితే భారత్‌కు కేవలం వేగవంతమైన రైలు మాత్రమే కాకుండా, హైస్పీడ్ రైల్వే సాంకేతికతపై పరిశోధన, ఇంజినీరింగ్ నైపుణ్యం, స్థానిక తయారీ లాంటి రంగాల్లో ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా రైలు విడిభాగాల దేశీయ తయారీ, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ లాంటి అంశాలు కీలకంగా మారతాయి. మొత్తంగా భారత్ హైస్పీడ్ రైల్వే రంగాన్ని విస్తరించాలనుకుంటున్న సమయంలో రష్యా చేసిన ఈ ప్రతిపాదన భవిష్యత్ రైల్వే ప్రయాణంపై ఆసక్తిని పెంచుతోంది.
Read Also: వందే భారత్ vs రాజధాని ఎక్స్ ప్రెస్.. ప్రయాణికులకు ఏ రైలు బెటర్.. పూర్తి వివరాలు ఇవిగో!