World Largest Family: మిజోరంలోని ఒక చిన్న గ్రామానికి చెందిన జియోనా చానా.. ఏకంగా 39 పెళ్లిళ్లు, అతిపెద్ద ఫ్యామిలీతో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. 181 మంది కుటుంబ సభ్యులతో ఒకే ఇంట్లో కలిసి జీవించి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. 39 మంది భార్యలతో పాటు 94 మంది పిల్లలు, 14 మంది కోడళ్లు, 33 మంది మనవళ్లు, మనవరాళ్లు ఒక మునిమనవడు ఆయనకు ఉన్నారు.
జియోనా చానా మిజోరంలో బహుభార్యత్వ విధానాన్ని పాటించే ఒక క్రైస్తవ తెగకు నాయకుడు. ‘చానా పాల్’ అని పిలిచే ఈ సమూహాన్ని ఆయన తండ్రి ఖుయాంగ్తుహా జూన్ 1942లో స్థాపించారు. బక్తావ్ంగ్ త్లాంగ్నుఅమ్ గ్రామం, దాని పరిసర ప్రాంతాలలో ఈ తెగకు చెందిన దాదాపు 2,000 మంది సభ్యులు నివసిస్తున్నారు. వీరంతా ఒకరికొకరు దగ్గరగా ఉంటూ స్వయం సమృద్ధి జీవన విధానాన్ని పాటిస్తారు.
జియోనా తన 17వ ఏట జతియాంగి అనే మహిళను తొలి పెళ్లి చేసుకున్నారు. ఆమె ఆయన కంటే మూడేళ్లు పెద్దది. ఆ తర్వాత జియోనా వరుసగా 39 మంది మహిళలను పెళ్లాడారు. నివేదికల ప్రకారం ఆయన చివరి పెళ్లి 2004లో జరిగింది. కాలక్రమేణా కుటుంబ పరిమాణంలో మార్పులు వచ్చినప్పటికీ ఆయన పేరు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది.
ఈ కుటుంబం అంతా ‘ఛువాన్ థార్ రన్’ అని పిలిచే నాలుగు అంతస్తుల భవనంలో నివసిస్తోంది. బక్తావ్ంగ్‌లో ఉన్న ఈ భవనంలో దాదాపు 100 గదులు ఉన్నాయి. అలాగే అతిథుల కోసం ‘ఖువాల్‌బుక్’ (గెస్ట్‌హౌస్) కూడా నిర్మించారు. జియోనా గ్రౌండ్ ఫ్లోర్‌లో డబుల్ బెడ్‌రూమ్‌లో ఉండేవారు. ఆయన భార్యలు వంతులవారీగా ఆయనతో సమయం గడిపేవారు. చిన్న వయస్సు ఉన్న భార్యలు ఆయన గదికి దగ్గరగా నివసించగా, పెద్ద వయస్కులు మొదటి అంతస్తులోని డార్మిటరీలలో ఉండేవారు.
ఇంత పెద్ద కుటుంబానికి తగ్గట్లే నిత్యవసర సరుకులకు భారీ మెుత్తంలో ఖర్చు అవుతుంది. ఓ నివేదిక ప్రకారం ఈ కుటుంబం రోజుకు దాదాపు 200 పౌండ్ల (సుమారు 90 కిలోలు) బియ్యం, 130 పౌండ్ల కంటే ఎక్కువ బంగాళాదుంపలను వినియోగించేది. కుటుంబం కోసం సొంతంగా ఒక పాఠశాల సైతం ఉండేదట. అక్కడ పిల్లలకు మిజో, ఇంగ్లీష్, హిందీ భాషల్లో పాఠాలు బోధించేవారట.
జియోనా చానాను ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబ పెద్దగా పేర్కొన్నప్పటికీ ఆయనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కలేదు. 2007లో గిన్నిస్ అధికారులు ఆయన్ను కలిసినప్పుడు ఫొటో దిగడానికి నిరాకరించారు. తనకు అనవసరమైన ప్రచారం ఇష్టం లేదని 2011లో ఆయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయినప్పటికీ 2011లో వరల్డ్ రికార్డ్ అకాడమీ, ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ కుటుంబాన్ని ‘అతిపెద్ద కుటుంబం’గా గుర్తించాయి. 2019లో లండన్ వరల్డ్ రికార్డ్స్ కూడా జియోనాను ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబ పెద్దగా పేర్కొంది.
జియోనా చానా కుటుంబం కారణంగా బక్తావ్ంగ్ త్లాంగ్నుఅమ్ గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. నాలుగు అంతస్తుల భవనాన్ని, వారి ప్రత్యేక జీవనశైలిని చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు రావడం ప్రారంభించారు.
Also Read: ఈ రైలు ఎక్కితే ఆహారం ఉచితం.. జనరల్ నుండి AC వరకు.. వేడివేడి భోజనం!
మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్న జియోనా చానా.. 2021 జూన్ 13న ఐజ్వాల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత మిజోరం అప్పటి ముఖ్యమంత్రి జోరమ్‌థంగా నివాళులర్పిస్తూ రాష్ట్ర పర్యాటకరంగానికి ప్రత్యేకాకర్షణగా నిలిచిన ఒక గొప్ప వ్యక్తికి వీడ్కోలు పలుకుతున్నామని పేర్కొన్నారు.
Also Read: ఆళ్ల నాని మృతి పట్ల సీఎం చంద్రబాబు, జగన్, లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి!