Yaganti Basavayya: విగ్రహాలు అంటే ఎలాంటి చలనం లేకుండా కదలకుండా ఉంటాయి. అందుకే వాటిని విగ్రహాలు అంటారు. మరి వీటిలో కదలికలు ఉంటే ఎలా ఉంటుంది. సంవత్సరాలు పెరుగుతున్న కొద్దీ ప్రాణం ఉన్న జీవుల లాగానే విగ్రహాలు కూడా ఆకారం పెంచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది. వినడానికి కాస్త వింతగా ఉంది కదా..? కానీ, ఇది అక్షరాల నిజం. నంద్యాల జిల్లాలోని యాగంటి ఉమా మహేశ్వర దేవాలయంలో ఉన్న ఓ నంది విగ్రహం ప్రతి ఏటా దాని ఆకారాన్ని పెంచుకుంటుంది. అసలు ఆ విగ్రహం పెరగడం వెనుక ఉన్న కారణం ఏంటి? నిజంగా ఏదో శక్తి వల్లే నంది విగ్రహం పెరుగుతూ పోతుందా అనే ప్రశ్నలు చాలానే ఉన్నాయి.
ఏపీలో నంద్యాలలో ఉన్న యాగంటి ఉమా మహేశ్వర దేవాలయం ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటి. దీన్ని15వ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. విజయనగర సామ్రాజ్య కాలంలో హరిహర రాయలు, బుక్క రాయల సమయంలో ఈ ఆలయం అభివృద్ధి చెందిందట. ఆలయంలో ఉమా మహేశ్వర స్వామి విగ్రహం అందమైన శిల్పకళతో భక్తులను ఆకర్షిస్తుంది.
బనగానపల్లెకు సమీపంలో, సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. చుట్టూ ఎర్రటి కొండలు, పచ్చని అడవులు, ప్రశాంత వాతావరణం వల్ల ఈ ఆలయానికి భక్తులు, పర్యటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. మహాశివరాత్రి, శ్రావణ మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ సమయంలో వేలాది మంది భక్తులు దర్శనం కోసం తరలివస్తారు. ఈ గుడిలో ఉండే నంది విగ్రహం 15 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తుతో ఉంటుది. ఈ భారీ నంది విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద వాటిలో ఒకటిగా పేరుగాంచింది.
ALSO READ: పాము ఆకారంలో గుడి.. తాండవం చేస్తున్న కృష్ణయ్య..!
యాగంటి ఆలయం చుట్టూ గుహలు, జలపాతాలు ఉన్నాయి. ఇవి పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఆలయానికి కర్నూలు, నంద్యాల, బనగానపల్లె నుండి బస్సు సౌకర్యం ఉంది. ఈ నంది విగ్రహం పెరుగుతున్న అద్భుతం శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా చర్చనీయాంశంగా మారింది.
విగ్రహం పెరగడానికి కారణం ఏంటి?
ఈ ఆలయంలోని నంది విగ్రహాన్ని బసవయ్య అని పిలుస్తారు. ఈ విగ్రహం ప్రతి ఏటా పెరుగుతోందని ప్రచారం జరుగుతోంది. కొన్ని దశాబ్దాల క్రితం ఈ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేసేంత స్థలం ఉండగా, ఇప్పుడు విగ్రహం పెరగడంతో ఆ స్థలం తగ్గిపోయింది. ఒక స్తంభాన్ని కూడా తొలగించాల్సి వచ్చిందని స్థానికులు చెబుతారు. ఈ అద్భుతం భక్తుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మహా యోగి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఈ క్షేత్రంలో తపస్సు చేశారట. ఆయన కాలజ్ఞానంలో, కలియుగాంతంలో యాగంటి బసావయ్య లేచి రంకె వేస్తుందని తెలిపారు. అందుకే విగ్రహం పెరుగుతోందని చాలా మంది భక్తులు నమ్ముతారు.
సైన్స్ ఏం చెబుతోంది?
ప్రతి 20 ఏళ్లకు ఒకసారి నంది విగ్రహం పెరగడానికి కారణం ఎంటో ఇప్పటికీ తెలియలేదు. కానీ, ఎందుకు పెరుగుతుందో దానికి అనేక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం, ఈ నంది విగ్రహం ప్రతి 20 సంవత్సరాలకు 1 అంగుళం చొప్పున పెరుగుతోంది. ఈ విగ్రహం తేమను గ్రహించి, రాతిలోని పదార్థాలు రసాయనిక చర్యల ద్వారా వృద్ధి చెందుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.