Snake Shaped Temple: భాగవత పురాణంలోని కాళీయమర్ధన ఘట్టంలో విషం చిమ్మే పాము నుంచి ప్రజలను రక్షిస్తాడు. ఎమునా నదిలోకి కాళీంద్రుడు అనే పాము వెళ్లి విషాన్ని చిమ్మడంతో అందులో ఉన్న జలచరాలన్నీ ప్రాణాలు విడిచాయి. అదే సమయంలో స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లిన శ్రీకృష్ణుడు నదిలోకి చూసాడు. విషం వల్లే ఇలా జరిగిందని గుర్తిస్తాడు.
ఆ పాము విషం నుంచి ఎమునా నదిని శుద్ధి చేయాలని లోపలికి దూకేస్తాడు. ఆ తర్వాత పాముతో పోరాడి దాని పడగలపై చిన్ని కృష్ణయ్య తాండవం చేస్తాడు. కాళీయుడి భార్యలు కృష్ణుడి వైపు దీనంగా చూడడంతో మిమ్మల్ని చంపను అని కృష్ణుడు చెప్తాడు. నదిలో నుంచి విషాన్ని తొలగించి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశిస్తాడు. దీంతో కాళీంద్రుడు, అతని భార్యలు నది నుంచి వెళ్లిపోతారు. దీంతో కాళీయమర్ధన ఘట్టం ముగుస్తుంది. ఇది భాగవతంలో అత్యంత ఆదరణ పొందిన ఘట్టం.
చిన్ని కృష్ణయ్య పాముపై తాండవం చేస్తున్న చిత్రాలు, విగ్రహాలు, ఫోటోలను చాలా చోట్ల చూసే ఉంటారు. కానీ, ఆ పాము ఆకారంలో ఉన్న ఆలయాన్ని ఎప్పుడైనా చూశారా..? తెలంగాణలో అతిపెద్ద పాము ఆకారంలో ఉన్న ఆలయం ఇదేనట. ఈ పాము పడగలపై శ్రీ కృష్ణుడు తాండవం చేస్తున్నట్లుగా కనిపించేలా ఆలయాన్ని నిర్మించారు. హైదరాబాద్ నుంచి 160 కి.మీ దూరంలో ఈ పాము ఆకారంలో ఉన్న గుడి ఉంది. కరీంనగర్ జిల్లాలోని వేములవాడకు దగ్గరలో ఉన్న నాంపల్లి గుట్ట అనే ప్రాంతంలో ఈ ఆలయం ఉంటుంది.
ALSO READ: ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా ఫలకంతో చెక్కిన ఆలయం
ఆలయం లోపలికి వెళ్లాలంటే రూ.5 ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గుడి బయట ఉగ్రరూప నరసింహస్వామి దర్శనం ఇస్తాడు. పాము ఆకారంలో నుంచి లోపలికి వెళ్తుంటే గుహలోకి వెళ్లినట్టే అనిపిస్తుంది. ఆలయంలోకి వెళ్లే దారిలో భాగవత పురాణంలోని అనేక ఘట్టాలకు సంబంధించిన దృశ్యాల విగ్రహాలు కనిపిస్తాయి. ఆలయంలో లోపల హిరణ్యకశిపుడి పొట్టను చీల్చుతున్న ఉగ్రరూపం దాల్చిన నరసింహ స్వామి విగ్రహం కనిపిస్తుంది.
దీన్న చోళులు నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ అలయానికి దాదాపు 600 ఏళ్ల నాటి చరిత్ర ఉందట. శ్రీ రాజ రాజ నరేంద్రుడు అనే రాజు ఆలయం పక్కన ఉన్న కోనేటికి మెట్లు నిర్మించాడట. ఈ పాము ఆకారంలో ఉన్న ఆలయానికి దగ్గరలోనే వేములవాడ రాజన్న ఆలయం కూడా ఉంటుంది. అక్కడికి వెళ్తే ఒకే సారి రెండు ఆలయాలను దర్శించుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఆలయానికి భక్తులతో పాటు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యటకుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది.