Indian Railways: హైదరాబాద్ లోని సబర్బన్ రైల్వే స్టేషన్లు అయిన సఫిల్ గూడ, రామకృష్ణ నగర్, నేరేడ్ మెట్ లను ఒకప్పుడు శివార్లు ప్రాంతాలుగా పరిగణించే వారు. కానీ, ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాయి. భారతీయ రైల్వే ఈ స్టేషన్లను ఆధునిక మౌలిక సదుపాయాలు, విద్యుత్ కనెక్టివిటీ తో అద్భుతంగా అప్ గ్రేడ్ చేశాయి. అయితే, ఇక్కడి నుంచి సరైన MMTS సేవలు లేకపోవడంతో పాటు ముఖ్యమైన రైళ్లకు హాల్టింగ్ ఇవ్వకపోవడంపై స్థానికులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరిపడ MMTS రైళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు ముఖ్యమైన రైల్లు ఆగేలా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేయబడిన మల్కాజ్ గిరి రైల్వే స్టేషన్ లో కీలకమైన రైళ్లను ఆపాలని కోరుతున్నారు.
త్వరలో జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం
వచ్చే నెలలో 76వ జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (ZRUCC) సమావేశం జరగనుంది. పలు ప్రయాణీకుల సంఘాలు, నివాస సంక్షేమ సంస్థలు ఈ సమస్యలను లేవనెత్తాలని భావిస్తున్నారు. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, 25 మంది కమిటీ సభ్యులు, జనరల్ మేనేజర్, ప్రధాన విభాగాల అధిపతులు పాల్గొననున్నారు. “జనాభా పది రెట్లు పెరిగినందున ఈ స్టేషన్లకు సరైన అప్రోచ్ రోడ్లు అవసరం. ప్రధాన రైళ్లు ఈ స్టేషన్లలో ఆగాలి. ప్రస్తుతం స్థానికులు రైళ్లలో ప్రయాణించడానికి చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. రైల్వేలు ఈ అవసరాలను గుర్తించి అవసరమైన మార్పులను అమలు చేయాలి” అని కాన్ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ సెక్రటరీ జనరల్ శ్రీనివాసన్ కోరారు.
MMTS రైళ్ల టైమింగ్స్ లో మార్పులు చేపట్టాలి
తాజాగా రైలు ప్రయాణికుల సంఘం, కాన్ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ సమావేశమై ఈ సమస్యల గురించి చర్చించారు. జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు. ఆఫీస్ లకు వెళ్లే ఉద్యోగులకు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా MMTS రైలు సమయాలను మార్చేలా రైల్వే అధికారులను కోరాలని నిర్ణయించారు. “కాచిగూడ నుంచి వందే భారత్, ఇతర రైళ్లతో కనెక్ట్ చేసేలా ఉదయం 5.30 గంటలకు మేడ్చల్ నుంచి కాచిగూడకు కొత్త MMTS రైలును అందుబాటులోకి తీసుకురావాలి. అలాగే, తుంగభద్ర ఎక్స్ ప్రెస్ మేడ్చల్ నుంచి తన ప్రయాణం ప్రారంభం అయ్యేలా చూడాలి” అని రైలు ప్రయాణికుల సంఘం అభిప్రాయపడింది.
మంత్రాలయం- కర్నూలు కొత్త రైల్వే లైన్ కోసం డిమాండ్
మరోవైపు మంత్రాలయం నుంచి కర్నూలు వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని రైల్వే ప్రయాణికుల సంఘాలు కోరుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంది. ఈ లైన్ అందుబాటులోకి వస్తే, రైతులకు ఇతర నగరాలకు వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయడానికి వీలు కల్పించడం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుదతుందని సంఘం నాయకులు కోరారు.
Read Also: రైల్వే స్టేషన్ లో హ్యాపీగా వైఫై ఎంజాయ్ చెయ్యొచ్చు, సింపుల్ గా ఇలా చేస్తే చాలు!