అన్నిటికీ ఆధార్ అని అనుకుంటాం, పాన్ కార్డ్ ఉంటే ఇతర ఐడెంటిటీ కార్డులు అవసరమే లేదని అనుకుంటాం, ఓటర్ ఐడీ ఉంటే అంతకంటే పెద్ద ప్రూఫ్ ఇంకేదీ అక్కర్లేదని కూడా అనుకుంటాం. కానీ అవేవీ భారత పౌరుడి గుర్తుంపుకి సరైన ధృవీకరణలు కావని తేల్చి చెప్పింది బాంబే హైకోర్టు. భారత్ లో ఆధార్, పాన్, ఓటర్ ఐడీ ఉన్నంత మాత్రాన అతనిని భారత పౌరుడిగా పరిగణించలేమని పేర్కొంది. అదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశీయుడికి బెయిల్ నిరాకరిస్తూ బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
అసలేమైంది..?
థానేలో నివాసం ఉంటున్న బాబు అబ్దుల్ రూఫ్ సర్దార్ అనే వ్యక్తిని బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చినవాడిగా అనుమానిస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా భారత్ లో నివశిస్తున్నారంటూ అభియోగాలు మోపారు. వాగ్లే ఎస్టేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, బాంబే హైకోర్టు ఈ కేసు విచారణ చేపట్టింది. అతను భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి నకిలీ భారతీయ గుర్తింపు పత్రాలను ఉపయోగించాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఈ ఆరోపణలను సర్దార్ తరపు న్యాయవాది ఖండించారు. అతని వద్ద్ ఆధార్, పాన్, ఓటర్ ఐడీ ఉన్నాయన్నారు. 2013నుంచి ఈ గుర్తింపు కార్డులను అతడు వినియోగిస్తున్నాడని కూడా తెలిపారు.
పుట్టింది ఎక్కడ..?
భారత్ లో పౌరసత్వం పుట్టుక ద్వారా వస్తుంది. దీర్ఘకాలికంగా భారత్ లో నివశిస్తూ అక్రమ వలసదారులు కాదు అని నిరూపించుకోగలిగితే వారికి దరఖాస్తు ద్వారా కూడా పౌరసత్వం లభిస్తుంది. అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలనుంచి వచ్చినవారికి మాత్రం సవాలక్ష కండిషన్లు ఉన్నాయి. వారిని దాదాపు అక్రమ వలసదారులుగానే పరిగణిస్తారు. తప్పుడు ధృవపత్రాలు సంపాదించి ఇక్కడ ఉన్నా కూడా వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సర్దార్ ది కూడా అదే పరిస్థితి. పాన్, ఆధార్, ఓటర్ ఐడీ అన్నీ ఉన్నాయని చెబుతున్నాడే కానీ, తాను భారతీయ పౌరుడిని అని నిరూపించుకోడానికి అతని వద్ద బర్త్ సర్టిఫికెట్ వంటి ఆధారాలు కూడా లేవు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. అతడి ఫోన్ ని పోలీసులు పరిశీలించగా, అందులో అతడు బంగ్లాదేశ్ లో పుట్టినట్టుగా ఓ బర్త్ సర్టిఫికెట్ దొరికింది. దీనిపై ఆరా తీసిన పోలీసులు ఆ సర్టిఫికెట్ వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే అది ఎవరో ఉద్దేశపూర్వకంగా పంపించిన సర్టిఫికెట్ అంటూ సర్దార్ తరపు న్యాయవాది కోర్టులో విచిత్రంగా వాదించారు. బంగ్లాదేశ్ లో ఉన్న వ్యక్తులతో తరచూ సర్దార్ ఫోన్ లో మాట్లాడుతుంటారని పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించారు. దీనికి సర్దార్ తరపునుంచి సమాధానం లేదు.
సర్దార్ కేసుతో బాంబే హైకోర్టు చాలా విషయాల్లో క్లారిటీ ఇచ్చినట్టయింది. జస్టిస్ అమిత్ బోర్కర్ ఈ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. “ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు ఐడీ వంటివి కలిగి ఉండటం వల్ల ఎవరూ భారత పౌరుడిగా మారరు. ఈ పత్రాలు గుర్తింపు కోసం లేదా సంబంధిత సేవలను పొందడానికి మాత్రమే ఉద్దేశించబడ్డాయి, చట్టంలో సూచించిన విధంగా పౌరసత్వం యొక్క ప్రాథమిక చట్టపరమైన అవసరాన్ని అవి తీర్చలేవు.” అని అన్నారాయన. పౌరసత్వ కేసుని అదే చట్టం కింద పరిశీలించాలని, జననం, వంశపారంపర్యత, రిజిస్ట్రేషన్, సహజీకరణ, లేదా ఇతర ప్రత్యేక నిబంధనల ద్వారా వ్యక్తి పౌరసత్వం పొందే షరతులకు అనుగుణంగా ఉన్నారా లేదా అనేది పరిశీలించాలని చెప్పారు. సివిల్ కాంట్రాక్టర్ అయిన సర్దార్ ఉద్యోగ్ ఆధార్ కార్డు, గుమస్తా లైసెన్స్ కూడా కలిగి ఉన్నారు. తాజా కేసులో ఆయనకు బెయిల్ నిరాకరించడంతో రిమాండ్ ఖైదీగా కాలం వెళ్లదీస్తున్నాడు సర్దార్.