Chhattisgarh Incident: ఛత్తీస్‌ఘడ్‌లోని కొండగావ్ జిల్లాలో వెలుగుచూసిన ఒక వింత వివాహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా ఒకే ముహూర్తానికి ఇద్దరు యువతులను పెళ్లి చేసుకోవడం సినిమాల్లో చూస్తుంటాం, కానీ ఇక్కడ హితేశ్ యాదవ్ అనే యువకుడు నిజ జీవితంలోనే అది చేసి చూపించాడు. ఒకే వేదికపై, ఇద్దరు వధువుల మెడలో మూడు ముళ్లు వేసి, బంధుమిత్రుల సాక్షిగా వారిని తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఈ వింత పెళ్లిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు.
అయితే ఈ కథలో అసలు ట్విస్ట్ ఏమిటంటే.. హితేశ్ మొదట ఫూల్‌వతి అనే యువతిని ప్రేమించాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సమయంలో ఆమె పెళ్లికి నిరాకరించింది. దాంతో హితేశ్ కుటుంబ సభ్యులు అతనికి యామిని అనే మరో అమ్మాయితో వివాహం నిశ్చయం చేశారు. పెళ్లి పనులు మొదలై, ముహూర్తం కార్డులు కూడా అచ్చయ్యే వరకు అంతా మామూలుగానే సాగింది. కానీ సరిగ్గా శుభలేఖలు పంచే సమయానికి పాత ప్రేయసి ఫూల్‌వతి మనసు మార్చుకుంది.
తన ప్రేమను వదులుకోలేక, హితేశ్‌ను వేరే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే తట్టుకోలేక ఫూల్‌వతి నేరుగా అతని ముందుకు వచ్చింది. తాను కూడా అతడినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. ఒకవైపు నిశ్చయమైన పెళ్లి కూతురు యామిని, మరోవైపు ప్రాణంగా ప్రేమించిన ఫూల్‌వతి.. ఇద్దరిలో ఎవరిని వదులుకోవాలో తెలియక హితేశ్ సందిగ్ధంలో పడ్డాడు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయి. వినడానికి వింతగా ఉన్నా, ముగ్గురి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక అసాధారణ నిర్ణయానికి వచ్చారు.
హితేశ్ ఇద్దరు యువతులను పెళ్లి చేసుకోవడానికి అటు యామిని కుటుంబం, ఇటు ఫూల్‌వతి కుటుంబం అంగీకరించడం గమనార్హం. ఇద్దరు అమ్మాయిలు కూడా ఒకే వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడానికి ఇష్టపడటంతో గ్రామస్థుల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి కూతుళ్లు ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని ఉండగా, హితేశ్ ఇద్దరికీ తాళి కట్టి భార్యలుగా స్వీకరించాడు. భారతీయ వివాహ వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి.
Also Read: పెళ్లి విందులో ‘లెగ్ పీస్’ వార్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
చట్టపరమైన చిక్కులు ఎలా ఉన్నా, ప్రస్తుతం ఈ “ముగ్గురి ముచ్చటైన పెళ్లి” గ్రామంలో పెద్ద చర్చకు దారితీసింది. ఆ గిరిజన ప్రాంత సాంప్రదాయాల ప్రకారం పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొందరు దీనిని వింతగా చూస్తుంటే, మరికొందరు ఆ యువకుడి అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.
వింత పెళ్లి చేసుకున్న ఛత్తీస్‌గఢ్ యువకుడు!
ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో ఆసక్తికర వివాహం
ఒకే వేదికపై ఇద్దరు యువతుల మెడలో తాళి కట్టిన హితేశ్ యాదవ్ అనే యువకుడు
ఫూల్‌వతి అనే అమ్మాయిని ప్రేమించగా.. ఆమె నిరాకరించడంతో యామినితో పెళ్లికి సిద్ధమైన హితేశ్
తీరా ముహూర్తం ఖరారయ్యాక… pic.twitter.com/Yb0qkS2v47
— BIG TV Breaking News (@bigtvtelugu) March 29, 2026