AP Family Survey: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకు ఒకటి లేదా రెండు సర్వేలు చేయిస్తోంది. ఆరోగ్యం, పథకాలు, మహిళా సంఘాలు ఇలా రకరకాల సర్వేలు చేయిస్తోంది. అందుకు కారణాలు చాలానే ఉంటాయి. ఈసారి కొత్త సర్వేకు శ్రీకారం చుట్టింది. సమగ్ర కుటుంబ సర్వే.. డిసెంబర్ చివరి నుంచి చేపట్టనున్నారు. ఇంతకీ సర్వే ముఖ్య ఉద్దేశం ఏంటి? లబ్దిదారులను తొలగించాలనేది ప్రభుత్వ ఆలోచనా? చీటికీ మాటికీ సర్వేలు ఎందుకు చేయిస్తోందనే ప్రశ్నలు లబ్దిదారుల నుంచి రైజ్ అవుతున్నాయి.
ఏపీలో ‘సమగ్ర కుటుంబ సర్వే’
కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేయాలని డిసైడ్ అయ్యింది. ప్రతి ఇంటి వివరాలు ప్రభుత్వ రికార్డులలో నమోదు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఏకీకృత కుటుంబ సర్వే–UFS ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ నెల చివరి నుంచి ఏకీకృత కుటుంబ సర్వే మొదలుకానుంది.
గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఇంటింటికీ వెళ్లి గ్రామ-వార్డు సచివాలయం సిబ్బంది సర్వే చేయనున్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆర్థిక పరిస్ధితిని తెలుసుకుని రికార్డులను పొందపరచనున్నారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందించే ప్రయోజనాల అమలు కోసం ఈ సర్వే చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.
ఈనెలాఖరు నుంచే.. ప్రశ్నల లిస్టు పెద్దదే
ఈ సర్వే ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా అర్హులైన లబ్దిదారులను గుర్తించేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వ సమాచారం కచ్చితత్వం, పరిపూర్ణతను మెరుగుపరచడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందుకోసం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే వివరాలు సేకరించనుంది.
తద్వారా సమాచారం ఖచ్చితంగా నమోదు అయ్యేలా చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ పాలన మరింత పారదర్శకంగా ఉండేందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతున్నమాట. అర్హులైన అన్ని కుటుంబాలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించేందుకు సర్వే చేస్తున్నట్లు వెల్లడించింది. నెల రోజుల పాటు ఈ సర్వే చేపడతారని తెలుస్తోంది.
ALSO READ: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పల్లె వెలుగు బస్సులో ఏసీ ఉండాల్సిందే
సర్వేలో భాగంగా ఆయా కుటుంబాల ఆర్ధిక, సామాజిక వివరాలు, విద్య, ఉద్యోగ సంబందించిన సమాచారాన్ని రాబట్టనుంది. దాదాపు 38 ప్రశ్నలు రెడీ చేసినట్టు తెలుస్తోంది. గతంలో ఉన్న రికార్డుల్లో ఏవైనా తప్పులున్నా, సమాచారం లోపించినా దీనిద్వారా సరిచేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ ఆలోచన. సర్వే పూర్తి తర్వాత ఆ ఇంటిని మ్యాపింగ్ చేయనున్నారు అధికారులు.
సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం ఆదేశాల తర్వాత వారంతా రంగంలోకి దిగనున్నారు. సర్వే అనేసరికి ఏపీ ప్రజల్లో అప్పుడే భయం మొదలైంది. ఉపాది కోసం చాలామంది వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. సర్వే ఫ్యామిలీ సభ్యులంతా ఉండాలా? ఒక్కరుంటే సరిపోతుందా? ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.