AP Heavy Rains: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం క్రమంగా బలహీన పడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని వెల్లడించింది. ఇది రాబోయే 24గంటల్లో దక్షిణ అంతర్గత కర్ణాటక దిశగా కదులుతూ మరింత బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో గురువారం ఉదయం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. తీరం వెంబడి 30-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
కాకినాడ, విశాఖ జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో భారీ తుపానులు ఏర్పడే అనుకూల వాతావరణం ఉందని, అవి మొత్తం తీరప్రాంతాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో సాయంత్రానికి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలలో ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సగటు 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది తదుపరి 24 గంటల్లో పశ్చిమ-ఉత్తర పశ్చిమ దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు పడుతుందన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితిపై దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని సూచించారు. రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖలు సమన్వయంతో పని చేయాలని నిర్దేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలతో పాటు యానాంలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశముందని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో పునరావాస కేంద్రాలు సిద్ధం చేసినట్లు నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసుల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
కృష్ణపట్నం పోర్టులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లింగసముద్రంలో 8.3 సెం.మీ, ఉలవపాడులో 6.2 సెం.మీ, రాపూరులో 5.6 సెం.మీ, మర్రిపాడులో 5.3 సెం.మీ, ఉదయగిరిలో 4.7 సెం.మీ, అనంతసాగరం, కొండాపురంలో 4.6 సెం.మీ, కోవూరులో 4.1 సెం.మీ, కొడవలూరులో 4 సెం.మీ వర్షపాతం రికార్డైంది. గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెన్నా నదిలో ఉద్ధృతంగా ప్రవహిస్తుంది.
Also Read: AP Politics: బాలకృష్ణపై జగన్ హాట్ కామెంట్స్.. సభలో తాగి మాట్లాడడమేంటి? స్పీకర్‌కు బుద్ధి లేదు
పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, బాపట్ల, అనంతపురం, గుంటూరు, పల్నాడు, కాకినాడ, విశాఖ, తూర్పుగోదావరి సహా పలు జిల్లాల్లో గురువారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.