వైజాగ్ కి గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడాన్ని కొన్ని రోజులుగా వైసీపీ మీడియా తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. డేటా సెంటర్ వల్ల ప్రయోజనం లేదన్న వార్తలకు వారు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనివల్ల స్థానికంగా నీటి కొరత ఏర్పడుతుందని, పర్యావరణ విధ్వంసం జరుగుతుందనే ప్రచారం కూడా మొదలు పెట్టారు. అసలు ఉద్యోగాల గురించి గూగుల్ కంపెనీతో చెప్పించాలని మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు కూడా. ఈ క్రమంలో తాజాగా జగన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అసలు గూగుల్ డేటా సెంటర్ కి బీజం పడిందే తమ హయాంలో అని చెప్పుకొచ్చారు జగన్.
LIVE: Former Chief Minister, YSRCP Chief Sri @YSJagan Press Meet https://t.co/Bgh4emqgX4
— YSR Congress Party (@YSRCParty) October 23, 2025
జగన్ ఏమన్నారు?
2020లో కరోనా టైంలోనే అదానీ డేటా సెంటర్ తో అప్పటి వైసీపీ ప్రభుత్వం ఒప్పందానికి సిద్ధమైందని చెప్పారు జగన్. 2021 మార్చిలో సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. 2023 మే లో డేటా సెంటర్‌కు వైజాగ్‌లో శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. సింగపూర్ నుంచి సబ్ సీ కేబుల్ తీసుకు రావాలనుకున్నామని చెప్పారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం కృషి ఫలితంగానే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తోందన్నారు. డేటా సెంటర్ వల్ల ఉద్యోగవకాశాలు తక్కువే కానీ, భవిష్యత్తుకోసం ఎకో సిస్టమ్ బిల్డ్ చేసినట్టు అవుతుందన్నాారు జగన్. అందుకే తక్కువ ఉద్యోగాలు వస్తాయని తెలిసి కూడా నాడు అదానీతో తమ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు.
అదానీ, గూగుల్ ఒక్కటే..
తాము అదానీతో ఒప్పందం కుదుర్చుకున్నామని, దాని ద్వారా గూగుల్ వస్తోందన్నారు జగన్. అదానీ, గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలున్నాయని గుర్తు చేశారు. అదానీ ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్ డేటా సెంటర్ అన్నారు. ఇందులో అదానీ గ్రూప్ రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెడుతుందన్నారు. వైజాగ్‌లో అదానీ ఇన్‌ఫ్రాకు చెందిన కంపెనీలే గూగుట్ డేటా సెంటర్‌ని నిర్మిస్తాయని చెప్పారు. అదానీ నిర్మించి ఇచ్చాక, గూగుల్ దానిని వాడుకుంటుందన్నారు జగన్. గూగుల్ తో ఒప్పందం వేళ కనీసం చంద్రబాబు అదానీకి కృతజ్ఞతలు కూడా చెప్పలేదని ఎద్దేవా చేశారు.
ఆ క్రెడిట్ మాకివ్వరా..?
తమకు క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం లేదంటున్న జగన్, గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ కి వస్తున్నందున ఆ ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. గతంలో హైదరాబాద్ హైటెక్ సిటీ విషయంలో కూడా ఇదే జరిగిందన్నారు. నాడు కేవలం 6 ఎకరాల్లో హైటెక్ సిటీని కట్టిన చంద్రబాబు.. తానే హైదరాబాద్ రూపకర్తను అని చెప్పుకుంటారని విమర్శించారు. అసలు హైటెక్ సిటీకి పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి హయాంలో హైదరాబాద్ లో నిజమైన అభివృద్ధి జరిగిందన్నారు. కానీ చంద్రబాబు ఆ నిజాలను ఒప్పుకోరన్నారు. అసలు చంద్రబాబుకి 20 ఏళ్లపాటు హైదరాబాద్‌తో సంబంధమే లేదని, మరి ఆ టైమ్ లో జరిగిన అభివృద్ధికి ఆయన కారకుడెలా అవుతారని ప్రశ్నించారు.
Also Read: మాకు లేని ఇగోలు మీకెందుకబ్బా..
అంతా బాగానే ఉంది కానీ, వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ విషయంలో జగన్ యూ టర్న్ తీసుకున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కనీసం గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం కుదిరిన సమయంలో ఒక్క ట్వీట్ కూడా వేయని జగన్, ఇప్పుడు దాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూడటం రాజకీయ అవకాశవాదం అని ఎద్దేవా చేస్తున్నారు.