మాజీ సీఎం జగన్ ఈరోజు సుదీర్ఘ ప్రెస్ మీట్ లో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబుపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనకు సిగ్గు, లజ్జ లేదని.. ఉంటే ఇలా ప్రవర్తించేవారు కాదని తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాగేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు తప్పులు చేసి, వాటిల్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు చేశారని, చేస్తూనే ఉన్నారని అన్నారు. ఎల్లో మీడియా ఆయనకు వంత పాడుతోందని.. ఆ పేపర్లు టిష్యూ పేపర్లకు ఎక్కువ, టాయిలెట్ పేపర్లకు తక్కువ అంటూ మండిపడ్డారు జగన్.
రాష్ట్రంలో ఇలా నకిలీ మద్యం.. విచ్చలవిడితనంతో లిక్కర్ అమ్మకాల్ని ఇప్పటి వరకూ చూసింది లేదు.. మరీ ఇంత దుర్మార్గమా @ncbn ?#YSJaganPressMeet#CBNFailedCM#IdhiMunchePrabhutvam #SadistChandraBabu#MosagaduBabu pic.twitter.com/REJeyGhxmK
— YSR Congress Party (@YSRCParty) October 23, 2025
ఎందుకింత ఆవేశం?
ఏపీలో లిక్కర్ స్కామ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది. ఇందులో అరెస్ట్ అయిన వారు, ఈ కేసుకు సంబంధించిన వారు టీడీపీ నేతలే అయినా, వారు సరిగ్గా ఎన్నికల ముందు వైసీపీ నుంచి ఇటు వచ్చారు. ఓ పథకం ప్రకారమే వారు టీడీపీలోకి వచ్చి, లిక్కర్ కల్తీ చేసి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించారనేది ప్రధాన ఆరోపణ. లిక్కర్ కేసులో ఆరోపణలు వచ్చిన వెంటనే వారిని టీడీపీ సస్పెండ్ చేయడం విశేషం. ఇప్పుడు బంతి వైసీపీ కోర్టులో పడింది. దీంతో జగన్ రంగంలోకి దిగారు.
LIVE: Former Chief Minister, YSRCP Chief Sri @YSJagan Press Meet https://t.co/Bgh4emqgX4
— YSR Congress Party (@YSRCParty) October 23, 2025
జోగి రమేష్ పేరు..
కల్తీ లిక్కర్ వ్యవహారంలో వైసీపీకి బూమరాంగ్ అయినట్టు తెలుస్తోంది. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు పోలీస్ కస్టడీలో మాట్లాడిన వీడియో బయటకు రావడం, అందులో జోగి రమేష్ పేరు బయటకు రావడంతో రచ్చ మొదలైంది. జోగి రమేష్ అన్నిటికీ మూలం అంటూ టీడీపీ కూడా ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ నేరుగా రంగంలోకి దిగి అదంతా కట్టుకథ అంటున్నారు. నకిలీ మద్యం వ్యవహారంలో తప్పు టీడీపీదేనంటున్నారు. నకిలీ మద్యం తయారు చేసి, వారికి చెందిన షాపుల్లో అమ్ముతున్నారని, బెల్ట్ షాపులతో ఏపీలో అత్యధిక వ్యాపారం జరుగుతోందని ఆరోపించారు.
మా హయాంలో ఇలా..
పోలీసులు కూడా టీడీపీ నేతలతో అంటకాగుతున్నారని విమర్శించారు జగన్. రాష్ట్రంలో నకిలీ మద్యం ఫ్యాక్టరీలు కనిపిస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్నారాయన. పోలీసుల భద్రత నడుమ గ్రామాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పారు. బెల్ట్ షాపులతోపాటు ఇల్లీగల్ పర్మిట్‌రూమ్‌లు కూడా నిర్వహిస్తున్నారని చెప్పారు. డబ్బుల కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారని, ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల మేర గండి కొడుతున్నారని చెప్పారు. తమ హయాంలో ప్రభుత్వమే లాభాపేక్ష లేకుండా మద్యం అమ్మేదని, షాపులకు టైమింగ్స్ ఉండేవని, షాపుల సంఖ్య కూడా తక్కువని చెప్పుకొచ్చారు జగన్.
Also Read: మాగంటి గోపీనాథ్ కు సునీత భార్య కాదా?
ఏపీలో ఇప్పుడు అమ్ముడవుతున్న ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీదేనని చెప్పారు జగన్. అంతా బాగానే ఉంది కానీ.. అసలు ఆయన హయాంలో ఇచ్చిన మద్య నిషేధం హామీ ఏమైందని నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. జగన్ హయాంలో కల్తీ లిక్కర్ తాగి అప్పట్లో కొంతమంది చనిపోయారనే వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు కల్తీ లిక్కర్ తాగి ఎవరూ చనిపోయారన్న ఉదాహరణలు లేవు. కానీ వైసీపీ మాత్రం కల్తీ లిక్కర్ వల్ల మరణాలు సంభవించాయని అంటోంది. ఈ క్రమంలోనే తప్పుడు వార్తలు ప్రచారంలోకి తెచ్చారంటూ కొంతమందిపై కేసులు నమోదయ్యాయి. దీంతో జగన్ కూడా ఇప్పుడు తెరపైకి వచ్చి, కల్తీ లిక్కర్ అంటూ హడావిడి మొదలు పెట్టారని తెలుస్తోంది.
Also Read: మాకు లేని ఇగోలు మీకెందుకబ్బా..