Amaravati: ఏపీ రాజధానికి బుల్లెట్ ట్రైన్ రాబోతోందా? ఉన్నట్లుండి ప్రతిపాదనల మార్పు వెనుక ఏం జరిగింది? రైట్స్ సంస్థ ఎలాంటి ప్రతిపాదనలు చేసింది. దక్షిణ మధ్య రైల్వే ఏంమంటోంది? ఇవే ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతున్నాయి. ఇంతకీ హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ వెనుక ఏం జరుగుతోంది?
అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్
ఏపీ రాజధాని అమరావతి మీదుగా హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ రాబోతోంది. తాజాగా ఈ కారిడార్‌కు సంబంధించి రైట్స్ సంస్థ.. దక్షిణ మధ్య రైల్వేకు ప్రతిపాదనలు అందజేసింది. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నైకి హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ రానుంది. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రైల్వే లైన్ రాబోతోంది.
ఈ ప్రాజెక్టుకు దాదాపు మూడు లక్షల కోట్ల పైగానే వ్యయం అవుతుందని అందులో ప్రస్తావించింది. ఈ ట్రైన్ అమరావతి మీదుగా గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి ప్రాంతాల మీదుగా మొత్తం 9 స్టేషన్లు ప్రతిపాదించారు. అంటే ఏపీలో ఏడు జిల్లాల మీదుగా ఈ ట్రైన్ వెళ్లనుంది. అమరావతి పరిధిలో పల్నాడు, గుంటూరు జిల్లాల మీదుగా ఈ కారిడార్ రానుందన్నమాట.
ఏపీ ప్రభుత్వం చేతిలో నిర్ణయం
ఏపీలో ఈ ప్రాజెక్టు పరిధి 504 కిలోమీటర్లు. అందులో అమరావతి 147.45 కిలోమీటర్ల పరిధిలో హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ రానుంది. ఆ లెక్కన పల్నాడు జిల్లాలో 81 కిలోమీటర్లు, గుంటూరు జిల్లాలో దాదాపు 67 కిలోమీటర్లు సాగనుంది. ఈ ప్రాజెక్టుకు 1,877 హెక్టార్ల భూమి అవసరమని ప్రతిపాదించింది రైట్స్ సంస్థ. దీనికి సంబంధించిన రాజధాని అమరావతిలో 443 ఎకరాలు సేకరణ జరగాల్సివుంది.
హైదరాబాద్-బెంగళూరు కారిడార్ పరిధి దాదాపు 605 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కారిడార్‌కు దాదాపు రూ.2.38 లక్షల కోట్లు అవుతుందని పేర్కొంది. అందులో ఏపీ పరిధిలో 263 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం జరగనుంది. నాలుగు జిల్లాల్లో 6 ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. ఇక హైదరాబాద్-చెన్నై కారిడార్‌కు ఏపీలో 9 ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు కానుంది. రెండు కారిడార్లలో పనులు ఏపీలో జరగనున్నాయి.
ALSO READ: మాకు లేని ఇగోలు మీకెందుకు? కూటమిలో అందరి మాట ఇదేనా?
హైదరాబాద్ టు చెన్నైకి, బెంగుళూరు నుంచి హైదరాబాద్ కారిడార్ ప్రాజెక్టులకు రూ.5.42 లక్షల కోట్ల వ్యయంతో అంచనాలు సిద్ధం చేసినట్టు సమాచారం. హైదరాబాద్-బెంగళూరు హై స్పీడ్ కారిడార్ కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో నిర్మాణం జరగనుంది. నార్మల్ భూములతోపాటు దాదాపు మూడు హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి దక్షిణ మధ్య రైల్వే ఓ లేఖ సమర్పించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.