Kolikapudi Vs Kesineni Chinni: ఏపీలో ఇటీవల సొంత పార్టీ నేతల మధ్య పంచాయితీలు నడుస్తున్నాయి. తాజాగా తిరువూరులో పొలిటికల్ హీట్ రాజుకుంది. తిరువూరు ఎమ్మెల్యే వర్సెస్ విజయవాడ ఎంపీ వివాదం మరో మలుపు తిరిగింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఫేస్ బుక్ వేదికగా ఎంపీ కేశినేని చిన్నిపై సంచలన ఆరోపణలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.5 కోట్లు కేశినేని చిన్ని అడిగారని కొలికపూడి ఆరోపించారు.
అందుకు తన అకౌంట్ నుంచి రూ.20 లక్షల చొప్పున మూడుసార్లు రూ.60 లక్షలు కేశినేని చిన్నికి ట్రాన్స్‌ఫర్ చేసినట్టు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ పెట్టారు. ఎంపీ కేశినేని చిన్ని పీఏ మోహన్ పోరంకి వచ్చి రూ.50 లక్షలు తీసుకెళ్లారన్నారు. తన స్నేహితులు ఇచ్చిన రూ.3.50 కోట్ల గురించి రేపు మాట్లాడుకుందాం, నిజమే గెలవాలి అంటూ పోస్టులు పెట్టారు. ఇవాళ తిరువూరులో ఎంపీ కేశినేని చిన్ని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొనలేదు.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారని ఇటీవల తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎంపీ కార్యాలయంలో కూర్చుని పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. ఈ వ్యవహారంలో ఎంపీ పీఏ కీలకంగా ఉన్నారని కొలికపూడి చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఇవాళ తిరువూరులో ఎంపీ కేశినేని చిన్ని పర్యటిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. తానెప్పుడూ తన జేబులో డబ్బులు మాత్రమే ఖర్చు పెడతానని స్పష్టం చేశారు. కేవలం ఐదు, పది లక్షల గురించి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ ప్రజల నమ్మరన్నారు. ఎమ్మెల్యే చేసిన ఆరోపణలను టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. తానెప్పుడూ రంగులు మార్చలేదన్నారు. 12 నెలలు దేవుడిగా ఉన్న తాను ఇప్పుడు దెయ్యంగా మారిపోయానా? అని ఎమ్మెల్యే కొలికిపూడిని ప్రశ్నించారు. ఎంపీ కేశినేని చిన్ని లేకపోతే తాను లేనని చెప్పిన కొలికపూడి ఇప్పుడు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలన్నారు. తానేంటో విజయవాడ ప్రజలకు తెలుసన్నారు.
Also Read: Jagan Vs RRR: ఇంట్లో కూర్చుని మాట్లాడితే కుదరదు.. ఏదైనా ఉంటే అసెంబ్లీలో చూసుకో
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో పోస్టులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ విమర్శలు, వివాదాలు సృష్టించే వ్యాఖ్యలు చేయడంపై సీరియస్ అయ్యారు. దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో మాట్లాడారు. ఇద్దరినీ పిలిచి మాట్లాడతానని పల్లా శ్రీనివాస్ చెప్పారు. దుబాయ్ నుంచి వచ్చాక తానే స్వయంగా మాట్లాడతానని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.