Vizag News: వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికులు మరోసారి ఆందోళన చేపట్టారు. పరిపాలన భవనానికి ఎదురుగా కార్మికులు తరలి వచ్చి ధర్నాకు దిగారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెల కొన్నాయి. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఇటీవల జారీ చేసిన కార్మికుల వేతనాలను ఉత్పత్తి ఆధారంగా చెల్లించాలన్న సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలన్నది కార్మికులు డిమాండ్. అదే క్రమంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కార్మికులు అసహనం వ్యక్తం చేశారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికులు మళ్లీ ఆందోళన
ఉన్నట్లుండి స్టీల్‌ప్లాంట్ కార్మికులు ఆందోళనకు దిగడంపై ఏపీ కాంగ్రెస్ రియాక్ట్ అయ్యింది. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కార్మికుల వైపు వేలు చూపిస్తోందన్నారు వైఎస్ షర్మిల. విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ సంస్థనా? మోడీ బినామీ కంపెనీనా? ఎంత ఉత్పత్తికి అంతే వేతనం ఏంటి ? ఉత్పత్తి లేదని ఆ నింద కార్మికుల మీద మోపుతారా ? బహిరంగ సర్క్యులర్ ఇస్తారా ?
దేశంలో భారతీయ కార్మిక చట్టం ఉందా? మోడీ లేబర్ చట్టం అమల్లో ఉందా? అంటూ ప్రశ్నించారు. ఆంధ్రుల హక్కుతో ఇదేం చెలగాటం? అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కండ కావరం, నియంత ప్రధాని మోడీ వికృత చేష్టలకు నిదర్శనమన్నారు. స్టీల్ ప్లాంట్‌ను అమ్మేకుట్రలో భాగమే ఇదంతా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
30 వేల మంది కార్మికులను 18వేలకు కుదించిందెరు? ఉత్పత్తికి కావాల్సిన ముడిసరుకులు ఎందుకు తగ్గించారు? 45 రోజుల పాటు సరిపడా నిల్వ ఉండాల్సిన రా మెటీరియల్ ప్రస్తుతం ఐదు రోజులకు మించి లేదన్నారు. ఐరన్ ఓర్ లేకపోవడం వల్ల నెలకు వారం రోజులు ఉత్పత్తి ఆపుతున్నారని, బ్యాంకుల నుంచి వర్కింగ్ క్యాపిటల్ ఆపేశారని ఆరోపించారు. స్పేర్ పార్ట్స్ ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు.
స్టీల్ ప్లాంట్ రవాణాకు కావలసిన రైల్వే వ్యాగన్లు ఇవ్వకుండా అడ్డుకట్ట వేసినట్టు రాసుకొచ్చారు. తప్పులు యాజమాన్యం చేసి కార్మికుల మీద నిందలు మోపడం ఏంటి? వారి జీతాలను కోస్తామని చెప్పడం ఏంటి? అరకొర సదుపాయాలతో బలవంతపు టార్గెట్లు పెట్టడం ఎందుకు? 7.3 మిలియన్ సామర్థ్యంలో 1.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి తగ్గడానికి ప్రభుత్వ చర్యలు కారణం కాదా?
ALSO READ: కల్తీనెయ్యి కేసులో సిట్ దూకుడు.. వైవీ సుబ్బారెడ్డి పాత్ర ఎంత?
స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. నష్టాలను కార్మికుల మీద రుద్దడం సబబు కాదని, యాజమాన్యం ఇచ్చిన సర్క్యులర్ తక్షణం వెనక్కు తీసుకోవాలన్నారు. పూర్తి స్థాయి ఉత్పత్తికి కావాల్సిన రా మెటీరియల్ అందించి, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ కాంగ్రెస్ డిమాండ్. ఈ విషయంపై కార్మికులు చేసే పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు.
స్టీల్ ప్లాంట్ కార్మికులపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై అభ్యంతరకరం వ్యక్తం చేశారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును వైట్ ఎలిఫెంట్‌గా పోల్చడం, ఊరికే జీతాలు ఇస్తున్నట్లు మాట్లాడటం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే వెంటనే కార్మికుల పెండింగ్ జీతాలు ఇప్పించాలన్నారు. ప్రైవేటీకరణ లేదని ప్రధానితో బహిరంగ ప్రకటన చేయించాలని కోరారు. కేంద్రంతో కొట్లాడి స్టీల్ ప్లాంట్ ను SAILలో విలీనం చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలన్నారు.