జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ప్రత్యర్థి పార్టీలకు ఆయన సవాల్ విసిరారు. ఇన్ని రోజులు తాను ఓపిక పట్టానని ఇక మీదట అలా ఉండబోదని ప్రతిపక్ష వైసీపీ నేతలకు స్పష్టమైన మెసేజ్ పంపించారు. తన జోలికి వచ్చినా ఓకే.. పార్టీ జోలికి వచ్చినా ఓకే. కానీ, ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడతాం.. గొడవలు సృష్టించి అశాంతిని రగిలిద్దాం అనుకుంటే మాత్రం ఒక్కొక్కొరినీ ఏరిపారిస్తామని చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాలు అన్నాక అధికారం శాశ్వతం కాదని పవన్ మరోసారి గుర్తుచేశారు.తనకు ఓటమి అంటే లెక్కలేదని కూడా స్పష్టంచేశారు. గెలిచినా ఓడినా తాను ప్రజల కోసమే నిలబడతానని నొక్కిచెప్పారు. పిఠాపురంలో అభివృద్ధి జరగకపోతే, నిధులు ఇవ్వకపోతే తనను విమర్శించాలని, పార్టీని విమర్శించినా తాను తీసుకుంటానని ప్రతిపక్ష పార్టీకి సూచించారు.తల్లి బిడ్డా న్యాయంగా ముందుకు పోవాలన్నారు. మంచి సలహాలు ఇస్తే తీసుకుంటామన్నారు. అలా కాకుంండా, పిఠాపురం ప్రజల మధ్య కుల, మత విభేదాలు సృష్టించి గొడవలు చేద్దామనుకుంటే మాత్రం తాను ఏంటో చూపిస్తానని హెచ్చరికలు చేశారు. స్టేజీ మీదే జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఆదేశాలు ఇచ్చారు. తప్పు చేస్తే ఎవరిని చూడొద్దని వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకుల మీద కేసులు పెట్టుకుంటూ వెళ్లారని, కూటమి ప్రభుత్వంలో అలా జరగడం లేదని అన్నారు.తెలుగుదేశం పార్టీ అంటే తనకు ముందు నుంచి అభిమానం ఉందని, అలా అని జనసేనను తక్కువ చేసి మాట్లాడం లేదన్నారు. తన సిద్ధాంతాన్ని నమ్మే జనసైనికులు అన్యాయం జరిగిందంటే నిలబడతారని.. ఊరికి పది అలాంటి వారుంటే వెయ్యి మందితో సమానమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక చంద్రబాబు, తనకు మధ్య విభేధాలు లేవని, కూటమిలో ఎలాంటి లుకలుకలు లేవన్నారు.కూటమి అలాగే ఉంటుందని, కూటమి నేతలు సైతం ఎక్కడా నోరుజారొద్దన్నారు.
Jagan Politics: రాజధాని అమరావతి వ్యవహారం.. న్యాయస్థానానికి జగన్? తెర వెనుక కీలక పరిణామాలు
కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని కోరారు. నియోజకవర్గంలో ఏ చిన్న గొడవ జరిగినా.. చిన్న పిల్లలు కొట్టుకున్నా తననే బాధ్యుడిని చేయడం సరికాదన్నారు. పిఠాపురం శాంతి భద్రతల విషయంలో అస్సలు రాజీపడేది లేదన్నారు. ఎవరైనా పిచ్చిపనులు చేసి అశాంతిని రగిలించాలని చూస్తే రాజ్యాంగం నియమాలను గౌరవిస్తూనే చట్ట ప్రకారం వారిని శిక్షిస్తామన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తమ బుద్ధి మార్చుకోవాలని, విమర్శ అనేది ఎవరి గౌరవాన్ని కించపరిచేలా ఉండరాదని ఏపీ డిప్యూటీ సీఎం అన్నారు. కూటమి నేతలు మధ్య పొసగడం లేదని బయట ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటారని.. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి సైతం బలంగానే ఉందని ఈ సభ వేదికగా ఆయన వైసీపీకి, జగన్‌కు బలమైన సంకేతం పంపించారని కూటమి నేతలు పేర్కొంటున్నారు.