Atreyapuram Utsav 2026: కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఉల్లాసంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు ‘సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ’ పేరిట డ్రాగన్ పడవల పోటీలు నిర్వహిస్తున్నారు. జనవరి 11న మొదలైన ఈ సంబరాలు 13వ తేదీ వరకు జరగనున్నాయి. మొదటి రోజు ఈత, రంగవల్లుల పోటీలు, ఫుడ్ ఫెస్టివల్ జరిగాయి. రెండో రోజు డ్రాగన్ పడవల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, అధికారులు ప్రారంభించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల నుంచి 250 మంది వచ్చారు.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆత్రేయపురం ఉత్సవాల రెండో రోజున డ్రాగన్ పడవల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు కోనసీమ వైభవానికి విశేష ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆర్డీఓ శ్రీకర్ తో కలిసి ఎమ్మెల్యే సత్యానందరావు జెండా ఊపి డ్రాగన్ పడవల పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో, ప్రజల కోలాహలం మధ్య పడవల పోటీలు ఉల్లాసంగా కొనసాగాయి. కేరళ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన డ్రాగన్ పడవల పోటీలు కోనసీమలో నిర్వహిస్తున్నారు. పడవల పోటీలు సంక్రాంతి ఉత్సవాలకు మరింత శోభను తీసుకొచ్చాయని స్థానికులు అంటున్నారు. భవిష్యత్తులో ఈ తరహా కార్యక్రమాలతో కోనసీమ పర్యాటక పరంగా మరింత గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే సత్యానందరావు అన్నారు.
ఆత్రేయపురం సంక్రాంతి సంబరాల్లో భాగంగా సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ డ్రాగన్ పడవల పోటీలు కోనసీమ వైభవాన్ని ప్రతిబింబించాయి. కేరళ తరహాలో నిర్వహించిన డ్రాగన్ పడవల పోటీలకు విశేష స్పందన లభిస్తుంది. ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన 28 బృందాలు పడవల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చాయి.
Also Read: నిషేధాజ్ఞల మధ్య నిలిచిన సంప్రదాయం.. కోడి పందాల వెనుక ఉన్న ఆసక్తికర చరిత్ర !
ఆత్రేయపురం ఉత్సవం- 2026 భాగంగా.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆదివారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. విజేతలకు రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి ఛైర్మన్ పొడపాటి తేజశ్విని బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో మొత్తం 243 మంది మహిళలు పాల్గొనగా.. విజేతగా నిలిచిన కె.లత(విశాఖపట్నం) రూ.20 వేలు, ద్వితీయ బహుమతి పి.ఆదిశ్రీ(రాజమండ్రి) రూ.10 వేలు, తృతీయ బహుమతి జ్యోత్స్న ప్రియ(ఉచ్చిలి) రూ.5 వేలు, మరో 10 మంది ప్రత్యేక బహుమతులు దక్కించుకున్నారు.