Avinash Reddy : వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ సిద్ధం కావటం ఉత్కంఠ రేపుతోంది. అరెస్టును సహించబోమంటూ అవినాష్ రెడ్డి తల్లి చికిత్స పొందుతున్న కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి ఎదుట బైఠాయించి అనుచరుల ఆందోళనకు దిగడం మరింత ఉద్రిక్తతను పెంచింది. వైసీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు అక్కడి రావడంతో హైటెన్షన్ నెలకొంది. రాష్ట్ర పోలీసుల వ్యవహారశైలిపైనా విమర్శలు వస్తున్నాయి. సీబీఐకు సహకరించడంలేదని ఆరోపణలు వస్తున్నాయి.
మరోవైపు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తక్షణం విచారించేలా ఆదేశాలు జారీ చేయాలని మిసిలేనియస్ అప్లికేషన్ వేశారు. దీనిపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
వివేకా హత్యకేసులో విచారణకు హాజరుకావాలని సీబీఐ తాజాగా అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అవినాష్‌రెడ్డి తరఫు లాయర్లు ఈ కేసును సోమవారం జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ముందు ఉంచారు. తన తల్లి అనారోగ్యం కారణంగా వారం రోజులపాటు సీబీఐ విచారణకు హాజరుకాలేనని అందులో అవినాష్ పేర్కొన్నారు. తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తక్షణం విచారించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
సీబీఐ విచారణకు హాజరుకాలేని పరిస్థితి ఉన్నందున మధ్యంతర ఉపశమనం ఇవ్వాలని అవినాష్‌రెడ్డి సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేశారు. ఈ కేసును జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ముందు కోర్టు లిస్ట్ చేసింది. నేడు సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలపై ఉత్కంఠ ఏర్పడింది.