Big Stories

Telangana : జేపీఎస్‌లకు గుడ్ న్యూస్ .. క్రమబద్ధీకరణకు కేసీఆర్‌ గ్రీన్ సిగ్నల్.. షరతులు వర్తిస్తాయ్..

Telangana : తెలంగాణలోని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియాను ఆదేశించారు.

- Advertisement -

2019లో 9,350 మంది జేపీఎస్‌లను ప్రభుత్వం జిల్లా స్థాయి ఎంపిక కమిటీల ద్వారా రాతపరీక్ష నిర్వహించి ఎంపిక చేసింది. ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపట్టింది. వారికి మూడేళ్ల శిక్షణ కాలాన్ని నిర్ణయించింది. అయితే ఆ తర్వాత మరో ఏడాది పెంచింది. గత నెల 28తో ఆ గడువు ముగిసింది. దీంతో తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని జేపీఎస్ లు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో సమ్మెబాట పట్టారు. న్యాయం చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో.. 16 రోజుల ఆందోళన తర్వాత విధుల్లో చేరారు.

- Advertisement -

జేపీఎస్ ల అంశంపై తాజాగా సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ క్రమబద్ధీకరణ ప్రక్రియకు ఆమోదం తెలిపారు. జేపీఎస్‌ల క్రమబద్ధీకరణకు పనితీరును ప్రామాణికంగా తీసుకుంటామన్నారు. పనితీరుపై మదింపు కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని ఆదేశించారు. ఈ కమిటీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, జిల్లా అటవీ అధికారి, జిల్లా ఎస్పీ/డీసీపీ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర కార్యదర్శి లేదా శాఖాధిపతి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. జేపీఎస్‌ల పనితీరుపై జిల్లాస్థాయి కమిటీ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన గల రాష్ట్రస్థాయి కమిటీకి నివేదిక అందిస్తుంది. ఈ కమిటీ ఉద్యోగులు క్రమబద్ధీకరణపై తుది సిఫార్సులతో సీఎస్‌కు నివేదిక పంపుతుంది.

మరోవైపు కొన్ని గ్రామపంచాయతీల్లో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జేపీఎస్‌లను భర్తీ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. క్రమబద్ధీకరణ పూర్తయిన తర్వాత ఈ ప్రక్రియను చేపట్టాలని సూచించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News