CM Progress Report: అమరావతి అంటే కేవలం ఓ రాజధానిగా మాత్రమే కాదు.. గ్రీన్ ఎనర్జీ కారిడార్‌గానూ మార్చాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. విజన్‌తోనే అభివృద్ధి వెలుగులు సాధ్యమని.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కావాల్సిన చర్యలన్నీ చేపడుతున్నట్లు తెలిపారు. వాట్సాప్ మన మిత్ర ద్వారా.. 700 ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక.. ఏపీని లాజిస్టిక్ హబ్‌గా మార్చేందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆగస్ట్ 11, సోమవారం ( అవేర్ 2.0 )
ఈ వారం.. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెస్ సొసైటీ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. ఆర్టీజీఎస్‌లోని అవేర్ విభాగం రూపొందించిన అవేర్ 2.0 వెర్షన్‌ని సీఎం ఆవిష్కరించారు. ఆర్టీజీఎస్‌పై నిర్వహించిన రివ్యూలో.. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా.. పంద్రాగస్ట్ నుంచి 700 రకాల ప్రభుత్వ సేవలను.. పౌరులకు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సేవలు పొందడంలో పౌరులకు ఎలాంటి టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా.. సంబంధిత శాఖలన్నీ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఆగస్ట్ 11, సోమవారం ( లాజిస్టిక్స్ హబ్ )
పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రోడ్లు, రైలు, అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా.. సరకు రవాణా నిర్వహణకు లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల సరకు రవాణాని కార్పొరేషన్ ద్వారా నిర్వహించాలన్నారు. విమానాశ్రయాలు, ఓడరేవులు, ఏపీ మారిటైం పాలసీలో తీసుకురావాల్సిన మార్పులు, లాజిస్టిక్ కార్పొరేషన్ లాంటి అంశాలపై సీఎం చంద్రబాబు ఈ వారం సమీక్షించారు. రాష్ట్రంలో 20 పోర్టుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఉన్న ఓడరేవులు, విమానాశ్రయాల్లో భారీగా కార్యకలాపాలు జరుగుతున్నాయని.. వాటి సమీపంలో ఆర్థిక కేంద్రాలను అభివృద్ధి చేయాలన్నారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులను లింక్ చేస్తూ.. పీపీపీ విధానంలో శాటిలైట్ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ తరహా సమీకృత అభివృద్ధికి ఉన్న అవకాశాలపై బ్లూ ప్రింట్ సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి చోదకశక్తిగా లాజిస్టిక్ కార్పొరేషన్ ఉండాలన్నారు. 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే MSME పార్కుల దగ్గర శాటిలైట్ టౌన్‌షిప్‌ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు సీఎం. కుప్పం, దగదర్తి ఎయిర్‌పోర్టుల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. నేషనల్ హైవేలు, ఎయిర్‌పోర్టులను కలిపేలా.. అంతర్గత రోడ్ల నిర్మాణం ఉండాలన్నారు సీఎం.
ఆగస్ట్ 12, మంగళవారం ( యంగ్ ప్రొఫెషనల్స్‌తో సీఎం )
విజన్‌తోనే అభివృద్ధి వెలుగులు సాధ్యమన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కావాల్సిన చర్యలన్నీ చేపడుతున్నట్లు తెలిపారు. ఈవారం సచివాలయంలో జరిగిన స్వర్ణాంధ్ర విజన్-2047 యంగ్ ప్రొఫెషనల్స్ మీటింగ్‌కి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. నియోజకవర్గాల సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం.. ప్రతి నియోజకవర్గానికి పీజీ చేసిన ఓ యంగ్ ప్రొఫెషనల్‌ని నియమించింది. యంగ్ ప్రొఫెషనల్స్‌గా నియమితులైన వారంతా.. నియోజకవర్గాల అభివృద్ధికి తోడ్పడాలని సీఎం సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయం చేసుకోవాలని.. ప్రభుత్వానికి, తనకు బలంగా ఉండాలని సూచించారు. విద్యుత్ లేని ఊరి నుంచి వచ్చి.. ఉమ్మడి రాష్ట్రంలోనే విద్యుత్ సంస్కరణలు తెచ్చానన్నారు చంద్రబాబు. యంగ్ ప్రొఫెషనల్స్ కూడా తమకు కేటాయించిన నియోజకవర్గాల అభివృద్ధికి.. ప్రాధాన్యతాంశాలను గుర్తించాలన్నారు. ప్రజలకు ఏది మంచిదో చెప్పాలి. ఎక్కడెక్కడ ఏయే సమస్యలు వస్తాయనే అంశంపైనా ముందుగానే అంచనాలు వేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడే సహజ వనరులు ఉంటాయని.. వాటిని యంగ్ ప్రొఫెషనల్స్ గుర్తించాలని సూచించారు. ఆ వనరులతో నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధంచేయాలని దిశానిర్దేశం చేశారు.
ఆగస్ట్ 12, మంగళవారం ( అమరావతి అన్‌స్టాపబుల్ )
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు రికార్డు సమయంలో పూర్తి కావాలని.. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిర్దేశిత గడువు కంటే ఆరు నెలల ముందే నగర నిర్మాణం పూర్తవ్వాలని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మొత్తం 81 వేల 317 కోట్ల పనులను సీఆర్డీఏ ప్రతిపాదించింది. వీటిలో.. 50 వేల 552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచింది. భవన నిర్మాణాలు, ఎల్పీఎస్ మౌలిక సదుపాయాలు, రోడ్లు, డక్ట్‌లు లాంటి ట్రంక్ ఇన్ఫ్రా లాంటి 74 పనులు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. రాజధానిలో ఎల్‌పీఎస్ లేఔట్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉద్యోగులు, న్యాయమూర్తుల నివాస భవనాలు, రహదారులు, వరద నియంత్రణ పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. ప్రతి నెలా అమరావతి పనుల పురోగతిపై సమీక్ష చేస్తానన్నారు సీఎం. టైమ్ ప్రకారం పునులు పూర్తవకపోతే.. ఆ కాంట్రాక్ట్ సంస్థతో పాటు అధికారులు కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. పనుల పురోగతిని రియల్‌టైంలో మానిటర్ చేస్తానని తెలిపారు. అదేవిధంగా అమరావతిలో నిర్మాణాలు చేపట్టనున్న వివిధ సంస్థలకు వేగంగా అనుమతులివ్వాలని సీఎం ఆదేశించారు. ఇప్పటివరకు భూములు కేటాయించిన 72 సంస్థలు ఏ మేరకు నిర్మాణాలు చేపడుతున్నాయో పర్యవేక్షించాలన్నారు. వాటికి అనుసంధానంగా పెట్టుబడులు, వెంచర్లు కూడా రావాల్సి ఉందన్నారు సీఎం. కేవలం భవనాల నిర్మాణంతో మాత్రమే రాజధాని నగరం పూర్తి కాదని.. నాలెడ్జ్ ఎకానమీ, స్టార్టప్స్ లాంటి ఎకో సిస్టమ్ కూడా కల్పించాలని సూచించారు.
దేశంలోని అత్యుత్తమ పది రియల్ ఎస్టేట్ కంపెనీలను ఆహ్వానించి.. రాష్ట్రంలో ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశం కల్పించాలన్నారు సీఎం. అమరావతిని గ్రీన్ ఎనర్జీ కారిడార్‌గా మార్చేందుకు ఈవీ వాహనాలని ప్రోత్సహించాలన్నారు. సీడ్ క్యాపిటల్, క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ ఏరియా ప్రాంతాల్లో గాలి నాణ్యత ఎలా ఉందో నమోదు చేసి వివరాలు ప్రదర్శించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్ల వ్యవహారంలో.. ఇబ్బందులుంటే పరిష్కరించాలన్నారు. రైతుల విజ్ఞప్తులను పరిశీలించి.. మాస్టర్ ప్లాన్ ప్రభావితం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని పనులు జరగకపోవడంతో.. నిర్మాణానికి తెచ్చిన ఇనుము, ఇతర సామాగ్రి తుప్పు పట్టిందని కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. నిర్మాణం కోసం సేకరించిన ఇసుక నిల్వల్ని కూడా ఎత్తుకెళ్లారని తెలిపారు. ఈ మేరకు.. ఇసుకని అందించాలని.. మైనింగ్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.
ఆగస్ట్ 13, బుధవారం ( గ్రీన్ ఎనర్జీ కారిడార్ )
ఆంధ్రప్రదేశ్‌ని గ్రీన్ ఎనర్జీ కారిడార్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ మారుతున్న డైనమిక్స్‌కి అనుగుణంగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరా పరిస్థితి, విద్యుత్ ప్రాజెక్టులు, పెట్టుబడులు, విద్యుత్ ఛార్జీల భారం తగ్గింపు అంశాలపై.. సీఎం ఈ వారం రివ్యూ చేశారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో 2024 జూన్ నుంచి ఇప్పటి వరకూ రూ.3.19 లక్షల కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయని అధికారులు వివరించారు.
ఆగస్ట్ 13, బుధవారం ( రెయిన్ రివ్యూ )
ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు అధికారులతో రివ్యూ చేశారు. విపత్తు నిర్వహణ, వ్యవసాయం, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఈ అత్యవసర సమీక్షలో పాల్గొన్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో వాగులు, వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలపై.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా.. ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని.. వృథాగా సముద్రంలోకి పోనివ్వకుండా.. సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రోజుకు నాలుగు టీఎంసీల చొప్పున తరలించి సోమశిల, కండలేరు ప్రాజెక్టులను నింపాలని సీఎం ఆదేశించారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు అధికారులు వివరించారు. వరద నిర్వహణ పనుల్లో భాగంగా 40 కోట్లతో బుడమేరు- వెలగలేరు యూటీ నిర్మాణాన్ని చేపట్టేందుకు సీఎం అనుమతి మంజూరు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలువల్లో నీటి ప్రవాహాలు సక్రమంగా వెళ్లేందుకు వీలుగా గుర్రపు డెక్క, తూడును తొలగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే.. కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా గట్లను పటిష్టం చేయాలని సీఎం సూచించారు. జిల్లాల్లో వర్షాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు.. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి.. రైతులకు తక్షణ సమాచారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో భూగర్భ జలాలను రీఛార్జి చేసేలా నిర్మాణాలను చేపట్టాలని సీఎం సూచించారు. పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులు.. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ట్రెంచ్‌లని తవ్వేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆగస్ట్ 14, గురువారం ( ప్రతి ఎకరాకు నీరందాలి! )
విద్యుత్ రంగంలో ఏఐని వినియోగించుకోవాలని.. సీఎం చంద్రబాబు ఇంధనశాఖ అధికారులను ఆదేశించారు. దీనివల్ల.. నాణ్యమైన విద్యుత్ సప్లై, ఉత్పత్తి, కొనుగోళ్లకు అవకాశం ఉంటుందన్నారు. విద్యుత్ డిమాండ్ ఎలా ఉంటుందో ముందే గుర్తించేందుకు.. ఏఐ బాగా ఉపయోగపడుతుందని అన్నారు. నాణ్యమైన విద్యుత్‌ని తక్కువ వ్యయంతో సరఫరా చేయాలన్న లక్ష్యంతో.. ఎనర్జీ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ని అమలు చేయాలన్నారు. దీన్ని.. విద్యుత్ కొనుగోళ్లకూ వినియోగించాలన్నారు. దీనివల్ల డిస్కమ్‌లకు బాగా ఆదా అవుతుందని, వినియోగదారులపై చార్జీల భారం తగ్గుతుందని తెలిపారు. రాష్ట్రంలో వేర్వేరు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విద్యుదుత్పత్తి, పంపిణీ ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. భవిష్యత్తులో గ్రీన్‌ఎనర్జీ అత్యంత కీలకంగా మారుతుందన్నారు సీఎం చంద్రబాబు. సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. మిగులు విద్యుత్‌ని నిల్వ చేసేందుకు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ను వాడుకోవాలన్నారు. ఇప్పటికే.. RDPS ద్వారా 705 కోట్ల మిగులు సాధించామని అధికారులు తెలిపారు. డ్రోన్ ఆధారిత డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ మానిటరింగ్, పవన విద్యుత్ ప్రాజెక్టుల అవకాశాలను పరిశీలించాలన్నారు. విద్యుత్‌సంస్థల యాజమాన్య నిర్వహణ కోసం జూనియర్ లైన్‌మెన్, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను అవసరమైన మేరకు భర్తీచేసుకోవాలని ఇంధనశాఖకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇక.. సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటులో నారావారిపల్లెకు స్కోచ్ అవార్డు దక్కింది.
ఆగస్ట్ 14, గురువారం ( ప్రతి ఎకరాకు నీరందాలి! )
నీటి వనరుల నిర్వహణలో సాగునీటి సంఘాల భాగస్వామ్యం ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. ఈ వారం.. సచివాలయం నుంచి సాగునీటి సంఘాలు, కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగునీటి సంఘాలు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుపైనా బాధ్యత తీసుకోవాలన్నారు సీఎం. సమర్థ నీటి నిర్వహణతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ చేసుకున్నట్లు తెలిపారు. వర్షపు నీటిని సమర్థవంతంగా మళ్లించి.. రిజర్వాయర్లు, బ్యారేజీల్లో 82 శాతం మేర నీటిని నింపుకోగలిగామని వివరించారు. హంద్రీ నీవా ద్వారా రాయలసీమలో ప్రాజెక్టులు నింపామన్నారు. గ్రామాల్లోనూ చెరువులను నింపాలన్నారు. సాగునీరు, పంట కాలువలను సంరక్షించుకోవాలని అన్నారు. రైతుల భాగస్వామ్యం కోసమే సాగునీటి సంఘాలను పెట్టామని.. ప్రతి ఎకరాకూ నీరు అందేలా చూడాలని అన్నారు. మొత్తం 38 వేల మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా భారీ ఎత్తున నీటిని నిల్వ చేసుకోవచ్చని, రైతుల కోసం, నీటి నిర్వహణ పరిరక్షణ కోసమే సాగునీటి సంఘాలను ఏర్పాటు చేశామని తెలిపారు. చెరువులు, కాల్వలు, చెక్‌డ్యాముల పరిస్థితిని సాగు నీటి సంఘాలు పరిశీలించాలని, ఆయకట్టు ప్రాంతాలే కాకుండా క్యాచ్‌మెంట్ ఏరియా బాధ్యతలనూ కూడా సాగునీటి సంఘాలకు అప్పగిస్తామన్నారు. రాష్ట్రంలో 1000 టీఎంసీల సర్ఫేస్ వాటర్ ఉండాలని, భూగర్భ జలాలు పెరగాలని, భూమిని జలాశయంగా మార్చుకోవాలని సీఎం తెలిపారు. సాగునీటి సంఘాలు భూగర్భ జలాలు పెంచే బాధ్యతనూ తీసుకోవాలన్నారు.
ఆగస్ట్ 14, గురువారం ( ఆదాయం పెంచాలి )
రాష్ట్రంలో భూముల విలువలు పెంచుకుంటూ పోవడం సరికాదని.. మార్కెట్ విలువలు, ఆస్తుల సమాచారం కోసం డేటా ఎనలిటిక్స్ వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మద్యం ఆదాయం కన్నా.. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ వారం సచివాలయంలో.. ఆర్ధిక, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్, అటవీ, రవాణా శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆదాయార్జనలో మరింత శ్రద్ధ వహించాలని.. కేంద్ర నిధులు, పన్నుల వాటాపై దృష్టి సారించాలని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కిందటి ఏడాది కన్నా 8% అధిక వృద్ధి ఉంటుందని చెబుతున్నారు. సొంత ఆదాయ వనరులు పెంచుకునేందుకు మరింత కృషిచేయాలని ఆదేశించారు. పన్ను ఎగవేతలను గుర్తించేందుకు, ప్రభుత్వ ఆదాయంలో లీకేజీలను అరికట్టేందుకు ఏఐ వినియోగించాలన్నారు. వాహనాల పన్ను చెల్లింపులు సక్రమంగా ఉండేలా ఆర్టీజీఎస్, సీసీ కెమెరాలను వాడాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేలా.. రాయితీలను కొనసాగించాలన్నారు. ఆర్టీజీఎస్ వివరాలతో మున్సిపల్ కార్పొరేషన్లలో ఆటో మ్యుటేషన్ చేయాలన్నారు. ఆధార్, మొబైల్, విద్యుత్తు డేటాని లింక్ చేసి.. పన్నుల వసూళ్ల ప్రక్రియను పటిష్ఠంగా నిర్వహించాలన్నారు. అటవీ శాఖ దగ్గరున్న ఎర్రచందనంతో 1,500 కోట్ల ఆదాయం వచ్చే ఆస్కారం ఉందన్నారు సీఎం. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎర్రచందనం విక్రయాలపై దృష్టి సారించాలన్నారు. వెదురు ఉత్పత్తి ద్వారా ఆదాయం ఆర్జించే మార్గాలు చూడాలని చెప్పారు.
Also Read: హైదరాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షం.. జనం అతలాకుతలం.. బయటకు వెళ్ళోద్దు..
ఆగస్ట్ 15, శుక్రవారం ( మహిళలకు ఉచిత ప్రయాణం )
ఆంధ్రప్రదేశ్‌లోని మహిళామణులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్‌లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం.. స్త్రీ శక్తిని సీఎం చంద్రబాబునాయుడు.. పంద్రాగస్టు రోజున ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి సమీపంలోని బస్టాండ్ దగ్గర్నుంచి దేవుడు మాన్యం, ఉండవల్లి సెంటర్, భరతమాత సర్కిల్, ఎన్‌హెచ్ 16వ సర్వీస్ రోడ్డు, వారధి బ్రిడ్జ్, కనకదుర్గ వారధి, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, వినాయక టెంపుల్ కార్నర్, ఆంధ్ర కేసరి సర్కిల్, కంట్రోల్ రూమ్ సర్కిల్ మీదుగా విజయవాడ సిటీ టెర్మినల్ బస్టాండ్ వరకు.. ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా.. ఏకంగా 2 కోట్ల 62 లక్షల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. మరోవైపు ఉచిత బస్సు ప్రయాణాన్ని ట్రాన్స్‌జెండర్లకు సైతం వర్తింపజేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ పథకం అమలుతో ఏపీ ప్రభుత్వంపై ఏటా 1,942 కోట్ల అదనపు భారం పడనుంది. అయినా పట్టుదలతో దీన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు.
Story By Anup, Bigtv