Pawan Kalyan: ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో మత్స్యకారులతో మాటా మంతి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందిన కాకినాడ జిల్లాకు చెందిన 18 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఒకొక్కరికి రూ. 5 లక్షల చొప్పున రూ.90 లక్షల బీమా అందించారు.
ఉప్పాడ మత్స్యకారులు తెలిపిన పారిశ్రామిక కాలుష్యంపై వారంలోగా నివేదిక ఇవ్వాలని పీసీబీ అధికారులను ఆదేశించారు. 100 రోజుల్లో ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిరక్షించేందుకు, సముద్ర కోత నుండి ప్రజలను కాపాడేందుకు రూ.323 కోట్ల వ్యయంతో, కేంద్ర ప్రభుత్వం సహకారంతో రిటైనింగ్ వాల్ పూర్తి చేసి తీరుతామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణంలో నిర్లక్ష్యం కారణంగా డిజైన్ రూపకల్పనలో నిర్మాణ లోపాలు ఉన్నట్లు గుర్తించామన్నారు.
‘ఈ విషయంపై గత నెలలో సైసెఫ్ (CICEF) సంస్థ శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేశారు. దీని కారణంగా బోట్లు తరచుగా ధ్వంసం అవుతున్న విషయం నా దృష్టిలో ఉంది. త్వరలోనే ఈ లోపాల పరిష్కారం కోసం APSDMA సహకారంతో దాదాపు రూ.98 కోట్ల వ్యయంతో ఈ డిజైన్ సవరణ పనులు ప్రారంభించనున్నాం’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
సముద్ర తీరంలో పారిశ్రామిక కాలుష్యంపై పొల్యూషన్ ఆడిట్ చేపట్టాలని పీసీబీ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సూచించారు. 3- 4 రోజుల్లో స్వయంగా తీర కాలుష్య ప్రాంతాల్లో పర్యటించి కాలుష్య తీవ్రత తెలుసుకుంటానని పవన్ అన్నారు.
అనంతరం ఉప్పాడలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కమిటీ సమావేశంలో మత్స్యకారుల సమస్యలన్నీ తెలుసుకున్నానన్నారు. ముఖ్యంగా నక్కపల్లి సెజ్, తుని నియోజకవర్గంలోని దివిస్ ఫ్యాక్టరీ ఇతర పరిశ్రమల నుండి కాలుష్యాలు సముద్రంలోకి ఎక్కువ శాతంలో విడుదల అవుతున్నాయని తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ కాలుష్యాల కారణంగా మత్స్య సంపద అంతరించిపోతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు.
‘మత్స్యకారులతో, ఆడపడుచులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఎన్నికల్లో మీకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా మర్చిపోలేదు. కూటమి ప్రభుత్వం తరపున మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మరోసారి హామీ ఇస్తున్నాను. వైసీపీ నాయకులు మీకు న్యాయం చేస్తాం అని మిమ్మల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటారు. పారిశ్రామికవేత్తలను బెదిరిస్తే శాశ్వత పరిష్కారం రాదు. మీకు తలో పాతికవేలు పడేసి వైసీపీ వాళ్లకి సెటిల్ చేసినందుకు కొంత ముట్టజెప్పి పోతారు. అలాంటి బ్యాక్ డోర్ పనులు నేను చెయ్యను’ – పవన్ కల్యాణ్
‘నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేనప్పుడు రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతానే తప్పా మిమ్మల్ని వంచించను. మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం కంటే ఈ పదవులు నాకేం ఎక్కువ కాదు’ అని ఉప్పాడ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ అన్నారు.
Also Read: Pawan Kalyan: బ్యాక్ డోర్ పనులు చెయ్యను.. అలా అయితే రాజకీయాలు వదిలేస్తా.. పవన్ సంచలన వ్యాఖ్యలు
‘మత్స్యకార సోదరులు ఈ దివిస్, అరబిందో, ఇతర పరిశ్రమల నుండి విడుదలయ్యే వ్యర్థాల వల్ల మత్స్య సంపద కనుమరుగు అవుతుందనే సమస్య తన దృష్టికి తెచ్చినప్పుడు ఒక డిప్యూటీ సీఎం గానో, ఎమ్మెల్యే గానో ఆలోచించలేదు. నేను ఒక మత్స్యకారుడిని అయితే నా జీవనోపాధి మత్స్య వేటే అయితే నేను ఎలాంటి పరిష్కారం కోరుకుంటానో అలానే ఆలోచించాను’ అని పవన్ కల్యాణ్ అన్నారు.