Weather Update: గత పదిరోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో భిన్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు, హైదరాబాద్ మహా నగరంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతున్నాయి. సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.తలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. హైదరాబాద్ లో పది నిమిషాల వర్షానికే రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలను హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
రాత్రికి ఈ జిల్లాల్లో వర్షాలు దంచుడే దంచుడు..
ఇవాళ్లి నుంచి రాష్ట్రంలో మరో మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇవాళ రాత్రికి నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, యాదాద్రి – భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాద్ లో పొడివాతారణమే ఉంటుందని చెప్పారు.. ఉరుములు, మెరుపులతో పాటు గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. అలాగే పలు ప్రాంతాల్లో పిడుగుల పడే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ లో సాయంత్రం వేళ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ఎవరు బయటకు వెళ్లొద్దని.. ఆఫీసులకు వెళ్లిన వారు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
కాసేపట్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..
మరో గంట సేపట్లో రంగారెడ్డి, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో పొడి వాతావరణం ఉంటుందని వివరించారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉండడంతో బయటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
అధికారుల హెచ్చరిక..
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణా రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. పిడుగులు పడే ఛాన్స్ ఉండడంతో చెట్ల కింద నిలబడొద్దని చెబుతున్నారు. భారీ వర్షం పడుతున్న సమయంలో ఇంట్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు తెలిపారు.