రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ తీరే వేరు. ఇక్కడి ఓటర్లు ప్రతి ఎన్నికల్లోనూ విలక్షణ తీర్పునిస్తారు. దాదాపు నేతల పరిస్థితి కూడా అలానే ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న అధికార పక్ష నేతలను స్థానిక నేతలు పరస్పరం విమర్శించడం మామూలే. అయితే స్థానికంగా ఉన్న ఇక్కడ నేతలు మాత్రం పరస్పరం విమర్శించుకున్న దాఖలాలు చాలా తక్కువే. అయితే ఈసారి సీన్ అంతా రివర్స్ అయింది. అధికార ప్రతిపక్షాలు పట్టు కోసం చేసే ప్రయత్నాల్లో భాగంగా విమర్శలు ఘాటెక్కాయి. పరస్పరం ఒకరినొకరు పదునైన వ్యాఖ్యలతో విమర్శించుకునే పరిస్థితి వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య నెలకొంది. దీంతో గూడూరు నియోజకవర్గంలో రాజకీయం బాగా హీట్ ఎక్కింది. ఎన్నడూ లేని పరిస్థితిని చూసి ఓటర్లు సీమ రాజకీయాలు ఇక్కడకు వచ్చేసాయని ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి నెలకొంది.
Also Read: పిఠాపురంలో విజయంపై పవన్ ధీమా.. కాకినాడ ఎంపీ అభ్యర్థి ప్రకటన..
మునుపెన్నడూ లేనివిధంగా విమర్శ, ప్రతి విమర్శలతో గుడూరు పాలిటిక్స్ మరింత హీటెక్కిపోయాయి. వైసీపీ అభ్యర్థి మేరుగ మురళీధర్, కూటమి అభ్యర్థి సునీల్ కుమార్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీంతో సీమ రాజకీయాలు ఇక్కడ కూడా స్టార్ట్ అయ్యాయని చెవులు కొరుక్కుంటున్నారు. బస్తీమే సవాల్ ఎవరి బలం ఎంతో నిరూపించుకునేందుకు బహిరంగ చర్చకు సిద్ధమంటూ విమర్శలు చేసుకుంటున్నారు ఇరు పార్టీల అభ్యర్థులు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఓ పక్క ప్రచారం నిర్వహిస్తూనే.. విమర్శలు ప్రతివిమర్శలతో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు.
ఎన్నికల టైంలో మెయిన్ గా నిత్యం ప్రజల్లో ఉండాలి. అదే సమయంలో పార్టీలు మారే నాయకులను, కార్యకర్తలను కట్టడి చేసుకోవడం.. ప్రత్యర్ధి వ్యూహాలను పసిగట్టి ముందుకు సాగాలి. అలాంటి అన్ని పనులను ఇరువురు అభ్యర్థులు పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. ఉన్న కేడర్ ను చేజారిపోకుండా గతంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ముందుకు సాగుతున్నారు. రాజకీయ నేపథ్యం, వైసీపీ చేసిన డెవలప్ మెంట్ ను వివరిస్తూ ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ప్రచారం జోరు పెంచగా.. అదే స్థాయిలో మురళీధర్ కుడా ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నారు. 30 వేల మెజారిటీ పక్కా అని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే గుడూరులో గెలుపు అంత ఈజీగా రాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.