ఏపీలో ఎన్నికలైపోయి కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడాది అవుతోంది. ఈ టైమ్ లో ప్రతిపక్షం ఏం చేయాలి..? జనంలోకి ఎలా వెళ్లాలి, ప్రభుత్వాన్ని ఎలా విమర్శించాలి అనే విషయాలపై దృష్టిపెట్టాలి. కానీ వైసీపీ ఏం చేస్తోంది..? అందరూ అని చెప్పలేం కానీ వైసీపీలో కొందరు నేతలు ఇంకా ఈవీఎంలపైనే నెపం నెడుతూ కాలక్షేపం చేస్తున్నారు. తప్పులు చేసి ఓడిపోయాం, పాఠాలు నేర్చుకుని ప్రజల మద్దతు కూడగడతాం అని అనాల్సిన టైమ్ లో ఈవీఎంల వల్లే కూటమి గెలుపు సాధ్యమైందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇలా మాట్లాడేవాళ్లు ఓటమిని ఇంకా ఒప్పుకోలేదనమాట. ఈ లిస్ట్ లో మొదటి వరుసలో ఉన్నారు రోజా. 2024 లో ప్రజల ఓట్లతో కాకుండా EVM లతోనే కూటమి విజయం సాధించిందని అంటున్నారామె.
Roja 90MM Mass Batting ✅️🔥 pic.twitter.com/IuCTPmalHm
— Suryakantham🕊️ (@katthiteesukor1) June 25, 2025
ఓటమికి కారణం ఏంటి..?
అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి కొందరు నేతలు 11 సీట్ల వ్యవహారంపై తమ తప్పుని ఒప్పుకున్నారు. ప్రజలు తమకంటే ఎక్కువ మేలు చేస్తారనే కూటమివైపు చూశారని, తాము చేసిన మంచి ఎటుపోయిందో అర్థం కావడం లేదన్నారు. ఏది ఏమైనా తిరిగి ప్రజలు తమవైపే వస్తారన్నారు. కానీ రోజా మాత్రం ఇంకా ఎన్నికల ఫలితాల దగ్గరే ఆగిపోయారు. ఈవీఎంల వల్లే కూటమి గెలిచిందని, లేకపోతే జగన్ కి బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చేదని అంటున్నారామె. కూటమి ప్రభుత్వాన్ని ఈవీఎం ప్రభుత్వం అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. రోజాతోపాటు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కూడా ఇటీవల ఈవీఎంలపై నిందలు వేస్తూ మాట్లాడారు. హిందూపురంలో బాలకృష్ణ గెలుపుపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు.
వైసీపీ పోటీ చేస్తుందా లేదా..?
2019 ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా జరిగిన ఓటింగ్ తోనే వైసీపీ విజయం సాధించింది, 151 సీట్ల భారీ మెజార్టీ తెచ్చుకుంది. 2024లో తిరిగి ఈవీఎంల ద్వారానే జరిగిన ఓటింగ్ లో వైసీపీకి 11 సీట్లు వచ్చాయి. అంటే ఇక్కడ తప్పు ఎవరిలో ఉంది. పార్టీలోనే, ప్రజల్లోనా, ఈవీఎంల లోనా..? ఆ విషయం సరిగా అర్ధం చేసుకోగలిగితేనే వైసీపీకి భవిష్యత్తు ఉంటుంది. ఈవీఎంలపైనే నిందలేస్తూ కూర్చుంటే భవిష్యత్ అగమ్య గోచరంగా ఉంటుంది. 2029లో కూడా ఈవీఎంల ద్వారానే ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు కూడా కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమే అధికారంలో ఉంటుంది. రోజా అంచనా ప్రకారం ఈవీఎంలలో అవకతవకలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి 2029లో ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగితే వైసీపీ పోటీ చేస్తుందో లేదో తేలాల్సి ఉంది. మిగతావారి సంగతి పక్కనపెడదాం. ఈవీఎంల ద్వారా అక్రమాలు జరిగాయని బలంగా నమ్ముతున్న రోజా పోటీ చేస్తారో లేదో వేచి చూడాలి. గెలిస్తే అది తమ బలం, ఓడితే అది ఈవీఎంలు చేసిన మోసం అంటూ వైసీపీ మాట్లాడటం వింతగా ఉంది. ఓటమికి కారణాలు వెదికే క్రమంలో వైసీపీ చేస్తున్న వితండవాదం ప్రజలకు కూడా చిరాకుగానే ఉంది. ప్రజల్లో ఆ పార్టీ మరింత పలుచన కావడానికి కూడా ఇది కారణం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఈవీఎంలపై నిందలు వేయడం మానేసి, వచ్చే ఎన్నికల నాటికి పార్టీని ఎలా బలోపేతం చేయాలనే విషయంపై దృష్టిపెడితే రోజాతోపాటు వైసీపీ నేతలకు కూడా ఉపయోగం ఉండే అవకాశముందని హితవు పలుకుతున్నారు నెటిజన్లు.