Ntr Vidya Lakshmi Scheme 2025: ఏపీలో మహిళలకు కోసం రకరకాల పథకాలను కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. తాజాగా రెండు పథకాలకు రూపకల్పన చేసింది. ఒకటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి కాగా, మరొకటి ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పథకాలు అయితే దీపావళికి లేకుంటే తర్వాత ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. ఇంతకీ ఎన్టీఆర్ విద్యాలక్ష్మికి అర్హతలేంటి? ఎన్టీఆర్ కల్యాణలక్ష్మికి కావాల్సిన రూల్స్ ఏంటి? అనేదానిపై ఓ లుక్కేద్దాం.
ఏపీలో రెండు కొత్త పథకాలను ప్రారంభించేందుకు రెడీ అవుతోంద చంద్రబాబు సర్కార్. వాటిలో ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, మరొకటి ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి వంటి పథకాలు ఉన్నాయి. వీటికి సీఎం చంద్రబాబు ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. పోయినవారం ప్రారంభం కావాల్సి ఉండగా, ఆటోడ్రైవర్ పథకం ఉండడంతో అనుకోకుండా వాయిదా పడిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
వీలైతే దీపావళికి శుభవార్త రావడం ఖాయమని అంటున్నారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళల పిల్లల చదువులకు, ఆడ పిల్లల పెళ్లిళ్లకు ఆ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందనుంది. సెర్ప్ పరిధిలోని స్త్రీ నిధి బ్యాంకు ద్వారా సభ్యలకు రుణాలు అందజేయనున్నారు. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద డ్వాక్రా మహిళల పిల్లల చదువు కోసం సహాయం చేయనుంది.
డ్వాక్రా సంఘంలో సభ్యురాలై ఉండాలి. అంతేకాదు మహిళ ఆ సంఘంలో జాయిన్ అయి కనీసం ఆరునెలలు అయి ఉండాలి. ఇప్పటికే బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించినవారు అర్హులు. దీనికి బయో మెట్రిక్ ఆధారంగా రుణాలు అందజేస్తారు. ఇది కేవలం ఇద్దరు పిల్లల చదువు కోసం మాత్రమే. 10 వేల నుంచి లక్ష వరకు ప్రభుత్వం నుంచి రుణ సహాయం లభిస్తుంది.
ALSO READ: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రులు, ఎందుకంటే..
దరఖాస్తు చేసిన 48 గంటల్లో డబ్బులు సభ్యురాలి ఖాతాలో జమ అవుతాయి. పాఠశాలలు, కళాశాలల్లో పిల్లల ఫీజులకు తగ్గట్టుగా రుణాన్ని పొందవచ్చు. 4 శాతం వడ్డీ అంటే పావలా వడ్డీ మాత్రమే. తీసుకున్న మొత్తాన్ని బట్టి వాయిదాల సంఖ్య మారే అవకాశం ఉంది. ఈ పథకం కింద తీసుకున్న రుణాలు నాలుగేళ్లలో తిరిగి చెల్లించాలి.
అయితే ఈ పథకం కింద దరఖాస్తు చేసేటప్పుడు అడ్మిషన్ లెటర్, ఫీజు చెల్లింపు విధానం, ఇన్‌స్టిట్యూట్ వివరాలు వాటికి సంబంధించిన రసీదులు కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది.
మరొకటి ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పథకం. డ్వాక్రా మహిళల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం. ఈ పథకం కింద 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు. పావలా వడ్డీ కింద రుణాలు ఇస్తారు. దీన్ని టర్న్ అంటే నాలుగేళ్లలో వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాలి.
లగ్న పత్రిక లేదా పెళ్లి శుభలేఖ, ఈవెంట్ నిర్వహణ తీసుకున్న పత్రం, పెళ్లి ఖర్చుల అంచనా పత్రాలను వంటివి సమర్పించాలి. ఆయా వివరాలను పరిశీలించిన తర్వాత సభ్యురాలి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. ఈ రెండు పథకాల కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.2000 కోట్లు ఖర్చు చేయనుంది. రెండు పథకాల వచ్చే పావలా వడ్డీ ఆదాయాన్ని రెండు భాగాలుగా చేస్తారు.
50 శాతం డబ్బును డ్వాక్రా సంఘాలకు గ్రామ స్థాయి నుంచి మండలాల వరకు బలోపేతం చేయడానికి వినియోగిస్తారు. మిగిలిన 50 శాతం స్త్రీనిధి ఉద్యోగుల ప్రయోజనాలకు వినియోగిస్తారు. ఈ పథకాల కింద రుణం తీసుకున్న సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆమె రుణం మాఫీ అవుతుంది. ఆ కుటుంబంపై భారం పడకుండా పూర్తిగా రద్దు చేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే సభ్యులకు ఇది కొండంత అండ.