AP News: ఏపీలో ఉద్యోగుల సంక్షేమం కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదా? వార్డు-గ్రామ సచివాలయ ఉద్యోగులు పోరుబాటకు రెడీ అవుతున్నారా? దీని వెనుక అసలేం జరిగింది? వారి సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడమే కారణమా? అక్టోబర్ ఒకటిన పింఛన్లు పంపిణీకి దూరంగా ఉండాలని ఉద్యోగులు డిసైడ్ అయ్యారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఏపీలో ఏడాదిగా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయంటే అందుకు కారణం వార్డు-గ్రామ సచివాలయ ఉద్యోగులు. ఇప్పుడు ఆ ఉద్యోగులు పోరుబాటకు సిద్ధమయ్యారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు జేఏసీగా ఏర్పడ్డారు. అంచెలంచెలుగా కార్యాచరణను మొదలుపెడుతున్నారు.
తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆ ఉద్యోగులు పోరుబాటకు సిద్ధమయ్యారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోనున్నారు. తాజాగా అందుకున్న సమచారం మేరకు చాలా జిల్లాల్లో ఉద్యోగులు వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయినట్టు తెలుస్తోంది. ఒకవిధంగా చెప్పాలంటే ఇదొక సహాయ నిరాకరణగా చెబుతున్నారు.
ప్రస్తుతం గ్రామ-వార్డు సచివాలయం కేంద్రంగా సుమారు 13 శాఖలకు సంబంధించిన పని చేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి ఇప్పటివరకు పైస్థాయి అధికారులు మెల్ల మెల్లగా ఆ ఉద్యోగులపై పని భారం పెంచే ప్రయత్నం చేశారు.. చేస్తున్నారు కూడా. కేవలం మాతృ శాఖ పనులు కాకుండా డోర్ టూ డోర్ సర్వేలు చేయిస్తున్నారు.
ALSO READ: అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు, గెలిచి ప్రయోజనమేంటి?
సర్వేల పేరుతో ప్రతీ ఇంటికి వారానికి రెండుమూడు సార్లు వెళ్తున్నట్లు చెబుతున్నారు. దీనివల్ల చాలామంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. పింఛన్ల పంపిణీ వ్యవహారం కత్తి మీద సాముగా మారింది. ఉదయం ఏడు గంటలకు పింఛన్ల పంపిణీ అయితే తెల్లవారుజాము నుంచే పైస్థాయి అధికారులు ఫోన్లు చేసి ఫీల్డ్‌లో ఉన్నారా? లేరా అంటూ వేధించడం మొదలుపెడుతున్నారని చెబుతున్నారు.
నెట్ సదుపాయాలు లేని ప్రాంతాల్లో తమకు తెలీదు.. ఏదో ఒకటి చేయాలంటూ ఉద్యోగులపై పైస్థాయి అధికారులు ఒత్తిడి చేస్తున్నారట. పింఛన్ల పంపిణీ పూర్తి కాగానే, ఆఫీసుకొచ్చి పెండింగ్‌లో ఉన్న పనులు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.
పంచాయతీ సెక్రటరీల నుంచి ఎంపిడిఓలు, ఆ తర్వాత అన్ని శాఖల అధికారుల అజమాయిషీ కొనసాగడంపై తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఇతర శాఖల అదనపు పనులు తప్పించాలని చాన్నాళ్లుగా వేడుకుంటున్నారు. అలాగే తమకు ఇచ్చే వేతనాలు మాతృ సంస్థ చెల్లించేలా పలు డిమాండ్లతో రాష్ట్ర స్థాయిలో కార్యాచరణ రెడీ చేశారు.
ఈ నేపథ్యంలో దశలవారీగా ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారట. ఈనెల 29 అంటే సోమవారం లోపు చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. లేకుంటే అక్టోబర్ ఒకటిన సామాజిక పింఛన్లను పంపిణీ చేయబోమని ఇప్పటికే ఆ ఉద్యోగుల జేఏసీ నోటీసు ఇచ్చింది.
అంతేకాదు కొన్ని జిల్లాల్లో సిబ్బంది ఇప్పటికే తమ నిరసన వ్యక్తం చేస్తూ అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. ఈ లెక్కన అక్టోబరు ఒకటిన పింఛన్ల మాటేంటన్నది అసలు ప్రశ్న. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకోకుండే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని అంటున్నారు.