ఇటీవల కాలంలో వైసీపీ నుంచి ప్రముఖంగా వార్తల్లో నిలిచిన నాయకురాలు రోజా. తనపై నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమె పోలీస్ కేసు పెట్టారు, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ ని ఆశ్రయించారు. మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. అయితే తాజాగా ఆమె గురించి మరో సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. అరెస్ట్ ఖాయమని తేలడంతోనే రోజా ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని అంటున్నారు. అంతే కాదు, ఆగస్ట్-10 రోజా అరెస్ట్ కి డెడ్ లైన్ గా పెట్టారు. ఆ లోగా రోజా జైలుకెళ్లడం ఖాయమని అంటున్నారు.
ఆడుదాం ఆంధ్ర..
వైసీపీ హయాంలో పర్యాట, క్రీడల శాఖ మంత్రిగా పనిచేశారు రోజా. ఆ శాఖలకు సంబంధించి రెండు ప్రధాన ఆరోపణలున్నాయి. రుషికొండకు గుండుకొట్టి నిర్మించిన పర్యాటక భవనం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అయితే ఈ భవనాన్ని ప్రభుత్వం సద్వినియోగం చేస్తుందని అంటున్నారు. మరోవైపు క్రీడా శాఖలో కూడా అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమంలో కోట్ల రూపాయలు వెనకేసుకున్నారంటూ విమర్శలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక విచారణ మొదలైంది. ఈ కేసులో రోజా అరెస్ట్ ఖాయం అంటున్నారు శాప్ చైర్మన్ రవినాయుడు.
ఆగస్ట్ 10లోగా రోజా అరెస్ట్ కావడం ఖాయమంటున్నారు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ఛైర్మన్ రవినాయుడు. క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఆమె చేసిన అవినీతి బయటపడుతోందని, విచారణ జరుగుతోందని, ఆమె తప్పులన్నిటికీ సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారని అన్నారు. రోజా అరెస్ట్ కు వారెంట్ సిద్థమవుతోందని చెప్పారాయన. రోజులు లెక్కబెట్టుకో రోజా అంటూ హెచ్చరించారు. క్రీడా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రోజా ఒక్క స్టేడియం అయినా నిర్మించారా..? అని ప్రశ్నించారు. ఆమె నిత్యం తమిళనాడులో ఉంటున్నారని, నగరికి టూరిస్ట్ గా మాత్రమే వచ్చిపోతున్నారని అన్నారు.
నెక్స్ట్ ఎవరు..?
కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు ఒక్కొక్కరే అరెస్ట్ అవుతున్నారు. కొంతమంది ఆల్రడీ జైలుకి వెళ్లొచ్చారు కూడా, మరికొంతమంది వివిధ కేసుల్లో జైలుకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఆ లిస్ట్ లో రోజా కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. శాప్ చైర్మన్ వ్యాఖ్యల్ని తేలిగ్గా కొట్టిపారేయలేం. ఆగస్ట్-10 డెడ్ లైన్ అని కూడా అంటున్నారు కాబట్టి.. ఆ లోగా ఏం జరుగుతుందో చూడాలి. ఇటీవల మిథున్ రెడ్డి అరెస్ట్ తో వైసీపీ మరింత డిఫెన్స్ లో పడింది. మరోవైపు పేర్ని నాని కూడా అరెస్ట్ తప్పదని గ్రహించి అజ్ఞాతంలో ఉన్నారు. తాజాగా రోజా పేరు తెరపైకి వచ్చింది. అటు లిక్కర్ స్కామ్ లో ఏకంగా జగన్ పేరు వినపడుతోంది. దీంతో వైసీపీలో టెన్షన్ మొదలైందనే చెప్పాలి. అయితే ఈ అరెస్ట్ లతో తమని ఏమీ చేయలేరని వైసీపీ నేతలు సవాళ్లు విసరడం ఇక్కడ విశేషం. ఇప్పుడు అక్రమ కేసుల్లో తమని అరెస్ట్ చేస్తే, రేపు తాము అధికారంలోకి వచ్చాక ఇంతకు పదిరెట్లు బదులు చెల్లిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.