సూపర్ సిక్స్ హామీలన్నీ ఒక్కొక్కటే అమలు చేసుకుంటూ వస్తున్నారు సీఎం చంద్రబాబు. ఒక్కొక్కటే ఎందుకు? అన్నీ ఒకేసారి చేస్తే పోలా? అనే ప్రశ్నలు కూడా వినపడుతున్నాయి. అయితే ఒక్కొక్కటే అమలు చేస్తూ ప్రతిపక్షానికి గుక్క తిప్పుకునే అవకాశం కూడా ఇవ్వడంలేదాయన. ఆ మధ్య తల్లికి వందనంపై ఎన్నో విమర్శలు వచ్చాయి, ఆ విమర్శలన్నిటికీ సమాధానం ఇటీవల గట్టిగా ఇచ్చారు బాబు. ఇద్దరు ముగ్గురు పిల్లలున్న తల్లులకు ఏ స్థాయిలో మేలు జరిగిందో అందరికీ తెలుసు. దీంతో వైసీపీ సైలెంట్ కావాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం మొదలు కాబోతోంది. గత కొన్నిరోజులుగా ఓ పద్ధతి ప్రకారం ఈ హామీ అమలు గురించి కీలక విషయాలు చెబుతోంది ప్రభుత్వం. ఆగస్ట్ -15 తర్వాత ఈ పథకం గురించి ప్రజల్లో విపరీతమైన చర్చ జరిగే అవకాశముంది. సూపర్ సిక్స్ ని ఒకేసారి కాకుండా ఓ వ్యూహం ప్రకారం అమలు చేస్తూ సీఎం చంద్రబాబు సూపర్ సక్సెస్ సాధించారని అంటున్నారు నెటిజన్లు.
ప్రజలే ప్రచారాస్త్రాలు..
వైసీపీ హయాంలో నవరత్నాల అమలు గురించి ప్రచారం జోరుగా సాగేది. ఏ పథకం మొదలు పెట్టినా బటన్ నొక్కేందుకు జగన్ రెడీ అయిపోయేవారు. విడతలవారీగా పథకాలు అమలైనా అన్నిసార్లూ జగన్ బహిరంగ సభలకు హాజరయ్యేవారు. ఆయా సభల్లో ఆ కార్యక్రమాలను అట్టహాసంగా ప్రారంభించేవారు. అయితే కూటమి వచ్చాక ఇలాంటి బటన్ నొక్కే సంప్రదాయాలకు చంద్రబాబు చెక్ పెట్టారు. తల్లికి వందనం విషయంలో కూడా అదే జరిగింది. ఓవైపు వైసీపీ విమర్శలు చేస్తూనే ఉంది, మరోవైపు లబ్ధిదారులు ఒక్కొక్కరే తమకు జరిగిన మేలుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఒకరకంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ప్రజలే ప్రచారాస్త్రాలు అయ్యారు. తాజాగా మహిళలకోసం అమలు చేస్తున్న ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకానికి కూడా మహిళలే ప్రచార సారథులు అవుతారనే అంచనాలున్నాయి.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు ఆర్థిక సాయం, మహిళలకు ఆర్థిక చేయూత కార్యక్రమాలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. వీటిలో ఉచిత రవాణా ఆగస్ట్-15నుంచి అమలు కాబోతోంది. అన్నదాత సుఖీభవ కూడా త్వరలోనే అమలు చేస్తామంటున్నారు. ఇక నిరుద్యోగ భృతికి జాబ్ నోటిఫికేషన్లతో ప్రత్యామ్నాయం ఉంది. మహిళలకు ఆర్థిక సాయం విషయంలో ప్రభుత్వం కాస్త ఆలోచిస్తోంది. వయోపరిమితి నిర్ణయించడంతోపాటు ఇతర నియమ నిబంధనలు రూపొందించాల్సి ఉంది. అయితే ఈ పథకాలు ఆలస్యమైనా ప్రజల నుంచి ప్రతిఘటన లేకపోవడం ఇక్కడ విశేషం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంపుని అమలు చేస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడే ఆయన ప్రభుత్వంపై ఒక గుడ్ ఇంప్రెషన్ ఏర్పడిందని చెప్పాలి. ఆ తర్వాత పథకాలను వరుసగా పట్టాలెక్కిస్తూ, మరోవైపు అంతంతమాత్రంగానే ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరిస్తూ పాలన సాగిస్తున్నారు ముఖ్యమంత్రి. సూపర్ సిక్స్ ని ఓ వ్యూహం ప్రకారం అమలు చేస్తున్నారు. ఈ వ్యూహం వైసీపీ అంచనాలకు అందకుండా ఉండటం ఇక్కడ విశేషం.