ఏపీ రాజకీయాలు చాలా విడ్డూరంగా మారాయి. మొన్నటివరకు ప్రభుత్వాన్ని తిట్టిన ప్రతిపక్ష నేతలంతా ఇప్పుడు పరోక్షంగా ప్రభుత్వాన్ని పొగుడుతున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయం బయటకు రాకపోయినా అవును నిజమే.. అని సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం. ఈ విషయం అధిష్టానానికి తెలిస్తే ఎక్కడ తమకు చెడ్డ పేరు వస్తుందేమోనని పరోక్షంగా గత ప్రభుత్వ పథకాలు, విధానాలను కూటమి సర్కార్ కాపీ కొడుతున్నారని కవర్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే గత వైసీపీ హయాంలో వాలంటీర్ వ్యవస్థను, గ్రామ పంచాయతీలకు సర్వాధికారాలు ఇచ్చారు.
ప్రస్తుత ప్రభుత్వంలో చంద్రబాబు వాటినే అనుసరిస్తున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నారు. తమ హయాంలో పల్లెలను గొప్పగా తీర్చిదిద్దామని, అట్టడుగు స్థాయి వారికి కూడా సంక్షేమ ఫలాలు అందేలా చేశామని అంటున్నారు. ఇదంతా తమ నాయకుడు, అప్పటి సీఎం జగన్ విజన్ వల్లే సాధ్యమయిందని పేర్కొంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. దీనివలన సర్పంచులు, అధికారుల పవర్‌ను జగన్ తగ్గించారని విమర్శించారు. ఎన్నికల సమయంలోనూ కొందరు వాలంటీర్లు వైసీపీ తరఫున ప్రచారం చేయడం అప్పట్లో పెద్దఎత్తున చర్చ జరిగింది. వారిపై ఈసీ వేటు కూడా వేసింది.కొందరు స్వచ్ఛందంగా వైసీపీ తరపున ప్రచారం చేసేందుకు వాలంటీర్ ఉద్యోగాన్ని వదులుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది.
వైసీపీ హయాంలో జగన్ విశాఖ తీరంలోని రుషి కొండను తొలచి అక్కడ విలాసవంతమైన భవనాలను నిర్మించారు.తన భార్య వైఎస్ భారతి కోరిక మేరకు జగన్ కట్టించారని అప్పట్లో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. తీరా జగన్ అధికారం నుంచి దిగిపోయాక ఆ భవనాలు వైట్ ఎలిఫెంట్ లా మారాయి.వాటిని ప్రస్తుత కూటమి సర్కార్ వినియోగంలోకి తెచ్చి రెవెన్యూ పొందాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే టాటా వంటి పెద్దపెద్ద మల్టీనేషనల్ హోటల్స్‌తో చర్చలు జరుపుతున్నది. వాటిని అద్దెకు ఇస్తే ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుందని సర్కారు భావిస్తున్నది. ప్రస్తుతం అవి ఖాళీగా ఉండటంతో వాటి మెయింటెన్స్ కోసం నెలకు రూ.25 లక్షలు అవుతుందని ఇటీవల మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ శ్రేణులు తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. తాము ఆ భవనాలను నిర్మిస్తే అప్పటి ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేసిందని, ఇప్పుడు వాటిని తమ నాయకుడు ఎందుకు నిర్మించాడో ఇప్పుడు అర్థం అయ్యిందా? పెద్ద పెద్ద కంపెనీలు రావడం వెనుక తమ అధినేత విజన్ ఉందని గొప్పగా చెప్పుకుంటున్నాయి. గ్రామస్థాయి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాల వెనుక మాజీ సీఎం జగన్ విజన్ ఉన్నదని, చంద్రబాబు ఈ విషయంలో జగన్‌నే ఫాలో అవుతున్నారని ప్రచారం చేసుకుంటునట్టు సమాచారం. మరికొందరు వైసీపీ నేతలు మాత్రం పరోక్షంగా చంద్రబాబు విజన్‌ను గుట్టుగా ప్రశంసిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. వైసీపీ శ్రేణుల ప్రచారంపై కూటమి నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. జగన్ విజన్‌ను చంద్రబాబు ఎన్నడూ ఫాలో అవ్వరని.. ఆయనే బాబును ఫాలో అవుతారని రివర్స్ అటాక్ చేస్తున్నారు. జగన్‌కు అంత విజన్ ఉంటే ఐదేండ్లలో ఎందుకు అభివృద్ధి చేయకుండా అప్పుల పాలు చేసి.. రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు విజన్, ఆయనకు ఉన్న నిబద్ధత వల్లే రాష్ట్రం మళ్లీ అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలుగుతమ్ముళ్లు పేర్కొంటున్నారు.