కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిందో లేదో అప్పుడే పాలనలో ప్రభుత్వం విఫలమైందంటూ అంటూ వైసీపీ రచ్చ చేస్తోంది. ఇటీవల వెన్నుపోటు దినోత్సవం అంటూ హడావిడి చేసినా జనం నుంచి స్పందన లేదు. తాజాగా రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో అంటూ మరో కొత్త కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారు. ఎలాగూ ఇలాంటి కార్యక్రమాల్లో ఆయన నేరుగా పాల్గొనరు. ఏడాదిలోగా ఏం వ్యతిరేకత వచ్చిందని రోడ్డెక్కాలో అర్థంకాక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. కూటమి మేనిఫెస్టో అమలుకాలేదంటూ వైసీపీ నేతలు జనాల్లోకి వెళ్తే.. అమలు చేసిన హామీలను జనం కచ్చితంగా గుర్తు చేస్తారు. గతంలో జగన్ హామీలగురించి కూడా ప్రశ్నిస్తారు. సంపూర్ణ మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు, తదితర హామీలు ఏమయ్యాయని నిలదీస్తారు. కచ్చితంగా ఇది వైసీపీ నేతలకు అగ్ని పరీక్షేనని అంటున్నారు. జగన్ పిలుపునిచ్చారు కానీ, పార్టీలోనే ఈ కార్యక్రమం పట్ల పెద్ద ఆసక్తి ఉన్నట్టు కనిపించడంలేదు.
ఐదు వారాలు
తాడేపల్లిలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ ఈ కొత్త నిరసన కార్యక్రమం గురించి వివరించారు. ఏడాదిలోనే ఒక ప్రభుత్వంపై ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తుందని ఎవరూ ఊహించలేదని, గతంలో కూడా ఇలా జరగలేదని చెప్పారు జగన్. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ విపరీతమైన హామీలిచ్చారని, తాను అప్పటికే అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తీ మరింత మంచి చేస్తామని చెప్పారని, కానీ ప్రభుత్వంలోకి వచ్చాక ఆ హామీలను బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు జగన్. ఆ హామీలను గుర్తు చేస్తూ నిరసన కార్యక్రమం ఉంటుందన్నారు. ఐదువారాలపాటు ఈ కార్యక్రమం చేపట్టాలని, ప్రజల్లోకి వెళ్లాలన్నారు జగన్.
రీకాలింగ్..
చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ చేపట్టే ఈ కార్యక్రమానికి ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో’.. అనే పేరు పెట్టామన్నారు జగన్. ‘చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’ అంటూ తెలుగులో దీనికి నామకరణం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు అమలు చేసి ఉంటే ప్రజలకు ఏమేరకు లబ్ధి చేకూరి ఉండేదో ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. గత సంవత్సరం ప్రభుత్వం తమకు ఎంత బాకీ ఉంది..? ఆ డబ్బులు ఎప్పుడిస్తారు..? ఈ ఏడాది ఎంత బాకీ పడింది.. అనే విషయాలను గుర్తు చేయాలని చెప్పారు.
జగన్ వస్తారా, లేదా..?
జగన్ పిలుపు బాగానే ఉంటుంది కానీ, జనంలోకి వెళ్లేందుకు వైసీపీ నేతలు జంకుతున్నట్టు తెలుస్తోంది. యువతపోరులో అసలు యువతే లేదంటూ ఇటీవల ఆ పార్టీ నిరసన కార్యక్రమాలపై సెటైర్లు పేలాయి. వృద్ధనేతలంతా కలసి యువత పోరు, ఫీజు పోరు అంటూ రోడ్లెక్కడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు టీడీపీ నేతలు. ఈ క్రమంలో ఇప్పుడు మేనిఫెస్టో అంటూ జనంలోకి వెళ్తే.. వైసీపీ మేనిఫెస్టో గురించి ప్రజలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలనేది ఆ పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. ఎలాగూ జగన్ ఈ కార్యక్రమాలప్పుడు జనంలోకి రారు కాబట్టి ఆయనకు వచ్చిన ఇబ్బందేం లేదు. ఇక వైసీపీ నేతలు కూడా తమ అనుకూల మీడియాని వెంటబెట్టుకుని ఏదో మమ అనిపించాల్సిందే.