VC Sajjanar: టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆర్టీసీ ఎండీ, వైస్ ఛైర్మన్ గా ఇవాళ ఆయన చివరి రోజు విధులు నిర్వర్తించారు. ఆర్టీసీతో తన ప్రయాణంపై ఎక్స్ వేదికగా సజ్జనార్ ఎమోషనల్ పోస్టు పెట్టారు.
“టీజీఎస్ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. 2021 సెప్టెంబర్ 03న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆర్టీసీకి వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించాను. మీ అందరి సహాయ సహకారాలతో నాలుగేళ్లకు పైగా ఈ పోస్టింగ్‌లో కొనసాగాను. నేను బాధ్యతలు స్వీకరించే నాటికి సంస్థ చాలా కష్టకాలంలో ఉంది. ఆ సమయంలో ఆర్థిక లోటుతో సంస్థ మనుగడ ఉంటుందా? లేదా? అనే భయం అందరిలోనూ ఉంది” -వీసీ సజ్జనార్
‘క్లిష్ట పరిస్థితుల నుంచి ఆర్టీసీని బయటపడేసేందుకు ఉన్నతాధికారులు, ఆర్థిక నిపుణులతో చర్చించాం. అనేక మేధోమథన సదస్సులు నిర్వహించి ప్రతి ఉద్యోగిని సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యం చేశాం. వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకు వెళ్లాం. కృషితో నాస్తి దుర్బిక్షం అన్న నానుడిని అందరం కలిసి నిరూపించాం. ఈ నాలుగేళ్లు అనేక ఒడిదొడుకులతో మన ప్రయాణం సాగినప్పటికీ.. అందరి సంపూర్ణ మద్దతుతో సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చగలిగాం’ అని సజ్జనార్ అన్నారు.
ఆర్టీసీ సిబ్బంది సహకారంతో అనేక కీలక సంస్కరణలను అమలు చేశామని సజ్జనార్ తెలిపారు. పాత బస్సులను కొత్త బస్సులతో రిప్లేస్ చేయడం, ఏడాదికి రూ. 9000 కోట్లకు పైగా రాబడి, కార్పొరేట్‌కు దీటుగా తార్నాక ఆస్పత్రిని తీర్చిదిద్దడం, గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్‌ల నిర్వహణ, శిక్షణ కార్యక్రమాల ద్వారా సాధికారత వంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టామన్నారు.
గత నాలుగేళ్ల కాలంలో ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటూనే.. ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేశామని సజ్జనార్ అన్నారు. ప్రతి నెల 1న తేదీన జీతాలు, ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 2017కు సంబంధించిన 21 శాతం ఫిట్‌మెంట్‌ను ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రకటించగలిగామన్నారు. పెండింగ్ లో ఉన్న డీఏలన్నింటినీ దశల వారీగా చెల్లించామని చెప్పారు.
“నాలుగేళ్లలో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ను మూడు సార్లు నిర్వహించాం. 44 వేల ఉద్యోగుల హెల్త్ ప్రొఫైల్స్‌ను రూపొందించాం. ఉద్యోగుల జీవిత భాగస్వాములకు వైద్య పరీక్షలు చేయించాం. ఈ ఛాలెంజ్‌లలో వైద్య పరీక్షలు చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలున్న సుమారు 1000 మంది ఉద్యోగుల, వారి జీవిత భాగస్వాముల ప్రాణాలను కాపాడుకున్నాం. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిని కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా రూపొందించుకుని.. ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నాం” అని సజ్జనార్ తెలిపారు.
Also Read: VC Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా చివరి రోజు.. సిటీ బస్సులో ప్రయాణించిన వీసీ సజ్జనార్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రకటించిన 48 గంటల్లో అమలు చేశామని సజ్జనార్ గుర్తుచేశారు. ప్రతి రోజు సగటున 35 లక్షల మంది మహిళలు ఈ స్కీమ్ ను వినియోగించుకుంటున్నారన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల సహకారంతో ఆర్టీసీ తిరిగి తన కాళ్లపై తాను నిలబడేలా కృషి చేశామన్నారు. సంస్థ ప్రకటించిన ప్రతి ఛాలెంజ్ ను విజయవంతం చేశామని చెప్పారు. ఈ మహాయజ్ఞంలో తనతో కలిసి పనిచేసిన ప్రతి అధికారికి, ఉద్యోగికి సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు.