Srisailam Landslide: శ్రీశైలంల ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. పాతాళగంగ దగ్గర కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. పైనుంచి జారిన బండరాళ్లు చెట్లను ఢీకొని కిందపడ్డాయి. ఆ ప్రాంతంలో భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పుణ్యస్నానాల కోసం భక్తులు పాతాళగంగకు నడిచి వెళ్లే మార్గంలో అడ్డంగా చెట్టు పడింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు వెంటనే స్పందించి ఆ చెట్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.
రోడ్డు మళ్లీ ప్రారంభించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. గత రెండు వారాలుగా పర్వత ప్రాంతంలో తరచుగా వర్షాలు కురుస్తుండటంతో మట్టి సడిలి, కొండ చరియలు విరిగిపడే సంఘటనలు పెరిగాయని. భక్తులు జాగ్రత్తగా ప్రయాణించాలన్న విజ్ఞప్తి చేశారు.
గత వారం కూడా ఇదే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి రోడ్డుకి అడ్డంగా పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పెద్ద ఎత్తున బండరాళ్లు కూలిపడటంతో వాహనాలు నిలిచిపోయాయి. అప్పట్లో అధికారులు తొలగించిన రాళ్ల ప్రాంతానికి సమీపంలోనే ..ఈసారి కూడా మరోసారి అదే తరహా ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఫారెస్ట్ అధికారులు, శ్రీశైలం ఘాట్ రోడ్ మెయింటెనెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వర్షాల కారణంగా పాతాళగంగ ప్రాంతానికి వెళ్లే రోప్‌వే సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులు అవసరమైతే మాత్రమే రాకపోకలు చేయాలని దేవస్థానం అధికారులు సూచించారు.
Also Read: ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు కన్నీరు.. ప్రభుత్వంపై జగన్ విమర్శలు
నంద్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు పెంచారు. ప్రమాదకర ప్రాంతాల వద్ద పోలీసు సిబ్బంది మోహరించారు. పర్యాటకులు, భక్తులు అధికారులు ఇచ్చే మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.