Papikondalu Tour: ఏపీలో బెస్ట్ టూరిజం స్పాట్ లలో ఒకటైన పాపికొండలు బోటు విహార యాత్రను అధికారులు పునః ప్రారంభించారు. ఇటీవల తుపాను నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాపికొండలు యాత్రను తిరిగి ప్రారంభించారు.
సుందరమైన పాపికొండల మధ్యలో వంపులు తిరుగుతూ ప్రవహిస్తున్న గోదావరి అలలపై బోటు షికారు మనసుకు ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. పోలవరం ప్రాజెక్టు సమీపంలోని గండిపోచమ్మ ఆలయం వద్ద బోటింగ్ కార్యకలాపాలకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఆదివారం రెండు బోట్లలో మొత్తం 103 మంది పర్యాటకులు ప్రయాణించి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. దీపావళి ముందు నుంచే బోటింగ్ పునః ప్రారంభించినప్పటికీ ఇటీవల భారీ వర్షాలు, గోదావరి నది వరద ప్రవాహం కారణంగా బోటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడడంతో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేసి బోటింగ్‌ను తిరిగి ప్రారంభించారు.
గోదావరి నదీ తీరంలోని పచ్చని పాపికొండలు, ప్రశాంతమైన నదీ ప్రవాహం, మధ్యలో సాగుతున్న బోట్లు పర్యాటకులను ఎంతగానే ఆకట్టుకుంటాయి. కార్తీక మాసం సందర్భంగా పాపికొండల విహారానికి పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. ఈ సీజన్‌లో ప్రకృతి అందాలు మరింత చక్కగా కనువిందు చేస్తాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బోటులో విహారయాత్రకు అనువైన సమయంగా పర్యాటకులు భావిస్తుంటారు.
రాజమండ్రి నుంచి ప్రారంభమైన విహారయాత్ర దేవీపట్నం సమీపంలోని జలవిహారానికి రూ.1200 ఛార్జ్ చేస్తారు. వీరికి టిఫిన్, స్నాక్స్ అందిస్తారు. అలా కాకుండా రాజమండ్రి నుంచి కాకుండా దేవీపట్నం నుంచి బోటు ఎక్కితే రూ.1000 ఛార్జ్ చేస్తారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమై దాదాపు సాయంత్రం ఐదు గంటల వరకు గోదావరిలో విహారయాత్ర కొనసాగుతుంది. బోటు ప్రయాణంలో లైఫ్ జాకెట్ తప్పనిసరిగా ధరించాలి. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Also Read: Ysrcp Politics: ఎట్టకేలకు ప్రయత్నాలు ఫలించాయి.. సజ్జల భార్గవ్‌కు కొత్త పోస్టు, ఈసారెక్కడ?
గతంలో జరిగిన బోటు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని పర్యాటకుల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి బోటులో లైఫ్ జాకెట్లు, భద్రతా సిబ్బంది, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. బోటింగ్ సమయాలను నిర్దేశించారు. పాపికొండలను మరింత అభివృద్ధి చేసేందుకు ఏపీ టూరిజం కొత్త ప్రాజెక్టులను ప్లాన్ చేస్తుంది.