మొంథా తుఫాన్ పరామర్శలకోసం జగన్ ఈరోజు పొలాల్లో దిగారు. కృష్ణా జిల్లా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో పర్యటించి రైతులతో మాట్లాడి, తుఫాన్ నష్టంపై ఆరా తీశారు. నేరుగా పొలాల్లో దిగి, రైతులతో కలసి నడిచారు. నేలకొరిగిన వరిచేలో కలియదిరిగారు జగన్.
గతంలో ఇలా..
ఇప్పుడిక కాస్త వెనక్కు వెళ్దాం, వెనక్కు అంటే జగన్ అధికారంలో ఉన్న టైమ్ కి వెళ్దాం. అప్పుడు కూడా తుఫాన్లు వచ్చాయి, అప్పుడు సీఎం హోదాలో జగన్ పర్యటనలకు వెళ్లారు. కానీ అప్పుడు సీన్ ఇలా లేదు. తుఫాన్ బాధితులు ముఖ్యమంత్రిని కలవాలంటే చాలా కండిషన్లు ఉండేవి. జగన్ కూడా నేరుగా పొలాల్లోకి దిగలేదు. పొలం పక్కనే చిన్న టెంట్ వేసి ఒక అరేంజ్ మెంట్ చేసేవారు. పరదా ఆవల ఆయన ఉండేవారు, పరదా ఈవల రైతులు ఉండి ఆయనకు పంట నష్టాన్ని వివరించేవారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ సీన్ అప్పట్లో రాష్ట్రం మొత్తం వైరల్ గా మారింది. ఆ తర్వాత చాలా సార్లు జగన్ పరదాల వీడియోలను టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ చేసింది. సెటైర్లు వేసింది.
అధికార మదం తలకెక్కినప్పుడు జగన్, పంట నష్టపోయిన రైతుల పొలంలోనే కార్పెట్ వేయించుకుని పరామర్శించాడు.
జగన్ అధికార అహంకారాన్ని జనం దింపేసరికి..ఇలా పొలంలో దిగాడు.#PsychoFekuJagan#EndOfYCP#AndhraPradesh pic.twitter.com/FzyCLo5qn5
— Telugu Desam Party (@JaiTDP) November 4, 2025
అప్పుడు – ఇప్పుడు
జగన్ గతంలో కూడా పొలాల్లో దిగిన ఉదాహరణలున్నాయి, రైతులతో కలసి కూర్చుని అన్నం తిన్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. కానీ అది 2019 కి ముందు అంటే జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. 2019 నుంచి 2024 మధ్యలో జగన్ పర్యటనలన్నీ దాదాపుగా పరదాల మాటునే సాగేవి. ఆ తర్వాత ఇప్పుడు తిరిగి ప్రతిపక్షంలోకి వచ్చాక జగన్ మళ్లీ రూటు మార్చినట్టు తెలుస్తోంది. తానే స్వయంగా పొలాల్లో దిగి రైతుల్ని పరామర్శించారు. ఆయనలో మార్పు వచ్చిందని చెప్పకనే చెప్పారు.
రైతన్న కష్టాల్లో ఉంటే లండన్లో @ncbn షికార్లు.. అన్నదాతలతో పొలాల మధ్య మాజీ సీఎం వైయస్ జగన్ గారు.#CycloneMontha#YSJaganInKrishnaDistrict#SadistChandraBabu #AndhraPradesh pic.twitter.com/UQxD3xng2t
— YSR Congress Party (@YSRCParty) November 4, 2025
ట్రోలింగ్ మొదలు..
తుఫాన్ వెలిసిపోయి వారంరోజులు జరిగిన తర్వాత జగన్ ఇప్పుడు తీరిగ్గా పరామర్శల కోసం వచ్చారని టీడీపీ విమర్శిస్తోంది. తుఫాన్ కష్టకాలంలో ప్రజల్ని అప్రమత్తం చేసింది, ఆదుకుంది కూటమి ప్రభుత్వం అని, ఆ సమయంలో ఆయన బెంగళూరులో ఉన్నారని, తుఫాన్ వెలిసిన తర్వాత ఓసారి చుట్టపు చూపుగా ఏపీకి వచ్చి తిరిగి వెళ్లిపోయారని, ఇప్పుడు తీరిగ్గా పరామర్శ యాత్ర పెట్టుకున్నారని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మొత్తమ్మీద జగన్ బెంగళూరులో ఉన్నా తిప్పలు తప్పట్లేదు, ఏపీకి వచ్చినా విమర్శలు ఆగడం లేదు. టీడీపీ చేస్తున్న విమర్శలకు వైసీపీ నుంచి కూడా కౌంటర్లు పడుతున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు లండన్ లో ఉండటంతో.. బాబు లండన్ లో, జగన్ జనంలో అంటూ వైసీపీ నేతలు విమర్శలు మొదలు పెట్టారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ జనంలోకి వెళ్లేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. మొదట్లో రెడ్ బుక్ అంటూ ఏకంగా ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. పెద్దగా స్పందన రాకపోవడంతో కొన్ని రోజులు వేచి చూడాలనుకున్నారు. ఏపీలో వివిధ సమస్యలపై పార్టీ నేతలతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు కానీ, ఆయన మాత్రం బెంగళూరులో మకాం పెట్టారు. దీంతో ఇక్కడ పార్టీని నడిపేవారు లేకుండా పోయారు. అప్పుడప్పుడు బెంగళూరు నుంచి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారనే విమర్శలను మూటగట్టుకుంటున్నారు జగన్.
Also Read: ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు కన్నీరు.. జగన్ విమర్శలు