YS Jaganmohan Reddy: రాష్ట్రంలో రైతులు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అడుగడుగునా నష్టపోతున్నారని, తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సంభవించిన ‘మొంథా’ తుఫాన్ (Montha Cyclone) కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి, నష్టపోయిన రైతులను పరామర్శించారు.
రైతులతో మాట్లాడిన అనంతరం జగన్, ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “వైసిపి హయాంలో ప్రతి రైతుకు భరోసా ఉండేది. కానీ ఈ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది.” అని ఆయన అన్నారు. గత కొద్ది నెలల కాలంలోనే రాష్ట్రంలో 16 సార్లు ప్రకృతి విపత్తులు సంభవించాయని, దీనివల్ల దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన పంటల బీమా పథకంపై కూడా గందరగోళం నెలకొందని జగన్ ఆరోపించారు. “మా ప్రభుత్వంలో రైతు ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ‘ఉచిత పంటల బీమా’ అందించింది. కానీ ఇప్పుడు ఆ భరోసా ఎక్కడా కనిపించడం లేదు. మేము 85 లక్షల మంది రైతులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఉచిత బీమా అందిస్తే, ఇప్పుడు కేవలం 19 లక్షల మంది రైతులకు మాత్రమే బీమా ఉంది. రైతుల కోసం రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. రూ. 7,800 కోట్లతో పంట కొనుగోలుకు కాంపిటీషన్ క్రియేట్ చేసి, గిట్టుబాటు ధర ఉండేలా చూశాం” అని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందుతుందనే నమ్మకం కూడా లేదని రైతులు వాపోతున్నారని ఆయన తెలిపారు.
Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని ఆరుగురు మృతి, 30 మందికి గాయాలు
“పంటలు గింజలు పాలు పోసుకునే కీలక సమయంలో ‘మొంథా’ తుఫాన్ విపత్తు సంభవిస్తే, రైతులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.” అని జగన్ ఆరోపించారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదని, కూటమి పాలనలో రైతులకు పంటల బీమా కరువైందని ఆయన అన్నారు. “ఇప్పటివరకు ఇన్‌పుట్ సబ్సిడీ రూపాయి కూడా ఇవ్వలేదు. రైతులు ఎరువుల కోసం బ్లాక్‌లో కొనాల్సిన దుస్థితి ఏర్పడింది,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్ నష్టం జరిగినా, ఏ అధికారి రైతుల వద్దకు ఎన్యుమరేషన్ (పంట నష్టం అంచనా) కోసం రాలేదని, దీంతో నష్టపోయిన రైతులు దరఖాస్తు చేసుకునే సమయం కూడా లేకుండా పోయిందని అన్నారు.
తమ పాలనను ప్రస్తుత పాలనతో పోల్చి చూస్తూ, “మా హయాంలో రైతులకు భరోసా ఉండేది. జగనన్న ఉన్నాడనే నమ్మకంతో ఉండేవారు. కానీ కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది,” అని జగన్ వ్యాఖ్యానించారు. “ప్రతి ఆర్బీకేలో ఒక అగ్రికల్చర్ అధికారి ఉండేవారు. ఆర్బీకేలు రైతుల చేయి పట్టుకుని నడిపించాయి. ఈ-క్రాప్‌తో ప్రతి రైతుకు లాభం చేకూరేలా చేశాం,” అని గుర్తుచేశారు.