Janasena: జనసేన పార్టీ గుర్తు గల్లంతైంది. గాజుగ్లాస్ చేజారింది. రాబోయే ఎన్నికల్లో ఏపీలో అధికార పార్టీ వైసీపీని గద్దె దించేడమే తన లక్ష్యమంటూ శ్రమిస్తున్న పవన్ కల్యాణ్ ఆశలపై ఎలక్షన్ కమిషన్ నీళ్లు చల్లినట్లైంది. జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది.
రాజకీయాల్లో గుర్తింపు రావాలంటే ఎన్నికల్లో గెలవాలి. ఒకవేళ ఓడిపోయినా ప్రజల్లో తగినంత మద్దతను ఓట్ల రూపంలో కూడగట్టుకోవాలి. అప్పుడే ఆ పార్టీకీ ప్రాంతీయ లేదా జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసినా సీట్లు రాలేదు. గెలిచిన ఒక వ్యక్తి కూడా వైఎస్‌ఆర్‌సీపీకి మద్దుతు తెలిపారు. అయితే తగినన్ని ఓట్లతో పాటు సీట్లు కూడా దక్కించుకోలేక పోయిందా పార్టీ. దీంతో ఆ పార్టీ సింబల్‌ను ఎన్నికల సంఘం ఫ్రీ సింబర్ కేటగిరీలో చేర్చింది ఈసీ.
ఏపీలో గత శాసనసభ ఎన్నికల్లో పోలైన ఓట్లలో జనసేనకు 6 శాతం ఓట్లు పడాలి. అలాగే రెండు అసెంబ్లీ స్థానాల్లో గెలవాలి. ఇవి రెండు జరిగితేనే ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీ గుర్తింపు లభించేది. జనసేన పార్టీ గత ఎన్నికల్లో 6 శాతం ఓటు శాతం వచ్చినప్పటికి ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలవడంతో ఫ్రీ సింబల్ కేటగిరిలోకి వెళ్లిపోయింది. 25 లోక్‌సభ స్థానాల్లో ఒక్క ఎంపీ సీటు గెలిచినా ప్రాంతీయ పార్టీ హోదా దక్కేది. ఈ పరిస్థితిని చేజార్చుకోవడంతో పవన్ కల్యాణ్ పార్టీకి ఇప్పుడు ఇలాంటి షాక్ తగిలింది.
దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులో 8 పార్టీలు జాతీయ హోదా దక్కించుకోగా.. 57స్థానిక పార్టీలకు ప్రాంతీయ హోదా కల్పించింది ఎలక్షన్ కమిషన్. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన ఈ జాబితాలో లేకపోవడం ఆపార్టీకి తీరని అవమానమే అన్న టాక్ అప్పుడే మొదలైంది. మరోవైపు 2024ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీకి సిద్ధమవుతున్న జనసేనకు ఊహించని షాక్ ఇచ్చినట్లైంది.
జనసేన పార్టీ గుర్తైన గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చినట్లు ఈసీ ఇప్పుడు ప్రకటించినప్పటికీ కొన్ని నెలల కిందట జరిగిన బద్వేలు ఉప ఎన్నిక సమయంలోనే జనసేన ఆ గుర్తును కోల్పోయింది. బద్వేలు ఉప ఎన్నికలో జనసేన పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చింది. దీంతో నవతరం పార్టీ అభ్యర్థికి ఈసీ గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేనకు ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించగా.. ఆ పార్టీ శ్రేణులు సింబల్ ను జనాల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లారు.
పవన్ కళ్యాణ్ కూడా తాను నటించే సినిమాల్లో ఏదో ఒక సందర్భంలో గాజు గ్లాస్ ను ప్రదర్శిస్తూ వచ్చారు. ఈ విధంగా గాజు గ్లాస్ అంటే జనసేన పార్టీ సింబల్ గా ప్రజల్లో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఈసీ ఆ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడం జనసేనకు నష్టం కలిగించే అంశమే. వచ్చే ఎన్నికల్లో ఈసీ జనసేనకు మళ్ళీ గాజు గ్లాస్ గుర్తు కామన్ గా ఇస్తే పర్వాలేదు, లేకపోతే భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది. గాజు గ్లాస్ సింబల్ జనసేనదిగా భావించి ఓట్లు వేసే అవకాశం లేకపోలేదు. మరి, ఈ ఇష్యూని జనసేనాని ఎలా డీల్ చేస్తారో.