TDP Politics: పార్టీపై మంత్రి లోకేష్ పూర్తిస్థాయిలో ఫోకస్ చేశారా? జిల్లాల పర్యటనలో నేతల వ్యవహారశైలి బయటపడిందా? నేతలకు ఎందుకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు? ఇటీవల అధినేత చంద్రబాబు గుర్తించిన 48 ఎమ్మెల్యేల్లో వారు కూడా ఉన్నారా? అవుననే అంటున్నారు కొందరు టీడీపీ నేతలు.
నేతలపై మంత్రి లోకేష్ సీరియస్
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పైగానే గడిచింది. అయినా టీడీపీ కార్యకర్తలు.. కొన్నిచోట్ల మా ప్రభుత్వం వచ్చిందన్న మూడ్‌లో లేరని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్లుగా తమ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారట. చివరకు ఈ విషయం మంత్రి లోకేష్ చెవిలో పడింది. కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇటీవల రెండు రోజుల పాటు అనంతపురంలో పర్యటించారు మంత్రి నారా లోకేష్. తన పర్యటనలో పార్టీ నేతల వ్యవహారంపై చినబాబు అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కార్యకర్తలకు అండగా ఉండని కొందరు ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇకపై అందరినీ కలుపుకొని పోవాలని ఎమ్మెల్యేలను హెచ్చరించినట్టు తెలుస్తోంది.
అనంతపూర్ జిల్లాలో ఏం జరిగింది?
మళ్లీ తాను పర్యటనకు వచ్చేసరికి ఇలాంటి ఫిర్యాదులు రావడానికి వీల్లేదని తెగేసి చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల అధినేత, సీఎం చంద్రబాబు పార్టీలో 48 మంది ఎమ్మెల్యేల పని తీరుపై కాసింత ఆగ్రహంగా ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో చినబాబు సీరియస్ అయినట్టు చర్చించుకుంటున్నారు.
ALSO READ: ఎన్నికల వేళ జగన్ బయటకు తీసిన అస్త్రాన్ని ముందుగా చంద్రబాబు ప్రయోగం
సోమవారం కేబినెట్ సమావేశానికి ముందు మంత్రులతో లోకేష్ భేటీ అయ్యారు. తొలిసారి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు మంచి-చెడు తెలియడం లేదని అన్నారట. అవగాహన రాహిత్యంతో ఎమ్మెల్యేలు-కేడర్ మధ్య సమన్వయం ఉండల్లేదని, వారికి సీనియర్ నేతలతో అవగాహన కల్పించాలని అన్నట్లు సమాచారం.
వచ్చే ఎన్నికల నాటికి ఇప్పటి నుంచి కేడర్‌ను సమాయత్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. ప్రభుత్వ పని తీరుపై ప్రజలు హ్యాపీగా ఉన్నప్పటికీ, కేడర్ మాత్రం నిరాశకు గురైనట్టు తేలింది. ఈ క్రమంలో ఏ జిల్లాలకు వెళ్లినా వారితో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు యువనేత. ఇదే జోరు కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికల నాటికి తమకు తిరుగుందని భావిస్తున్నారు.
వచ్చే ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దానికి ఇప్పటి నుంచి కేడర్‌ని ప్రిపేర్ చేస్తోంది టీడీపీ నాయకత్వం. 100 శాతం గెలవాలని ఆలోచన చేస్తున్నారట. వైసీపీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాలు ఈసారి కుప్పకూలడం ఖాయమని కొందరు నేతలు చెబుతున్నారు. ఎందుకంటే వైసీపీ కేడర్ పెద్దగా లేదని, నాయకులతోపాటు కేడర్ వెళ్లిపోతుందని అంటున్నారు. కొందరు నేతలకు కేసులు వెంటాడుతున్నాయని చెబుతున్నారు.