Winter Weather Report: తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో వరుసగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం సమయంలో పొగమంచు, చలిగాలులు వీస్తుండగా.. రాత్రి సమయంలో చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. నవంబర్‌లో ఒకటి, రెండు రోజులు విపరీతమైన చలి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోనున్నాయని తెలిపింది. నవంబర్ 11 నుంచి 19 వరకు.. 13 నుండి 17 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రానున్న మూడు రోజులపాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి.
ఉత్తరాది నుంచి వచ్చే వాయుగుండాల ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చలి తీవ్రతను తేలికగా తీసుకోకుండా, సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ తో పాటు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రత వివరాలను పరిశీలిస్తే.. పటాన్చెరు 13.2, మెదక్ 14.1, ఆదిలాబాద్ 14.2, హయత్‌నగర్ 15.6, హన్మకొండ 16, నిజామాబాద్ 16.8, హైదరాబాద్ 16.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఇక దుండిగల్, రాజేంద్రనగర్, మహబూబ్‌నగర్, హకీమ్‌పేట్, ఖమ్మం, భద్రాచలం, నల్గొండ, రామగుండం జిల్లాల్లో 18 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో చలి తీవ్రంగా ఉంటుందని చిన్న పిల్లలు, వృద్దులు తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు.
Also Read: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత
ఏపీలో పెరుగుతున్న చలి..
ఏపీలో కూడా పలు జిల్లాల్లో చలి పంజా విసురుతోంది. ఉత్తర కోస్తా ఆంధ్ర వైపు అల్లూరిసీతారామరాజు, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, యానం జిల్లాలో చలిపులి పంజా విసిరింది. ఏజెన్సీలో చలి తీవ్రత పెరగడంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గటంతో గిరిజన ప్రజలు చలి బారిన పడుతున్నారు. దీంతో ఉదయం వేళలో మరింతగా చలి పెరగటంతో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు ప్రజలు. దక్షిణ కోస్తాంధ్ర వైపు రాయలసీమలో పెరుగుతున్న చలి. అనంతపురం, నంద్యాల, కడప, కర్నూల్ జిల్లాల్లో చలి పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ పాడేరులో 14డిగ్రీలు, చింతపల్లిలో 15డిగ్రీలు కొయ్యురులో 18డిగ్రీలు లంబసింగిలో 11డిగ్రీలగా ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. గిరిజన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.