CM Progress Report: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే.. కూటమి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అన్నారు సీఎం చంద్రబాబు. పౌరులకు సుపరిపాలన అందించేందుకు విజన్ డాక్యుమెంట్స్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల పేరుని.. విజన్ యూనిట్స్‌గా మారుస్తూ.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జరిగిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ.. సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో మొత్తం మూడు ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటవుతున్నాయని.. అందుకు అనుగుణంగా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు.
నవంబర్ 3, సోమవారం ( ఇన్వెస్ట్ ఇన్ ఏపీ )
ఆంధ్రప్రదేశ్‌కు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా.. లండన్‌లో పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అయ్యారు సీఎం చంద్రబాబు. నవ్యాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాల గురించి.. అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్ఠాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాల్సిందిగా పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలను, పెట్టుబడిదారులకు అందిస్తున్న సహకారాన్ని తెలియజేశారు. గతంలో ఉన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో తాము స్పీడ్ డూయింగ్ బిజినెస్ అనే నూతన విధానాన్ని అమలు చేస్తున్నామని, పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను అత్యంత వేగంగా, పారదర్శకంగా అందిస్తున్నామని.. సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఆదాయంతో పాటు, స్థానిక యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలకు రెడ్ కార్పెట్ పరుస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా.. భవిష్యత్తును శాసించే గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్లు, ఏవియేషన్ లాంటి కీలక రంగాలపై దృష్టి సారించాలని పారిశ్రామికవేత్తలను కోరారు.
నవంబర్ 3, సోమవారం ( వెల్‌కమ్ రోల్స్ రాయిస్! )
లండన్‌లో రోల్స్ రాయిస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ నిక్కీ గ్రేడీ స్మిత్‌ను.. సీఎం చంద్రబాబు కలిశారు. ఏపీలో ఉన్న వనరుల గురించి స్పష్టంగా వివరించారు. ఏరోస్పేస్, అడ్వాన్స్‌డ్ మానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ రంగాల్లో.. ఏపీ వేగంగా ఎదిగే సామర్థ్యం ఉందని స్మిత్‌కు తెలిపారు. ప్రత్యేకించి, ఓర్వకల్ మిలిటరీ ఎయిర్‌స్ట్రిప్, ఎంఆర్ఓ యూనిట్, భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి ప్రణాళికలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. రోల్స్ రాయిస్ లాంటి కంపెనీలు.. ఆంధ్రప్రదేశ్‌కు వస్తే దేశం మొత్తం ఏరోస్పేస్ రంగంలో స్వయం సమృద్ధి దిశగా అడుగేస్తుందనే ఆలోచనతో.. విశాఖ, తిరుపతిలలో జీసీసీలు ఏర్పాటు చేయాలని రోల్స్ రాయిస్ గ్రూప్ ప్రతినిధుల్ని సీఎం చంద్రబాబు కోరారు. ఏరో ఇంజిన్స్, డీజిల్ ప్రొపెల్షన్ సిస్టమ్స్ తయారీలో రోల్స్ రాయిస్‌కు అంతర్జాతీయ బ్రాండ్‌గా పేరుంది. ఓర్వకల్లులో మిలిటరీ ఎయిర్‌స్ట్రిప్, విమానాల మెయింటెనెన్స్, ఓవర్ హాలింగ్ యూనిట్, భోగాపురం విమానాశ్రయ సమీపంలో ఏవియేషన్ ఎకో సిస్టం, ఎమ్మార్వో ఫెసిలిటీ ఏర్పాటుకు అవకాశం ఉందని వివరించారు.
నవంబర్ 3, సోమవారం ( రూ.20 వేల కోట్ల పెట్టుబడులు )
యూకే టూర్‌లో భాగంగా.. సీఎం హిందుజా గ్రూప్ ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. రాబోయే రోజుల్లో ఏపీలో 20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని ఆ సంస్థ నిర్ణయించింది. విశాఖలో హిందుజా పవర్‌ప్లాంట్ సామర్థ్యాన్ని 1,600 మెగా వాట్లు పెంచడం, రాయలసీమ విద్యుత్ ప్లాంట్లు, మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్, ఏపీ వ్యాప్తంగా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్, గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి ఆ సంస్థ దశవారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం, హిందుజా గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది.
నవంబర్ 3, సోమవారం ( ఏపీకి సెమీ కండక్టర్ యూనిట్! )
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ టెక్నాలజీతో అనుసంధానం కావాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు లండన్‌లో.. శ్రామ్ అండ్ మ్రామ్ గ్రూప్ ఛైర్మన్ శైలేశ్ హీరానందాని, శ్రామ్ కో హోల్డింగ్ లిమిటెడ్ ఛైర్మన్ సంపత్ కుమార్ మల్లాయలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి వివరించారు. సెమీకండక్టర్, అడ్వాన్స్‌డ్ ప్యాకేజింగ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ లాంటి హైటెక్ రంగాల్లో పెట్టుబడులపై చర్చలు జరిపారు. విశాఖపట్నం, తిరుపతి లాంటి ప్రాంతాలను గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ స్థాపనకు వ్యూహాత్మక కేంద్రాలుగా సూచించారు. ఈ క్రమంలో సెమీ కండక్టర్లు, ఆధునిక ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటుకు శ్రామ్ అండ్ మ్రామ్ గ్రూపు ఆసక్తి చూపించింది.
నవంబర్ 3, సోమవారం ( ఏపీకి గ్రీన్ ఎనర్జీ )
పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా.. లండన్‌లో అతిపెద్ద పవర్ సప్లై సంస్థగా ఉన్న ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్‌ను.. ఏపీకి ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. అమరావతి, విశాఖలో నూతన టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా నియంత్రణ రంగంలో పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని.. ఆక్టోపస్ ఎనర్జీ డైరెక్టర్ క్రిస్ ఫిట్జార్డ్‌కు తెలిపారు. క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో.. ఏపీలో పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని ఆక్టోపస్ ఎనర్జీ ప్రతినిధులకు వివరించారు. 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేలా.. ఏపీ టార్గెట్ పెట్టుకుందన్నారు సీఎం చంద్రబాబు. విద్యుత్ రంగంలో ప్రభుత్వ పాలసీలను, ఏపీ నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు. మొత్తంగా లండన్ పర్యటనలో వివిధ పారిశ్రామికవేత్తలు, దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిందిగా వారిని కోరారు. విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, వాటికి అనుగుణంగా ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక పాలసీలను వివరించారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు తెలియజేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు.
నవంబర్ 4, మంగళవారం ( లండన్‌తో వాణిజ్య సంబంధాలకు కృషి )
ఎక్కడున్నా.. ఏపీనే ఫస్ట్ అని మరోసారి రుజువు చేశారు సీఎం చంద్రబాబు. పర్సనల్ టూర్ కోసం ఈ వారం లండన్ వెళ్లిన ముఖ్యమంత్రి.. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కోసం పెట్టుబడుల వేటని కొనసాగించారు. అనేక మంది దిగ్గజాలతో భేటీ అయ్యారు. లండన్ టూర్‌లో ఉన్న సీఎం చంద్రబాబుతో.. భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ – యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం, విద్యా సహకారం, ఆవిష్కరణలు, ప్రవాస భారతీయులతో మమేకమై రాష్ట్రానికి మేలు జరిగేలా చూడటం లాంటి అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి. యూకేలోని వివిధ వర్సిటీలు, ఏపీతో 4 అంశాల్లో భాగస్వామ్యం ఏర్పాటుపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాయింట్ వెంచర్లు ఏర్పాటు అంశంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. వర్సిటీలు, విద్యాసంస్థల మధ్య విద్యార్థుల ఎక్స్ఛేంజ్ అంశంపై విక్రమ్ దొరైస్వామితో సీఎం మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలు, యూకేతో సహకారంపైనే ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు. ఏపీలో ఆర్థిక అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు తగిన తోడ్పాటునిచ్చేలా సాగాయి.
నవంబర్ 6, గురువారం ( విజన్ యానిట్స్‌గా సచివాలయాలు )
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రాధాన్యత కావాలన్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై సదస్సు జరిగింది. ఈ సమావేశంలో.. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల పేరుని మారుస్తున్నట్లు తెలిపారు. ఇకపై.. అవి.. విజన్ యూనిట్లుగా పని చేస్తాయన్నారు. దీర్ఘ, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని.. పౌరులకు సుపరిపాలన అందించాలని సీఎం సూచించారు. కూటమి ప్రభుత్వ లక్ష్యం కూడా అదేనని స్పష్టంగా చేశారు. అందుకు అనుగుణంగానే విజన్ డాక్యుమెంట్స్ రూపొందించినట్లు తెలిపారు. అంతా కలిసికట్టుగా పనిచేసి ఇటీవల వచ్చిన తుఫాన్‌ను టెక్నాలజీ వినియోగంతో.. ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగినట్లు వెల్లడించారు. డేటా ఆధారిత పాలన అత్యంత కీలకమైన అంశంగా మారిందన్నారు. క్వాంటం కంప్యూటర్‌ను వచ్చే జనవరి నుంచే అమరావతిలో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ ద్వారా సమర్థంగా వనరులను వినియోగించగలుగుతున్నామని తెలిపారు. 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగానే ప్రభుత్వం పౌరసేవలు అందించాల్సి ఉందన్నారు. ప్రతీ నియోజకవర్గానికీ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తామని తెలిపారు సీఎం. ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగిస్తున్నామన్నారు. అందుకు అనుగుణంగానే నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ప్రతి కుటుంబం యూనిట్‌గా అన్ని ఇళ్లను జియో ట్యాగింగ్ చేశామన్నారు. ఫైళ్లు వేగంగా క్లియర్ చేయాలని ఆదేశించారు. రూల్స్ ప్రకారం జీవోలు ఇవ్వకపోవడం వల్లే.. న్యాయ వివాదాలు తలెత్తుతున్నాయని తెలిపారు. కాశీ బుగ్గ ఆలయానికి అంతమంది భక్తులు వస్తే.. తెలియకపోవడం ఏంటని ప్రశ్నించారు.
నవంబర్ 7, శుక్రవారం ( యాక్షన్ ప్లాన్ )
ఈ వారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 12వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు తీసుకోవడంతో పాటు.. అవి కార్యరూపం దాల్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పరిశ్రమల కోసం అవసరమైన భూములు.. విద్యుత్ లభ్యత ఉండేలా చూడాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో 26 పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనల్ని SIPB ఆమోదించింది. వీటి ద్వారా దాదాపు లక్షా 2 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా 85 వేల 570 ఉద్యోగాలు దక్కనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గడిచిన 16 నెలల్లో జరిగిన 12 ఎస్ఐపీబీ సమావేశాల ద్వారా మొత్తంగా 8 లక్షల 8 వేల కోట్లకు పైగా పెట్టుబడులు, 7 లక్షల 5 వేలకు పైగా ఉద్యోగాలు రానున్నాయి.
రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు వచ్చేలా చూడటం అధికారుల బాధ్యతేనని.. పెట్టుబడిదారుల నుంచి ప్రతిపాదనలు తీసుకుని సమయం వృథా కాకుండా తక్షణమే ఆమోదించాలని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన పరిశ్రమలు, ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూసే బాధ్యతను అధికారులు తీసుకోవాలన్నారు. పెట్టుబడులు పెట్టే పరిశ్రమల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని.. క్షేత్ర స్థాయిలో ఆయా పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అనుమతులను త్వరితగతిన వచ్చేలా శ్రద్ధ పెట్టాలన్నారు. గత పాలకులు భూమి కేటాయించినా ఇప్పటికీ ప్రారంభంకాని ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయో సమీక్షించి.. ఏ ప్రాజెక్టులైనా నిర్మాణ పురోగతి లేకపోతే అనుమతులు రద్దు చేయాలని తెలిపారు. అలాగే ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించాలన్నారు
భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ రంగంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయన్నారు సీఎం. చిప్, సెమీ కండక్టర్లు, డ్రోన్ లాంటి పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో సుమారు 15 పారిశ్రామిక జోన్లను ఏర్పాటు చేసుకుని.. క్లస్టర్ వారీ విధానంతో పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుందన్నారు. ఇలాంటి వాటిని గుర్తించి ప్రమోట్ చేయాలని.. కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాలు కొంచెం ఆలస్యమైనా.. రాష్ట్ర ప్రభుత్వం వైపు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా పెట్టుబడులు చేజారకుండా చూడాలన్నారు. ప్రభుత్వం కూడా పారిశ్రామిక అవసరాల దృష్ట్యా.. ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేసుకోవాలన్నారు. ఎవరైనా ప్రైవేట్ ల్యాండ్ ఓనర్లు తమ భూములను పరిశ్రమలకు, కంపెనీలకు ఇవ్వడానికి ముందుకు వస్తే.. అలాంటి వారిని ప్రోత్సహించాలని చెప్పారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో మూడు మెగా సిటీలు అభివృద్ధి చేయాలని.. అనకాపల్లి నుంచి విజయనగరం వరకు విశాఖను మెగా సిటీగా అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే తిరుపతి, అమరావతి నగరాలను కూడా మెగా సిటీలు చేయాల్నారు. విశాఖ, తిరుపతి మెగా సిటీలకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని.. వీటని టూరిజం, ఐటీ సహా వివిధ పరిశ్రమలకు అనుకూలంగా ఉండేలా చూడాలని ఆయా శాఖల అధికారులకు తెలిపారు. అదేవిధంగా వీటికి నివాసయోగ్యమైన నగరాలుగా తీర్చిదిద్దాలన్నారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల విశాఖకు మరిన్ని కంపెనీలు, పరిశ్రమలు రానున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో విశాఖకు వచ్చే కంపెనీలకు భూ లభ్యత ఉండేలా చూసుకోవాలన్నారు. టూరిజం అభివృద్ధికి.. ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన హోటళ్లు నిర్మించేలా చూడాలన్నారు. ఏపీలో మొత్తం మూడు ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటవుతున్నాయని.. దీనికి అనుగుణంగా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. బీచ్ టూరిజాన్ని మరింత డెవలప్ చేయాలన్నారు.
నవంబర్ 8, శనివారం ( కుప్పం ప్రోగ్రెస్ )
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కుప్పంలో.. 6,339 కోట్ల పెట్టుబడితో ప్రారంభం కానున్న 8 సంస్థలకు సీఎం చంద్రబాబు అమరావతి నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 43 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. బ్యాటరీ టెక్నాలజీ, మెడికల్ డివైసెస్, ఫుడ్ లాజిస్టిక్స్, ఫుట్ వేర్, ఇన్నోవేషన్ హబ్‌గా కుప్పం రూపుదిద్దుకోనుంది. నియోజకవర్గంలో పరిశ్రమలు స్థాపించనున్న ప్రతినిధులతోనూ సీఎం మాట్లాడారు. అనుకున్న సమయానికి పరిశ్రమలు ప్రారంభించాలని చంద్రబాబు సూచించారు. తాము పరిశ్రమలను స్థాపించేందుకు ప్రభుత్వం నుంచి త్వరితగతిన అనుమతులు ఇచ్చిన ముఖ్యమంత్రికి ఆ సంస్థల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా.. కుప్పంలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలకు సంబంధించిన నిర్మాణ ప్రణాళికలను సీఎంకు పారిశ్రామికవేత్తలు వివరించారు. 8 పరిశ్రమలకు 241 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.
Also Read: దారుణం.. రెండు నెలల కూతురిని ట్రాక్టర్ టైర్ల కింద పడేసిన కసాయి తల్లి
మరోవైపు.. కుప్పం స్థానిక రైతులు, ప్రజలతోనూ సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. హంద్రీ-నీవా కాల్వ ద్వారా నియోజకవర్గానికి నీళ్లు రావడం చాలా సంతోషంగా ఉందని కుప్పం స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కుప్పానికి ఈ తరహాలో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు రావడంతో తమ ఉత్పత్తులను ఇక్కడి పరిశ్రమలకే విక్రయించే అవకాశం ఉంటుందని సీఎంకు రైతులు తెలిపారు. కుప్పానికి ఈ తరహాలో పరిశ్రమలు వస్తాయని తాము కలలో కూడా అనుకోలేదని మహిళా పాడి రైతులు అన్నారు. తల్లికి వందనం ద్వారా తాము లబ్దిపొందుతున్నామని సీఎంకు మహిళలు చెప్పారు. గతంలో ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చేదని.. ఇప్పుడు పరిశ్రమలు రావడంతో వలస వెళ్లాల్సిన అవసరం లేదని స్థానికులు తెలిపారు. పరిశ్రమలు స్థాపించడం ద్వారా తమకు ఉపాధి కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు కుప్పం వాసులు ధన్యవాదాలు తెలియజేశారు.
Story By Anup, Bigtv