తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి గొప్ప సేవ చేసిన బ్రిటిష్ అధికారి సి.పి.బ్రౌన్. ఆయన జయంతికి మాజీ సీఎం జగన్ ఓ ట్వీట్ వేశారు. అయితే ఆ ట్వీట్ కి ప్రజల రియాక్షన్లు మాత్రం వైరల్ అవుతున్నాయి. తెలుగు మీడియం లేపేసి, ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి చేసిన జగన్ కి తెలుగు గురించి మాట్లాడే హక్కు లేదంటున్నారు నెటిజన్లు.
తెలుగు భాషను ప్రేమించి, తెలుగు సాహిత్యాన్ని ముద్రించి భద్రపరచి, ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు సి.పి. బ్రౌన్ గారు. ఆయన సమకూర్చిన తెలుగు–ఇంగ్లీష్ నిఘంటువు తెలుగు భాష అభివృద్ధికి శాశ్వతమైన పునాది వేసింది. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/8kBc2udUnO
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 10, 2025
బ్రౌన్ గొప్పదనం..
బ్రిటిష్ అధికారిగా నాడు రాయలసీమ ప్రాంతానికి వచ్చిన సీపీ బ్రౌన్ తెలుగు భాషపై అభిమానం పెంచుకున్నారు, తెలుగు సాహిత్యానికి ఆయన ముగ్ధుడయ్యారు. అప్పటికే అంతరించిపోతున్న సాహిత్య సంపదను ఆయన సేకరించి భద్రపరిచారు. తెలుగు సాహిత్యాన్ని పుస్తకాల రూపంలో ముద్రించారు. అంతే కాదు తెలుగు-ఇంగ్లిష్ నిఘంటువుని కూడా ఆయన రూపొందించారు. అప్పట్లో ఆయన తయారు చేసిన డిక్షనరీయే ఇప్పటికీ ప్రామాణికం అంటే ఆయన కృషి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయన ఘనతను గుర్తు చేసుకోవడమే కానీ, ఆ తర్వాత ప్రభుత్వాలు ఆయన కృషిని కొనసాగించడంలో అలసత్వం చేశాయనే చెప్పాలి. కాలం కూడా అలాగే మారిపోయింది. ఇంగ్లిష్ నేర్చుకుంటేనే గ్లోబలైజేషన్ ని తట్టుకుని ఉద్యోగాలు సాధించగలమనే నమ్మకం ప్రజల్లో వచ్చింది. ఇంగ్లిష్ మీడియం చదువులు తప్పనిసరిగా మారిపోయాయి. ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియం చదువుల్ని పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోకి మార్చేశారు జగన్. అప్పట్లో ఈ నిర్ణయం పెద్ద వివాదాస్పదంగా మారింది. తెలుగు భాషను జగన్ చంపేశారంటూ వైరి వర్గాలు విమర్శించాయి. పేదలకు ఇంగ్లిష్ మీడియం చదువులు వద్దా అంటూ జగన్ వర్గం వారిని ప్రశ్నించింది. ఈ చర్చ పక్కనపెడితే తెలుగు మీడియంకు జగన్ వ్యతిరేకిి అనే ముద్ర బలంగా పడింది. అందుకే ఇప్పుడు సీపీ బ్రౌన్ జయంతికి జగన్ నివాళిగా ట్వీట్ పెడితే, నెటిజన్లు నెగెటివ్ గా రియాక్ట్ అయ్యారు.
Also Read: అదే ఓవర్ కాన్ఫిడెన్స్.. బీఆర్ఎస్ లో ఏ మార్పు లేదు
పేదలకు ఇంగ్లిష్ మీడియం చదువులు అవసరమే కానీ అదే సమయంలో తెలుగు ప్రాధాన్యం తగ్గించ వద్దని అంటున్నారు కొందరు. ప్రాథమిక విద్యాభ్యాసం తెలుగులో జరిగితేనే పిల్లలకు విషయాల పట్ల అవగాహన ఉంటుందని కూడా చెబుతున్నారు. అదే సమయంలో ఇలా చెప్పేవారు కూడా తమ పిల్లల్ని ఇంగ్లిష్ మీడియంలోనే చదివించడానికి ఇష్టపడుతుండటం గ్రౌండ్ రియాల్టీ. ఈ విషయాలను పక్కనపెడితే జగన్ మాత్రం ఇంగ్లిష్ మీడియం విషయంలో పెద్ద రిస్క్ చేశారు, దాని ద్వారా తిప్పలు కొని తెచ్చుకున్నారు. సరైన ప్రణాళిక, సన్నద్ధత లేకుండానే ఇంగ్లిష్ మీడియం తేవడం వల్ల అంతిమంగా విద్యార్థులకు పెద్దగా ఉపయోగం లేదనేది అసలు వాదన. ఆ వాదన జనంలోకి బలంగా వెళ్లింది. ఇంగ్లిష్ మీడియంలో బోధించే ఉపాధ్యాయులు లేకుండా, కేవలం పుస్తకాల్లో ఇంగ్లిష్ ఉంటే విద్యార్థులకు లాభమేనా అనే చర్చ జరిగింది. అటు ఇంగ్లిష్ చదవలేక, ఇటు తెలుగు రాక.. వారు ఇబ్బందులు పడ్డారనే అపవాదు కూడా ఉంది. అందుకే జగన్ ఈ విషయంలో ట్రోలింగ్ సబ్జెక్ట్ గా మారారు. సీపీ బ్రౌన్ ని తలచుకుని నివాళులర్పించినా కూడా ఆయనపై ట్రోలింగ్ ఆగకపోవడం గమనార్హం.
Also Read: జూబ్లీహిల్స్ ప్రచార బరిలో కేసీఆర్.. చివరకు అలా ముగించారు