సరిగ్గా 2024 సార్వత్రిక ఎన్నికల వేళ గడప గడపకు వైసీపీ అంటూ జగన్ ఓ కార్యక్రమం మొదలు పెట్టారు. దానికి ఆ తర్వాత గడప గడపకు మన ప్రభుత్వం అని పేరు మార్చారు. ఎన్నికల నాటికి స్థానిక ఎమ్మెల్యే ప్రతి ఇంటి తలుపు తట్టాలని, ప్రతి గడప తొక్కి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం చేపట్టాలనేది ఆయన కోరిక. కానీ అది సగమే ఫలించింది. అదే అస్త్రాన్ని ఇప్పుడు సమర్థంగా వినియోగించుకోవాలని చూస్తున్నారు చంద్రబాబు. ఎన్నికలై రెండేళ్లు గడవకముందే ఎమ్మెల్యేలను పరుగులు పెట్టిస్తున్నారు. నిత్యం జనాల్లో ఉండేలా చూస్తున్నారు. పింఛన్ల పంపిణీలో భాగస్వామ్యం చేస్తున్నారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర ద్వారా నెలకోసారి నియోజకవర్గంలో ర్యాలీలు చేపట్టేలా చేశారు. ప్రజా దర్బార్ నిర్వహించని వారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో అలసత్వం వహిస్తున్న వారికి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పట్నుంచే ఎమ్మెల్యేలు జనంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు.
జనంలో ఉంటేనే
నాయకులేనావారు ఎన్నికల సమయంలోనే సామాన్య జనాలకు కనపడతారు. మిగతా సమయంలో జనాలే ఆయన దర్శనం కోసం వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఇది సాధ్యం కాదు. అందుకే పార్టీ అధినేతలతో సహా అందరూ జనంలోకి వస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లారు కానీ 2024 తర్వాత ఆయన స్ట్రాటజీ పూర్తిగా మారిపోయింది. ఏదో ఒక కార్యక్రమంతో నిత్యం ప్రజల్లోకి వెళ్తున్నారు. గతంలో జగన్ బటన్ నొక్కేందుకు భారీ బహిరంగ సభలు పెట్టి వెళ్లేవారు. ఇప్పుడు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల సమయంలో చంద్రబాబు నేరుగా ప్రజల వద్దకే వస్తున్నారు. వారి పక్కనే కూర్చుని మాట్లాడుతున్నారు. పి-4 పేరుతో బంగారు కుటుంబాలు, మార్గదర్శులు అంటూ నిత్యం ప్రజలతో మమేకం అవుతున్నారు.
నాతోపాటు మీరు కూడా
పార్టీ అధినేత ఒక్కరే జనంలో ఉంటే సరిపోతుందా, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అంతకంటే ఎక్కువగా ప్రజలతో మమేకం అయితేనే 2029 నాటికి ఎన్నికలను ధీటుగా ఎదుర్కోవచ్చని అంటున్నారు చంద్రబాబు. అందుకే ఆయన ఎమ్మెల్యేలను జనాలకు దగ్గర చేస్తున్నారు. ప్రజా దర్బార్ సరిగా చేపట్టనివారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించాలని, అదే రోజు సాయంత్రం పార్టీ కార్యకర్తలతో సమావేశం కావాలని ఆదేశించారు. వైద్య ఖర్చులు భరించలేని పేదలు సీఎంఆర్ఎఫ్ ద్వారా కాస్త సాంత్వన పొందుతుంటారు. అలాంటి వారికోసం స్థానిక ఎమ్మెల్యేలు సీఎంఆర్ఎఫ్ సాయం కోసం సిఫారసు లేఖలు ఇస్తుంటారు. ఇటీవల ఇలాంటి లేఖల విషయంలో కొంతమంది అలసత్వంగా ఉన్నారనే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వచ్చింది. దీంతో ఆయన వెంటనే ఆయా ఎమ్మెల్యేల లెక్క తీశారు. ప్రజలకు సిఫారసు లేఖలు ఇవ్వడంలో కూడా అభ్యంతరం ఏంటని ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.
Also Read: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గట్టి షాక్..
ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉంది. కానీ చంద్రబాబు మాత్రం ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలి పెట్టడం లేదు. గతంలో జగన్ చేసిన తప్పుల్ని అస్సలు రిపీట్ కానివ్వడం లేదు. ఇటు ప్రజలు, అటు పార్టీ కార్యకర్తలు ఇద్దర్నీ దగ్గరకు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికలకు ఇప్పట్నుంచే సరైన ప్లాట్ ఫామ్ రెడీ చేస్తున్నారు.
Also Read: జూబ్లీహిల్స్ ప్రచార బరిలో కేసీఆర్.. చివరకు అలా ముగించారు