Moringa Oil Benefits: నేచురల్ అందాన్ని పొందడానికి అమ్మాయిలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకోసం వంటింట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాల్నీ కూడా సౌందర్య పోషన కోసం వాడుతుంటారు. అయితే, మనం రోజూ వాడే బ్యూటీ ప్రొడక్ట్స్‌తో మునగ నూనెను కూడా వాడమని సలహా ఇస్తున్నారు నిపుణులు. చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో ఈ మునక నూనె కీలకంగా పనిచేస్తుందంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఈ నూనె కేవలం చర్మాన్ని రక్షించడమే కాకుండా.. మీ అందాన్ని రెట్టింపు చేయడంలో సమర్థంగా పనిచేస్తుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మానికి మునగ నూనె రాసుకోవడం వల్ల పొల్యూషన్ ప్రభావంతో పాడైన మీ చర్మాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చు. దీంతోపాటు రోజువారీ పనుల వల్ల కలిగే అలసట, ఒత్తిళ్ల నుంచి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది. ఇక ఈ నూనెను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే చర్మం మృదువుగా మారడమే కాకుండా ప్రకాశవంతంగానూ కనిపిస్తుందని సూచిస్తున్నారు నిపుణులు.
శీతాకాలంలో చాలామందికి చర్మం పొడిబారిపోతుంటుంది. ఇలాంటి సమయంలో మునగ నూనె నూనె రాసుకుంటే ఎంతో మేలు. ఇది నేరుగా చర్మం లోపలి పొరల్లోకి ఇంకి తేమనందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నూనెను పగిలిన పెదవులకు అప్లై చేసుకుంటే.. అవి తిరిగి మృదువుగా మారతాయని సూచిస్తున్నారు. ఇందులో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు చర్మానికి తేమతో పాటు పోషణ కూడా అందిస్తాయట.
మునగ నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. మోరింగ ఆయిల్‌లోని సి విటమిన్ కొలాజెన్ ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేసి చర్మం ముడతలు పడకుండా సంరక్షిస్తుంది. కాబట్టి.. వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు. స్నానం చేసిన తర్వాత చర్మానికి ఈ ఆయిల్‌తో మర్ధన చేసుకోవడం వల్ల రోజంతా తేమ నిలిచి ఉంటుంది. మోరింగ నూనెలో యాంటీమైక్రోబయల్, యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి ముడతలు, నిర్జీవమైన చర్మం వంటి వృద్ధాప్య ప్రభావాలతో సహా అనేక చర్మ సమస్యలకు సహాయపడతాయని సలహా ఇస్తున్నారు నిపుణులు.