Minister Kandula Durgesh request to producers: రాష్ట్రంలో స్టూడియోలు నిర్మించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఏపీలో స్టూడియోలు నిర్మించాలని, ప్రభుత్వం రాయితీలు ఇస్తుందని వెల్లడించారు.
ఏపీలో స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్స్ పెట్టండని, సింగిల్ విండోలో అన్ని అనుమతులు ఇస్తామని కందుల దుర్గేష్ చెప్పారు. త్వరలోనే సీఎం చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినీ ప్రముఖులతో సమావేశం ఉంటుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో షూటింగ్స్ మరింతగా పెరగాలని, సినీ పరిశ్రమకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని మంత్రి చెప్పారు..
అలాగే, నంది అవార్డుల ప్రదానంతోపాటు నంది నాటకాల ఉత్సవాలపై సైతం త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని దుర్గేష్ పేర్కొన్నారు. పర్యాటక రంగంలో ఏపీని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయంతో నాలుగు టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే సినీ ప్రముఖులు డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారని, త్వరలోనే సీఎం చంద్రబాబును సైతం కలుస్తారన్నారు. ఇండస్ట్రీకి 60 శాతం ఆదాయం ఏపీ నుంచి వస్తోందని, అందుకే ఏపీలోనూ స్టూడియోలు నిర్మాణం కావాలని పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమ తరలివస్తే పూర్తిగా సహకరిస్తామని దుర్గేష్ వెల్లడించారు.
Also Read: తిరుమల లడ్డూపై వివాదం.. వేంకటేశ్వరుడికి మచ్చతెచ్చేలా మాజీ సీఎం చేశారా?
ఇందులో భాగంగా, శ్రీశైలం, అఖండ గోదావరి, సూర్యలంక బీచ్, సంగమేశ్వరం వంటి ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వ పథకాలతో దాదాపు రూ.250 కోట్లతో అభివృద్ధి చేస్తామని మంత్రి దుర్గేష్ చెప్పారు.
అలాగే, సినిమా నిర్మాతలు షూటింగ్స్ బాగా చేస్తున్నారని, అన్ని ప్రాంతాల గురించి ప్రత్యేకంగా తెలియజేస్తున్నారని మంత్రి అన్నారు. మారేడుపల్లి, తిరుపతి, కోనసీమ వంటి ప్రాంతాలను చూపిస్తున్నారని, అయినప్పటికీ షూటింగ్స్, డబ్బింగ్ వంటి వాటి కోసం హైదరాబాద్ ప్రాంతంపై ఆధారపడాల్సి వస్తుందన్నారు.
అలా కాకుండా, నిర్మాతలు ఏపీలోనూ సింగిల్ విండో విధానంలో షూటింగ్స్ చేసుకునేందుకు పూర్తి స్థాయిలో అవకాశాలు కల్పిస్తామన్నారు. దీంతో పాటు రాష్ట్రంలో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. షూటింగ్, స్టూడియోలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని, సహకారం అందిస్తామని లేఖ రాశామన్నారు.